Congress: మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు ప్రజా ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నది. ప్రతి పథకం మహిళల పేరుమీద ఇచ్చేందుకు రూపకల్పన చేస్తున్నది. ఇప్పటికే పలు పథకాలను ప్రవేశపెట్టింది. మరోవైపు మహిళలను కోటీశ్వరులను చేస్తామని ప్రకటించిన విధంగానే ప్రణాళికల ప్రకారం ముందుకెళ్తున్నది. త్వరలోనే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ సీట్లు మహిళలకు దక్కనున్నాయి. ఒకవైపు మహిళా రిజర్వేషన్, మరోవైపు బీసీ 42 శాతం రిజర్వేషన్లతో సగానికి పైగా సీట్లు రానున్నాయి. దీంతో వారి ఓట్లపై పార్టీలు ఫోకస్ పెడుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళల సంక్షేమంపై దృష్టిసారించింది. వారిని ఆర్థికంగా బలోపేతానికి చర్యలు చేపడుతున్నది. అందులో భాగంగానే కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని ప్రకటించి అందుకు అనుగుణంగా పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నది. మహిళలను పారిశ్రామిక రంగంలోనూ ప్రోత్సహించేందుకు అడుగులు వేస్తున్నది. 17 రకాల వ్యాపారాలను గుర్తించి మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. టీజీఐఐసీ ఏర్పాటు చేసే పారిశ్రామిక వాడల్లోనూ మహిళలకు ప్లాట్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నది. అదే విధంగా సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, రిటైల్ ఫిష్ వెహికిల్స్, సెర్ప్ ద్వారా 21466 కోట్లు వడ్డీలేని రుణాలు, శ్రీనిధితో 2022 కోట్ల లోన్లు, 150 ఆర్టీసీలో అద్దె బస్సులు, ఇందిరాశక్తి భవనాలు, యూనిఫాం కుట్టు ఛార్జీల పెంపు, మహిళా శక్తి క్యాంటీన్లు, ఉచిత బస్సు, మహిళాశక్తి బజార్, మహిళా సంఘాల సభ్యులకు 10 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నది.
రాష్ట్రంలో అత్యధికంగా మహిళా ఓటర్లే
తెలంగాణలో మొత్తంగా 3,35,27,925 మంది ఓటర్లు ఉండగా, అందులో 1,66,41,489 మంది పురుషులు, 1,68,67,735 మంది మహిళలు ఉన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా మహిళా ఓటర్లు ఉండటంతో వారికి త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కే అవకాశం ఉన్నది. ఇప్పటికే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. అయితే, మహిళా రిజర్వేషన్లకు ఆమోదం పొందితే చట్టబద్దంగా వారికి వాటా దక్కనున్నది. అంతేగాకుండా రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం ఫైట్ కొనసాగుతున్నది. ఇది కూడా కార్యరూపం దాల్చితే మహిళలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 50శాతం వరకు సీట్లు దక్కే అవకాశం లేకపోలేదు. దీంతో ముందస్తుగానే మహిళా ఓటర్లపై పార్టీలు ఫోకస్ పెడుతున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మహిళల సంక్షేమానికి పలు పథకాలకు శ్రీకారం చుట్టారు. గత బీఆర్ఎస్ పాలనలో మహిళలకు పెద్దపీట వేశామని, మహిళా రిజర్వేషన్‌తో మూడోవంతు సీట్లు ఆడబిడ్డలకి రాబోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం స్పష్టం చేశారు. వారి ఓట్ల కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేశారు.
Read Also- BJP: బీజేపీకి కొత్త తలనొప్పి.. డీకే అరుణ వర్సెస్ శాంతికుమార్
మహిళలకు చేరువయ్యేందుకు పార్టీల లాబీలు
స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మహిళలకు చేరువయ్యేందుకు పార్టీలు లాబీలు ప్రారంభించాయి. ఎవరికి వారుగా ఆకట్టుకునేందుకు పల్లెబాటపడుతున్నారు. ఆదివారం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మహిళల సమస్యలను తెలుసుకునేందుకు నాటువేస్తున్న దగ్గరికి వెళ్లి కూలీలలో మాటామంతి నిర్వహించారు. యోగాక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి సీతక్క ములుగు రెవెన్యూ గ్రామంలో పొలంలో నాటు వేసే కూలీల వద్దకు వెళ్లారు. కూలీల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వర్షం నుంచి రక్షణకై ప్రత్యేకంగా తయారు చేసిన కవర్లను కూలీలకు పంపిణీ చేశారు. స్వయంగా కవర్లను కూలీలకు తొడిగి, వారి సంక్షేమం, ఆరోగ్యంపై పలు సూచనలు చేశారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇతర సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయని మంత్రి అడిగి తెలుసుకున్నారు. రెండు మూడు రోజుల్లో అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు. స్వయంగా మంత్రి వచ్చి పలకరించడంతో మహిళలు సంతోషించారు. మరోవైపు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మచ్చాపురంలో పొలంలో నాటు వేస్తున్న కూలీల దగ్గరకు వెళ్లారు. వారితో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బతుకమ్మ చీరలు వస్తున్నాయా అని అడగా రావడం లేదని తెలిపారు. పింఛన్లపై, కరెంటుపై ఆరా తీశారు. భర్త చనిపోయి ఏడాది దాటినా పింఛన్ రావడం లేదని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ ధర పెరిగిందని తెలిపారు. కొత్త పింఛన్లు రావడం లేదని తెలిపారు. అన్ని సమస్యలపై ప్రభుత్వాన్ని బరాబర్ అడుగుదామని కవిత తెలిపారు.
రసవత్తరంగా మారనున్న స్థానిక ఎన్నికలు
ఈసారి జరిగే స్థానిక ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో మహిళా సంక్షేమానికి చేసిన పథకాలను వివరించాలని భావిస్తుండగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 19 నెలల్లో మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకాలను వివరించేందుకు సిద్ధమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మహిళా సంఘాలకు దసరాకు చీరలు పంపిణీ సైతం చేపడుతున్న అంశాన్ని సైతం వివరించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అయితే, ఏ పార్టీకి మహిళలు అండగా నిలబడతారనేది స్థానిక ఎన్నికల్లో స్పష్టం కానున్నది.