Manchu Lakshmi: మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో, మోహన్ బాబు (Mohan Babu) ఓ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘దక్ష’ (Daksha). ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలై మంచి స్పందననే రాబట్టుకుంటోంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఓ యూట్యూబర్ తనని బాగా ఇబ్బంది పెట్టాడని, అతనిపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులో ఆమె చాలా విషయాలు చెప్పుకొచ్చారు. ఆమె తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC)కు ఇచ్చిన ఫిర్యాదును గమనిస్తే..
‘‘నాలుగేళ్లకు పైగా విరామం తర్వాత, నేను నిర్మించి, మా నాన్నగారు, లెజెండరీ మోహన్ బాబుతో కలిసి నటించిన ఒక సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చాను. గౌరవపూర్వకంగా, మేము సదరు జర్నలిస్ట్‌కు రోజులో మొదటి ఇంటర్వ్యూ స్లాట్ ఇచ్చాము. దురదృష్టవశాత్తు, అక్కడ జరిగింది ఇంటర్వ్యూ కాదు, నాపై దాడి. సినిమా గురించి, అందులో ఉన్న కళ గురించి, ఈ ప్రాజెక్ట్‌ను తెరపైకి తీసుకురావడానికి పడిన అపారమైన కృషి గురించి మాట్లాడటానికి బదులుగా.. ఆయన నా వయస్సు, శరీరం, నేను వేసుకునే దుస్తులను లక్ష్యంగా చేసుకుని కించపరిచారు. అసంబద్ధమైన మాటలెన్నో మాట్లాడారు. ఆయన ప్రశ్నల ఉద్దేశ్యం నా పనిని అర్థం చేసుకోవడం కాదు.. కేవలం రెచ్చగొట్టడం, కించపరచడం, నన్ను చిన్నబుచ్చడం మాత్రమే.
Also Read- Washi Yo Washi: డేగ ఓ డేగ.. ‘ఓజీ’ సర్‌ప్రైజ్ వీడియో.. ఇప్పుడే పోయేలా ఉన్నారుగా!
బలిచ్చి ‘వైరల్’ అవ్వడానికి చేసిన ఒక ప్రయత్నం
ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. జర్నలిజం పట్ల, నిజం బయటపెట్టడానికి తమ జీవితాలను అంకితం చేసిన జర్నలిస్టుల పట్ల నాకు అత్యంత గౌరవం ఉంది. ఇది ఒక గొప్ప వృత్తి, నిజాయితీతో ఈ పని చేస్తే సమాచారాన్ని అందించడానికి, మార్చడానికి, ప్రేరణ కలిగించడానికి దీనికి శక్తి ఉంది. అందుకే, ఒకరు ఇలా తమ వేదికను దుర్వినియోగం చేసి, తమ బాధ్యతను మోసం చేసినప్పుడు మరింత నిరాశ కలుగుతుంది. ఇది జర్నలిజం కాదు. ఇది విమర్శ కాదు. ఇది ఒక వ్యక్తి గౌరవాన్ని బలిచ్చి ‘వైరల్’ అవ్వడానికి చేసిన ఒక ప్రయత్నం. నిజానికి, ‘నొప్పికలిగించినా పర్లేదు, కనీసం వైరల్ అవుతుంది కదా’ అని ఆయన స్వయంగా ఇంటర్వ్యూలో అన్నారు. ఈ మనస్తత్వం వృత్తిపరం కాకపోవడం మాత్రమే కాదు, చాలా ప్రమాదకరం.
పురుషాధిక్యత ఉన్న ఈ పరిశ్రమలో ఒక మహిళగా, నేను గట్టిగా నిలబడ్డాను, ఎన్నో యుద్ధాలు చేశాను. ఆయన వ్యాఖ్యలను నేను హుందాగా ఎదుర్కొన్నాను, కానీ మౌనంగా ఉండటం సరైనది కాదు. నేను దీన్ని అదుపు చేయకపోతే, ఈ ప్రవర్తన నాకు మాత్రమే కాదు, పరిశ్రమలో తమను తాము కాపాడుకోలేని స్థితిలో ఉన్న లెక్కలేనన్ని ఇతర మహిళల పట్ల కూడా కొనసాగుతుంది. నేను సానుభూతి కోరడం లేదు. నేను జవాబుదారీతనం కోరుతున్నాను. ఆయన ఈ విధంగా ప్రవర్తించడం ఇది మొదటిసారి కాదు. ఆయన పదేపదే ఇలాంటి అవమానకరమైన ప్రవర్తనను ప్రదర్శించడం వృత్తిపరమైన వాతావరణంలో సరికాదు. కాబట్టి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, అధికారికంగా హెచ్చరిక జారీ చేయాలని నేను కోరుతున్నాను.
Also Read- Kantara Chapter 1: ‘ఓజీ’ ట్రీట్ అయిన వెంటనే ‘కాంతార 2’ ట్రీట్.. ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది
మరే మహిళా బాధితురాలు కాకుండా ఉండాలనే..
భారతదేశం స్త్రీలను శక్తి స్వరూపిణిగా పూజిస్తుంది, అయినా మనం వృత్తిపరమైన రంగాల్లోకి అడుగుపెట్టినప్పుడు నిరంతరం అవమానాలు, అమర్యాదలను ఎదుర్కొంటున్నాం. ఇది ఇక కొనసాగడానికి వీల్లేదు. నేను దీనిపై గళమెత్తడం నాకు మాత్రమే కాకుండా, నన్ను ఆదర్శంగా భావించే ఎంతోమంది యువ మహిళల కోసం నా బాధ్యతగా భావిస్తున్నాను. ఒక పబ్లిక్ ఫిగర్‌గా, కఠినమైన ప్రశ్నలకు, విమర్శలకు, పరిశీలనకు నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. కానీ, జర్నలిజం ముసుగులో జరిగే క్రూరత్వాన్ని నేను సహించను. సదరు జర్నలిస్ట్ నుంచి నేను బహిరంగ క్షమాపణను ఆశిస్తున్నాను. ఇలాంటి దుష్ప్రవర్తనకు మరే మహిళా బాధితురాలు కాకుండా ఉండేందుకు, ఆయన చర్యలను ఛాంబర్ సీరియస్‌గా తీసుకోవాలని నేను కోరుతున్నాను. గౌరవం విషయంలో ఆప్షన్ ఉండదు. జవాబుదారీతనం అనేది బేరసారాలకు అతీతం’’ అని మంచు లక్ష్మీ తన ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫిర్యాదుపై టాలీవుడ్ సర్కిల్స్‌లో చర్చలు మొదలయ్యాయి. దీనిపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు