MLC Kavitha: రాజకీయ దురుద్దేశంతోనే మాజీ సీఎం కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు జారీ చేయించిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. కేసీఆర్ ఏం తప్పు చేశారని నోటీసులు జారీ చేశారని నిలదీశారు.కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు నోటీసులుఇవ్వడాన్ని నిరసిస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కేసీఆర్ కు నోటీసులంటే యావత్ తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్లేనని స్పష్టం చేశారు.
తెలంగాణ భూములకు నీళ్లు ఇవ్వడం కేసీఆర్ చేసిన తప్పా ? అభివృద్ధిలో నెంబర్ వన్ గా నిలబెట్టడం తప్పా ? అని ప్రశ్నించారు. కాళేశ్వరం కమిషన్ కాదు.. అది కాంగ్రెస్ కమిషన్, రాజకీయ కమిషన్ అని విమర్శించారు. కమిషన్ పై మాకు నమ్మకం ఉన్నది.. కానీ కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం లేదని స్పష్టం చేశారు. ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే 35 శాతం తెలంగాణ భూభాగానికి నీళ్లు అందిస్తుందని, 40 టీఎంసీలతో హైదరాబాద్ కు శాశ్వతంగా నీళ్లు ఇచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం అని స్పష్టం చేశారు. పరిశ్రమలకు 16 టీఎంసీల నీళ్లు అందించే ప్రాజెక్టు అన్నారు. కేసీఆర్ ది గట్టి గుండే కాబట్టి అంత పెద్ద ప్రాజెక్టును నిర్మించారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కలలో కూడా అంతపెద్ద ప్రాజెక్టును నిర్మించాలన్న ఆలోచన రాదన్నారు. తెలంగాణ సస్యశ్యామలం కావాలని నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం అని పేర్కొన్నారు.
Also Read: Harish Rao on Congress: ఇదేనా ప్రజాపాలన?.. హరీష్ రావు సంచలన కామెంట్స్!
దాదాపు 40 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని విమర్శించారు. కేసీఆర్ ని బద్నాం చేయడానికి మాత్రమే కాళేశ్వరం కమిషన్ వేశారని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ పాలనలో జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేస్తూ 90 శాతం పనులను మెఘా కృష్ణా రెడ్డి కంపెనీకి ఇచ్చారని గుర్తు చేశారు. మేడిగడ్డకు చిన్న చిన్న మరమ్మత్తులు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పొలాలను ఎండబెడుతోందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 15 పంప్ హౌజ్ పనులు చేసిన మెఘా కృష్ణా రెడ్డిని కమిషన్ ముందుకు పిలిచే ధైర్యం రేవంత్ రెడ్డికి లేకపోవడం సిగ్గుచేటని తీవ్రంగా విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం మాత్రమే పనిచేస్తోందని ధ్వజమెత్తారు. 90 శాతం పంప్ హౌజ్ ల పనులు చేసిన కాంట్రాక్టర్ ను ఎందుకు వదిలేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పౌరుషాన్ని చూపించాల్సిన సమయం వచ్చిందని అన్నారు.ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు వ్యతిరేకించడం లేదని నిలదీశారు. తెలంగాణ నీళ్లను ఏపీకి తరలించుకుపోతుంటే రేవంత్ రెడ్డి ఎందుకు కేంద్రానికి ఫిర్యాదు చేయడం లేదని ప్రశ్నించారు.
గోదావరి – పెన్నా అనుసంధానం పేరిట నీళ్లు తరలింపును తక్షణమే అడ్డుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఎన్డీఏలో ఉన్నందున జలదోపిడి చేసినా రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రశ్నించడం లేదని, 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏమీ తేవడం లేదని మండిపడ్డారు. బీజేపీలో ఉన్న ఒకే ఒక తెలంగాణ బిడ్డ ఈటల రాజేందర్ కూడా మాట్లడకపోవడం శోచనీయమని అన్నారు. బకనచర్ల ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేసే బాధ్యతను ఈటల రాజేందర్ తీసుకోవాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకొచ్చే బాధ్యతను కూడా ఈటల రాజేందర్ తీసుకోవాలని తెలిపారు. గోదావరి నీటిలో వెయ్యి టీఎంసీల హక్కును సాధించే వరకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని పునరుద్ఘాటించారు.
Also Read: Anganwadi Jobs: త్వరలోనే అంగన్వాడీల్లో.. 14వేల ఖాళీలు భర్తీ!
కాంగ్రెస్ చేపట్టిన దేవాదుల ప్రాజెక్టు పైపులు పలిగిపోయాయి.. ఎస్ఎల్బీసీ పనులు మొదలుపెడితే ప్రపంచం ముందు పరువు పోయేలా టన్నెల్ కూలిపోయింది.. రేవంత్ రెడ్డి ఒకసారి తన ముఖంను అద్దంలో చూసుకోవాలన్నారు. ఎస్ ఎల్ బీసీ టన్నెల్ కూలిపోతే ఎన్డీఎస్ఏ ఏం చేస్తున్నది.. కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు ? కాంగ్రెస్- బీజేపీ పార్టీలు కుమ్మక్కయ్యాయని స్పష్టమైందన్నారు. కాళేశ్వరం లేకపోతే 35 శాతం తెలంగాణ భూభాగం ఎడారిగా మారే ప్రమాదం ఉందని కాబట్టి తక్షణమే మేడిగడ్డ బ్యారేజీకి మనమత్తులు చేపట్టి పొలాలకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, ఉపాధ్యక్షుడు దాస్యం విజయభాస్కర్, శ్రీధర్ రావు, సంపత్ గౌడ్, మరిపెల్లి మాధవి, రాము యాదవ్, అప్పాల నరేందర్ యాదవ్, తానింకి కిషోర్ యాదవ్, పబ్బోజు విజేందర్, ఈగ సంతోష్, అర్చన సేనాపతి, మాడ హరీశ్ రెడ్డి, లలిత యాదవ్, పరకాల మనోజ్ గౌడ్, మహేందర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Indiramma Houses: అర్హులందరికీ దశల వారీగా.. ఇందిరమ్మ ఇండ్లు!