Anganwadi Jobs: అంగన్వాడి టీచర్లు, హెల్పర్ల పని ఒత్తిడిని తగ్గించేందుకు త్వరలో 14 వేల ఖాళీలను భర్తీ చేస్తామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ మూలంగా కాస్త ఆలస్యమైంది.. త్వరలో ఆ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. రాజేంద్రనగర్ లోని తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంస్థలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం మేదో మదన సదస్సు 2025 నిర్వహించారు. ఈ సదస్సులో మంత్రి పాల్గొని మాట్లాడుతూ అంగన్వాడీల్లో అందుతున్న సేవలను క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలిసేలా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సెల్ఫీ విత్ అంగన్వాడి నీ విజయవంతం చేయాలని ఆదేశించారు. అంగన్వాడి కేంద్రాలకు నాసిరకం సరుకులు సరఫరా చేసే సప్లయర్స్ ను బ్లాక్ లిస్టులో పెడుతున్నామని వెల్లడించారు. వారంలో ఒకటి రెండు సార్లు ఎగ్ బిర్యానీ వడ్డించేలా మెనూ మారుస్తామని స్పష్టం చేశారు.
అంగన్వాడి కేంద్రాల్లో ఏడాది 25% అడ్మిషన్లు పెరిగేలా సిబ్బంది మొత్తం చిత్తశుద్ధితో పని చేయాలని, బడి గంట తరహాలో అంగన్వాడీ కేంద్రాల్లోనూ బెల్సును తీసుకురావాలన్నారు. అంగన్వాడి కేంద్రాల్లో ఉదయం గంటను మోగించడం ద్వారా చిన్నారుల్లో ఉత్సాహం క్రమశిక్షణ పెరుగుతాయని, అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు సకాలంలో వచ్చేందుకు ఉపయోగపడుతోందన్నారు.మన పని తీరును మెరుగుపరిచేందుకు, మన బెస్ట్ ప్రాక్టీస్ ను విస్తరింప చేసేందుకు ఈ మేదో మదన సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
Also Read: Harish Rao on Congress: ఇదేనా ప్రజాపాలన?.. హరీష్ రావు సంచలన కామెంట్స్!
అంగన్వాడి కేంద్రాల్లో అందిస్తున్న విద్యను, ఆరోగ్య భద్రతను మెరుగుపరుచుకునే లక్ష్యంతో మనమంతా పనిచేయాలన్నారు. ఏదో మదన సదస్సులో మీరు వ్యక్తపరిచిన అభిప్రాయాలను క్రోడీకరించి, నిపుణులు మేధావులతో చర్చించి అంగన్వాడీ ల సేవలను మరింత మెరుగుపరుస్తామన్నారు. పంచాయతీరాజ్ శాఖలో 93 వేల మంది చిరు గ్రామీణ ఉద్యోగులకు గ్రీన్ ఛానల్ లో జీతాలు ఇస్తున్నామన్నారు.
అదే ఈ విధంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల జీతాలను గ్రీన్ ఛానల్ లో ప్రతినెలా అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంగన్వాడి కేంద్రాలను అక్షర జ్ఞానానికి, పోషకాహారానికి, ఆరోగ్యానికి, ఆటవిడుపుకు, మీతో వికాసానికి కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ప్లే స్కూల్ లకు దీటుగా అంగన్వాడీలను సిద్ధం చేసి తల్లిదండ్రుల ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నామన్నారు. చిన్నారుల చదువు, సౌకర్యం, ఆటవిడుపు కోసం 57 రకాల వస్తువులను అంగన్వాడీలకు సరఫరా చేస్తున్నామని, అంగన్వాడీలకు నమ్మకం కలిగించేలా అంగన్వాడి సిబ్బంది పని చేయాలని సూచించారు. అనాధ పిల్లలకు ప్రభుత్వమే తల్లిదండ్రులుగా ఉండి ఆధార్ కార్డులు ఇప్పిస్తున్నామన్నారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా దివ్యాంగుల ఉపకరణాల కోసం ప్రతి ఏడాది 50 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. అనంతరం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అంగన్వాడి చిన్నారుల అభ్యాసం కోసం వినూత్నంగా రూపొందించిన టీచింగ్ మెటీరియల్ స్టాల్ పరిశీలించి అభినందించారు. కార్యక్రమంలో టీజీ ఫుడ్స్ చైర్మన్ ఎంఏ ఫహిo, మహిళా శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read: Police Suspended: వృద్ధ రైతుపై పోలీసు జులుం.. మంత్రి సీతక్క సీరియస్.. అధికారి సస్పెండ్