GHMC Council Meeting: రాష్ట్రంలోనే అత్యధిక జనాభాకు పౌర సేవలనందించే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సాధారణ సమావేశం సజావుగా సాగింది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన ఉదయం పదిన్నర గంటల తర్వాత ప్రారంభమైన కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జీహెచ్ఎంసీకి సర్కారు ఇటీవలే హెచ్ సిటీ పనులకు నిధులు విడుదల చేసినందుకు మేయర్ తన ప్రసంగంలో సర్కారుకు ధన్యవాదాలు తెలియజేసినానంతరం ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా స్పోర్ట్స్, స్ట్రీట్ లైట్లు, టౌన్ ప్లానింగ్ భవన అనుమతుల జారీకి సరి కొత్తగా ప్రవేశపెట్టిన బిల్డ్ నౌ అంశాలపైనే విస్తృతంగా చర్చ జరిగింది.
మొఘల్ పురా స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఔట్ సోర్స్ ప్రాతిపదికన కోచ్ లు విధులు నిర్వహిస్తున్నారని, ఇంకా చాలా స్పొర్ట్స్ కాంప్లెక్స్ లలో కనీసం మౌలిక వసతుల్లేవని కార్పొరేటర్ సయ్యద్ సోహెల్ ఖాద్రి ప్రశ్నతో మొదలైన ప్రశ్నోత్తరాల పర్వం దాదాపు సభ ముగిసే వరకు జరిగింది. ఒక్క క్రీడలు, వివిధ అంశాల్లో క్రీడల కోచ్ లు, క్రీడా మైదానాల్లో మౌలిక వసతుల కొరత వంటి అంశాలపైనే దాదాపు గంటన్నర సేపు సభ్యులు సంధించిన ప్రశ్నలకు కమిషనర్ ఆర్. వి. కర్ణన్, అదనపు కమిషనర్ యాదగిరిరావు లు సమాధానాలు చెప్పారు. ఆ తర్వాత తిరిగి ప్రారంభమైన కౌన్సిల్ సమావేశంలో స్ట్రీట్ లైట్ల నిర్వహణ, బిల్డ్ నౌ, ఆ తర్వాత నాలాలు, అడ్వర్ టైజ్ మెంట్లపై సభ్యుల ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పారు.
Also Read: MLC Kavitha: రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ కు నోటీసులు.. ఏం తప్పు చేశారని ఇచ్చారు?
గతంలో జరిగిన సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నకు అధికారులు సమాధానం చెబుతున్న సమయంలో మరో సభ్యుడు ఇంకో ప్రశ్నను సంధించే వారు. దీంతో మొదట ప్రశ్న అడిగిన సభ్యుడికి అధికారుల నుంచి అసంపూర్తిగానే సమాధానం వచ్చేది. కానీ ఈ సారి వ్యూహాత్మకంగా వ్యవహారించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సభ్యుల ప్రశ్నకు అధికారులు వివరాణత్మకమైన సమాధానం చెప్పేలా వారిని ఆదేశించారు. ఒక ప్రశ్నకు అధికారులు సమాధానం చెబుతున్న సమయంలో ఇతర సభ్యులు జోక్యం చేసుకున్నా, మేయర్ వారిని కూర్చోమని ఆదేశించి, మరీ అధికారులు సమాధానం చెప్పేలా టార్గెట్ చేస్తూ సభను నిర్వహించారు.
డిప్యూటీ మేయర్ కు దక్కిన అరుదైన అవకాశం
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డికి అరుదైన అవకాశం దక్కింది. స్పొర్ట్స్ విభాగంపై ప్రశ్నోత్తరాల పర్వం జరుగుతున్నపుడే 2 గంటల 15 నిమిషాలకు భోజన విరామాన్ని మేయర్ విజయలక్ష్మి ప్రకటిస్తూ బ్రేక్ ఇచ్చారు. తిరిగి మూడు గంటల 15 నిమిషాలకు సభను ప్రారంభించేందుకు డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గౌనుతో మేయర్ కుర్చీలో దర్శనమిచ్చారు. దీంతో చాలా మంది సభ్యులు ఒకింత ఆశ్చర్యానికి గురై, మేయర్ గా సభను నడిపే అవకాశం దక్కినందుకు డిప్యూటీ మేయర్ ను అభినందించారు. సభను నడిపే అరుదైన అవకాశం తనకిచ్చినందుకు డిప్యూటీ మేయర్ మేయర్ విజయలక్ష్మికి ధన్యవాదాలు తెలిపారు.
