Etela New Party: తెలంగాణ రాజకీయాల్లో అతి త్వరలో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు తెలుస్తోంది. బీజేపీలో ముఖ్యనేతగా ఉన్న ఈటల రాజేందర్ (Etela Rajender) కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు సాలిడ్ సమాచారం అందుతోంది. తాజాగా హుజూరాబాద్ (Huzurabad) కార్యకర్తలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తున్నాయి. తానేమి నిస్సహాయ స్థితిలో లేనన్న ఈటల.. పదవుల కోసం ఎవరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. బీజేపీ అధ్యక్ష పీఠాన్ని ఆశించి భంగపడిన నేపథ్యంలో ఈటల.. ఈ విధమైన కామెంట్స్ చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఇదిలా ఉంటే ఈటల పెట్టబోయే కొత్త పార్టీ పేరు ఏంటీ? అతడు కొత్తపార్టీ పెడితే రాజకీయంగా కలిసి వచ్చే అంశాలేంటి? ఎదురయ్యే సవాళ్లు ఏవి? ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
ఈటల కొత్త పార్టీ అదే?
బీజేపీ పార్టీలో వరుస అవమానాలు ఎదుర్కొంటున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈటల రాజేందర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పెద్దగా గుర్తింపు ఇవ్వని కాషాయ పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీని ప్రారంభించడం దాదాపుగా ఖాయమైనట్లు తెలుస్తోంది. తను కొత్తగా స్థాపించబోయే పార్టీకి బహుజన జనతా సమితి (Bahujana Janatha Samithi – BJS) గా నామకరణం చేసినట్లు సమాచారం అందుతోంది. బీసీలే లక్ష్యంగా ఆయన ఈ పార్టీ పెట్టబోతున్నట్లు సమాచారం. ఈటల రాజేందర్ బీసీ (Backward Classes) సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. తెలంగాణలో బీసీ సమాజం గణనీయమైన ఓటు బ్యాంకును కలిగి ఉంది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) సైతం బీసీ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతూ గరం గరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీసీ హక్కుల కోసం బలమైన ఎజెండాను ముందుకు తీసుకొచ్చి.. తన సామాజిక వర్గం నుంచి గట్టి మద్దతు పొందాలని ఈటల భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పార్టీ పెడితే కలిసొచ్చే అంశాలు!
తెలంగాణ రాజకీయాల్లో బలమైన బీసీ నేతగా ఈటెల రాజేందర్ కు సముచిత స్థానమే ఉంది. ఉద్యమకాలం నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఅర్ (KCR) కు కుడి భుజంగా ఆయన ఉంటూ వచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS)లో ఆర్థిక, ఆరోగ్య మంత్రిగా పని చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ తో తలెత్తిన వివాదాల కారణంగా ఈటెల పార్టీ నుంచి బయటకొచ్చారు. కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఓ దశలో కేటీఆర్ తో ఢీ అంటే ఢీ అని పోరాడారు. అయితే బీజేపీలో చేరిన తర్వాత ఆయన కేసీఆర్ ను పెద్దగా టార్గెట్ చేసింది లేదు. కొత్త పార్టీ స్థాపించడం ద్వారా తిరిగి కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుంటే తిరిగి రాష్ట్రంలో తన మైలేజ్ ను పెంచుకోవడంతో పాటు ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చని ఈటల భావిస్తున్నట్లు తెలుస్తోంది.
బీజేపీలో అసంతృప్తి
బీసీ రిజర్వేషన్ల అంశంలో తెలంగాణ బీజేపీ అనుసరిస్తున్న వైఖరిపై సొంత పార్టీ బీసీ నేతలే అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈటల బీజేపీ నుంచి బయటకొచ్చి.. కొత్త పార్టీ పెడితే.. కాషాయ పార్టీలోని అసంతృప్త బీసీ నేతలంతా ఈటల వెంట వచ్చే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బలమైన బీసీ నేపథ్యం కలిగిన ఈటలకు బీజేపీ అధినాయకత్వం తగిన ప్రాధాన్యం ఇవ్వలేదన్న ప్రచారమూ బలంగా ప్రజల్లోకి వెళ్లింది. ఇది ఈటల కొత్త పార్టీకి కలిసొచ్చే అవకాశముందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగించుకునే అతికొద్ది మంది తెలంగాణ రాజకీయ నేతల్లో ఈటల రాజేందర్ ఒకరు. కొత్త పార్టీ పెట్టినప్పుడు రాష్ట్రంలోని యువత, వివిధ సామాజిక వర్గాలను ఆకర్షించడానికి ఇది ఉపయోగపడే అవకాశముంది.
Also Read: Etela Rajender: బీజేపీలో ముదిరిన అంతర్యుద్ధం.. పరోక్షంగా సొంత నేతలనే ఏకిపారేసిన ఈటల!
సవాళ్లు తట్టుకోగలరా?
అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) పార్టీల మధ్య ముక్కోణపు పోటీ నెలకొని ఉంది. ఆ పార్టీలను ఎదుర్కొని బలమైన నాల్గో శక్తిగా బీజేఎస్ (Bahujana Janatha Samithi) నిలబడగలదా? అన్నది ఈటలకు అదిపెద్ద సవాలుగా మారే అవకాశముంది. అంతేకాదు ఒక పార్టీ స్థాపించాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. కొత్తపార్టీ పెట్టడానికి ఈటల వద్ద ఉన్న ఆర్థిక వనరులు సరిపోతాయా? అన్నది ప్రధాన అంశంగా మారనుంది. ఇప్పటివరకూ ఒక ప్రాంతానికి లేదా బీసీ వర్గానికి నేతగా ఉంటూ వచ్చిన ఈటల.. కొత్త పార్టీ పెడితే రాష్ట్ర స్థాయిలో అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ సవాళ్లను ఈటల సమర్థవంతంగా ఎదుర్కొనే దాన్ని బట్టే అతడు స్థాపించబోయే పార్టీ భవిష్యత్ ఆధారపడుతుంది.