45 Official Trailer: కన్నడ సినీ పరిశ్రమలోని అగ్ర తారలు డాక్టర్ శివరాజ్‌కుమార్ (Dr.Shivarajkumar), ఉపేంద్ర (Upendra), రాజ్ బి శెట్టి (Raj B Shetty) వంటి బిగ్గెస్ట్ స్టార్స్ కలిసి నటించిన ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘45’ (ఫార్టీ ఫైవ్). ఈ చిత్ర తెలుగు ట్రైలర్ (45 Movie Telugu Trailer)ను సోమవారం మేకర్స్ విడుదల చేశారు. భారీ యాక్షన్, డ్రామా అంశాలతో పాటు లోతైన తాత్వికతతో వచ్చిన ఈ ట్రైలర్ తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని 1 జనవరి 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోందని, మేకర్స్ ఈ ట్రైలర్‌లో తెలియజేశారు. సంగీత దర్శకుడు అర్జున్ జన్య ఈ చిత్రంతో దర్శకుడిగా తొలి అడుగు వేస్తున్నారు. ఈ చిత్రానికి కథ, సంగీతం, దర్శకత్వం అన్నీ ఆయనే వహించడం విశేషం. కోవిడ్-19 సమయంలో తన సోదరుడిని కోల్పోవడం, వ్యక్తిగత ఆరోగ్యం దెబ్బతినడం వంటి అనుభవాల నుంచి ఈ కథ పుట్టిందని, జీవితం, మరణం, ఆత్మ ప్రయాణం వంటి అంశాలపై తన ప్రశ్నలే ఈ చిత్రానికి పునాది అయ్యాయని అర్జున్ జన్య (Arjun Janya) ఇప్పటికే తెలిపి ఉన్నారు. ఇక ఈ ట్రైలర్‌ని గమనిస్తే…
Also Read- Bigg Boss Buzzz: నా హార్ట్ నా మైండ్‌ని డామినేట్ చేసింది.. భరణి సంచలన వ్యాఖ్యలు
పురాణాల స్ఫూర్తితో ప్లాట్
‘45’ సినిమా యొక్క ముఖ్య ఇతివృత్తం హిందూ ధర్మం (సనాతన ధర్మం)లోని ఒక ఆధ్యాత్మిక నమ్మకం ఆధారంగా రూపొందించబడింది. మరణం తర్వాత ఆత్మ యొక్క ప్రయాణం నిర్ణయించబడే 45 రోజుల కాలం గురించి ఈ చిత్రం ప్రధానంగా చర్చిస్తుంది. ఈ కథ మార్కండేయుడి పురాణ గాథ నుండి స్ఫూర్తి పొందినట్లు ట్రైలర్ సూచిస్తోంది. ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్ శివుడి పాత్రలో, ఉపేంద్ర యముడి పాత్రలో, రాజ్ బి శెట్టి మార్కండేయుడిని పోలిన పాత్రలలో కనిపిస్తారని సమాచారం. అంటే, ఒక అమాయకుడిని కాపాడేందుకు శివుడు, యముడికి మధ్య జరిగే పోరాటంగా ఈ కథ ఉండవచ్చని తెలుస్తోంది. ‘అక్కడ ఒక సమాధి చూస్తున్నావు కదా.. ఆ సమాధి మధ్య మనిషి పుట్టిన తేదీ డ్యాష్, మరణించిన తేదీ రాసి ఉంటుంది. ఆ మధ్యన ఉన్న చిన్న డ్యాషే మనిషి మొత్తం జీవితం’ అనే డైలాగ్‌తో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ఇక ఈ ట్రైలర్‌లో ఇచ్చిన ట్విస్ట్ అయితే.. చెబితే సరిపోదు.. చూడాల్సిందే.
Also Read- Jinn Trailer: భూతనాల చెరువు కాలేజ్‌లో దాగి వున్న మిస్టరీ ఏంటి? ఇది ‘జిన్’ ఆడే ఆట!
అత్యున్నత స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్
దర్శకుడు అర్జున్ జన్య ఈ చిత్రాన్ని సాంకేతికపరంగా అత్యున్నత స్థాయిలో రూపొందించారు. ఈ సినిమా మొత్తం విజువల్ ఎఫెక్ట్స్ (VFX)పై ఆధారపడి ఉంటుందనే విషయం ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. ఇందుకోసం హాలీవుడ్ స్థాయి వీఎఫ్‌ఎక్స్ కంపెనీ అయిన మార్జ్ స్టూడియోతో (కెనడా) కలిసి పనిచేశారు. సత్య హెగ్డే అందించిన సినిమాటోగ్రఫీ, డాక్టర్ కే. రవివర్మ వంటి దిగ్గజాలు కంపోజ్ చేసిన హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాపై అంచనాలను అమాంతం పెంచాయి. సురాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రమేష్ రెడ్డి, ఉమ నిర్మించిన ఈ చిత్రం, కేవలం కమర్షియల్ యాక్షన్‌నే కాకుండా, లోతైన భావోద్వేగాలు, తాత్విక అంశాలను అందిస్తుందని ట్రైలర్ తెలియజేస్తుంది. శివరాజ్‌కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి వంటి మూడు విభిన్న నటనా శైలి ఉన్న నటులు ఒకే స్క్రీన్‌పై కనిపించడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ వైరల్ అవుతోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