శ్రీలత శోభన్ రెడ్డి అధ్యక్షతన తిరిగి ప్రారంభమైన సభలో సుమారు 45 నిమిషాల పాటు అర్బన్ బయో డైవర్శిటీ విభాగంలోని పార్కుల నిర్వహణ, హరితహారం కింద నాటిన మొక్కలు నిర్వహణతో పాటు బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీలోని అవకతవకలపై సభ్యులు ప్రశ్నలు సంధించారు. బాలాపూర్ ప్రాంతంలో వేల సంఖ్యలో రోహింగ్యాలున్నారని, వారంతా జీహెచ్ఎంసీ అడ్డదారిలో జారీ చేసిన బర్త్ సర్టిఫికెట్లతో పాస్ పోర్టులు పొందుతున్నారని బీజేపీ సభ్యులు వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీ, అధికార పార్టీ సభ్యుల మధ్య కాసేపు వాదనలు చోటుచేసుకున్నాయి.
Also Read: Harish Rao: బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తే.. రెడ్ బుక్ లో పేర్లు నమోదు!
బర్డ్ అండ్ డెత్ సర్టిఫికెట్లకు సంబంధించి సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిప్యూటీ మేయర్ అదనపు కమిషనర్ (హెల్త్) పంకజను ఆదేశించారు. ఆ తర్వాత సమావేశానికి డిప్యూటీ మేయర్ బ్రేక్ ఇచ్చారు. తిరిగి నాలుగు గంటలకు ప్రారంభమైన సభను మళ్లీ మేయర్ గద్వాల్ విజయలక్ష్ని ముందుకు తీసుకెళ్లారు. సాయంత్రం 6 గంటల 55 నిమిషాల వరకు కొనసాగిన సభలో నాలాలు, అడ్వర్ టైజ్ మెంట్లపై సభ్యుల ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పిన తర్వాత మేయర్ కౌన్సిల్ సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
ఇదీ మూడోసారి
గడిచిన ఇరవై ఏళ్లలో డిప్యూటీ మేయర్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించటం ఇది మూడోసారి. 2002 నుంచి 2007 మధ్యనున్న పాలక మండలిలో నేరుగా ప్రజల నుంచి ఎన్నుకున్న మేయర్ గా
తీగల కృష్ణారెడ్డి వ్యవహారించగా, టీడీపీ, బీజేపీ మిత్ర పక్షాలుగా పాలక మండలిని ఏర్పాటు చేయటంలో భాగంగా డిప్యూటీ మేయర్ బీజేపీ నేత సుభాష్ చందర్జీకి కేటాయించారు.
అయిదేళ్ల పదవీ కాలంలో తనకు ఒక్కసారైనా కౌన్సిల్ సమావేశాన్ని నడిపే అవకాశం దక్కకపోదా, అంటూ సుభాష్ చందర్జీ పదవీ కాలం అయిదేళ్ల పాటు ఎదురుచూశారు. చివరకు 2007లో పాలక మండలి ముగిసిన రోజున ఆయనకు మేయర్ గౌన్ తొడిగి, ఫొటోలు దిగే అవకాశం కల్పించారు. తర్వాత 2016 నుంచి 2020 వరకున్న పాలక మండలిలో మేయర్ బొంతు రామ్మోహన్ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్ కు రెండు సార్లు కౌన్సిల్ సమావేశాన్ని నడిపే అవకాశాన్ని కల్పించగా, ఇపుడు తాజాగా బుధవారం జరిగిన కౌన్సిల్ సమావేశాన్ని నెర్వహించే అరుదైన మూడో అవకాశం డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డికి దక్కింది.
Also Read: Harish Rao on Congress: ఇదేనా ప్రజాపాలన?.. హరీష్ రావు సంచలన కామెంట్స్!