Huzurabad Crime News: ఇల్లంతకుంట మండలం టేకుర్తి గ్రామంలో ఏడు నెలల గర్భిణిని దారుణంగా హత్య చేసిన కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఈ హత్యకు (Huzurabad Crime) పాల్పడిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి నేరానికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు కరీంనగర్ పోలీస్(Karimnagar Police) కమిషనరేట్ ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించింది. పోలీసుల వివరాల ప్రకారం, టేకుర్తి గ్రామానికి చెందిన ముద్రబోయిన రాములు (40) వృత్తిరీత్యా ఒగ్గు కథలు చెబుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి 20 ఏళ్ల క్రితం రేణుక (38)తో వివాహం జరగగా, వారికి అభిలాష్ (21), బన్నీ తేజ (19) అనే ఇద్దరు కుమారులున్నారు.
Also Read: Bathukamma festival 2025: బతుకమ్మకు బల్దియా ఏర్పాట్లు.. 28న గిన్నీస్ రికార్డు లక్ష్యంగా ఉత్సవాలు
తిరుమల (35)తో రాములుకు పరిచయం
ఏడు సంవత్సరాల క్రితం, వరంగల్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న చిగురుమామిడి మండలం బొమ్మనపల్లికి చెందిన తిరుమల (35)తో రాములుకు పరిచయం ఏర్పడింది. అప్పటికే పెళ్ళై భర్త నుంచి విడిగా ఉంటున్న తిరుమలను రాములు రెండో వివాహం చేసుకుని టేకుర్తిలో వేరు కాపురం పెట్టాడు. తిరుమల గర్భం దాల్చడంతో, ఆమెపై మొదటి భార్య రేణుక, ఆమె కుమారులు కక్ష పెంచుకున్నారు. రాములుకు కూడా తిరుమల గర్భం దాల్చడం ఇష్టం లేదని పోలీసులు తెలిపారు. దీంతో రాములు, రేణుక, మరియు వారి కుమారులు అభిలాష్, బన్నీ తేజలు తిరుమలను చంపాలని కుట్ర పన్నారు.
కత్తితో బన్నీ తేజ విచక్షణారహితంగా తిరుమల గొంతు కోసి
తిరుమల ఒంటరిగా ఉన్న సమయం చూసి, బన్నీ తేజను ఆమెను చంపడానికి పంపించారు. ముందుగా సిద్ధం చేసుకున్న కత్తితో బన్నీ తేజ విచక్షణారహితంగా తిరుమల గొంతు కోసి, పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఇల్లంతకుంట పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. హుజురాబాద్ ఇన్‌ఛార్జి ఏసీపీ శ్రీనివాస్ జీ పర్యవేక్షణలో గాలింపు చేపట్టి, పారిపోతున్న నిందితులను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచినట్లు తెలిపారు. ఈ కేసును తక్కువ సమయంలోనే ఛేదించి, నిందితులను పట్టుకున్న జమ్మికుంట రూరల్ సీఐ కె. లక్ష్మీనారాయణ, ఇల్లంతకుంట ఎస్సై క్రాంతి కుమార్‌లను పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అభినందించారు.
Also Read: Hyderabad Rains: రికార్డు స్థాయిలో నమోదైన వర్షపాతం.. జలమయమైన సిటీ రోడ్లు
మంత్రాల ముసుగులో వృద్ధురాలు దారుణ హత్య.. ముగ్గురు నిందితుల అరెస్ట్
మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో ఒక వృద్ధురాలిని క్రూరంగా హత్య చేసిన ఘటన నెల్లికుదురులో చోటుచేసుకుంది. ఈ కేసును వెంటనే ఛేదించిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. డి.ఎస్.పి కృష్ణ కిషోర్ తెలిపిన వివరాల ప్రకారం నెల్లికుదురు గ్రామానికి చెందిన వీరగాని రాధమ్మ (80) అనే వృద్ధురాలు తన ఇంటి వద్ద ఒంటరిగా నివసిస్తూ గుడుంబా విక్రయించేది. రాధమ్మ తనకు మంత్రాలు చేస్తుందని అనుమానించిన వీరగాని ఉప్పలయ్య (44), అతని తమ్ముడు మహేష్ (42) ఆమెను హతమార్చాలని పన్నాగం పన్నారు. సెప్టెంబర్ 12న రాత్రి 11 గంటల సమయంలో ఇద్దరూ రాధమ్మ ఇంటికి వెళ్లి, గుడుంబా కావాలని చెప్పి ఆమెను బయటకు పిలిపించారు.
ఇనుపరాడుతో రాధమ్మ తలపై కొట్టగా, ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది
ఈ క్రమంలో ముందుగా దాచి పెట్టిన ఇనుపరాడుతో రాధమ్మ తలపై ఉప్పలయ్య బలంగా కొట్టగా, ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. అనంతరం ఉప్పలయ్య, మహేష్ ఇద్దరూ మృతదేహాన్ని ఇంటి పక్కనున్న చేద బావిలో పడేశారు.తరువాత మహేష్, తనకు పరిచయమున్న దువ్వ రాజును (25) బైక్ తెమ్మని పిలిపించుకొని ముగ్గురూ కలిసి మహబూబాబాద్ రోడ్డులోని హెచ్ పి పెట్రోల్ బంకుకు వెళ్లారు. అక్కడ నుంచి బ్రాహ్మణకొత్తపల్లి వాగులో ఇనుపరాడును పారేసి, రక్తం మరకలు అంటిన బట్టలు కడిగి గ్రామానికి చేరుకున్నారు. అనంతరం మద్యం తాగి వెళ్లిపోయారు.
విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు
రాధమ్మను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తొర్రూరు సిఐ టి. గణేష్, నెల్లికుదురు ఎస్‌ఐ సిహెచ్. రమేష్ బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పడ్డాయి. స్థానికుల సమాచారం, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను కఠినంగా విచారించగా వారు నేరాన్ని ఒప్పుకున్నారనీ పోలీసులు తెలిపారు.ఈ హత్య కేసును అతి తక్కువ సమయంలో ఛేదించిన సిఐ టి. గణేష్, ఎస్‌ఐ సిహెచ్. రమేష్ బాబు, హెడ్ కానిస్టేబుళ్లు ఎం. శంకరయ్య,సిహెచ్. రవీందర్, కానిస్టేబుళ్లు ఎం. సత్యనారాయణ, ఎం. యాకయ్య, కె. సుధీర్ తదితర సిబ్బందిని తొర్రూరు డి.ఎస్.పి కృష్ణ కిషోర్ అభినందించారు.
Also Read: Anganwadi Salary Hike: అంగన్వాడీలకు కనీస వేతనం రూ. 18000 ఇవ్వాలి.. మంత్రి సీతక్కకు విజ్ఞప్తి