IND vs NZ 4th t20I: భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు నాల్గో టీ-20 జరగనుంది. విశాఖ కేంద్రంగా ఈ మ్యాచ్ జరగనుండగా.. భారత జట్టులో భారీగా మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 3-0 ఆధిక్యంతో ఐదు టీ-20ల సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్.. రాబోయే టీ-20 వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకొని కీలక ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే బెంచ్ కి పరిమితమైన ప్లేయర్లకు అవకాశమివ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.
సంజూకి చావో రేవో..!
వరల్డ్ కప్ నకు ముందు టీమిండియాను వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో సంజూ శాంసన్ ఫామ్ ఒకటి. కివీస్ తో జరిగిన తొలి మూడు మ్యాచుల్లోనూ ఓపెనర్ సంజూ (10, 6, 0) ఘోరంగా విఫలయ్యాడు. అదే సమయంలో ఇషాన్ కిషన్ అంచనాలకు మించి రాణించి.. వరల్డ్ కప్ నకు తాను ఎంత ముఖ్యమో చాటి చెప్పాడు. గాయం కారణంగా జట్టుకు దూరమైన తిలక్ వర్మ.. వరల్డ్ కప్ సమయానికి జట్టులో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుత ఫామ్ దృష్ట్యా సంజూను బెంచ్ కు పరిమితం చేసి.. వికెట్ కీపర్ గానూ సామర్థ్యమున్న ఇషాన్ తో ఓపెనింగ్ చేయించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి కివీస్ తో జరగనున్న ఆఖరి రెండు మ్యాచ్ లు సంజూకు చావో రేవోగా మారనున్నట్లు క్రీడా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ రెండు మ్యాచ్ ల్లో సంజూ పరుగుల వరద పారిస్తే వరల్డ్ కప్ ప్లేయింగ్ 11లో అతడి స్థానం గురించి బీసీసీఐ ఆలోచన చేయవచ్చని తెలుస్తోంది.
జట్టులో భారీ మార్పులు..
మరోవైపు రాబోయే టీ-20 వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకొని నాల్గో టీ-20లో కీలక ప్లేయర్లకు రెస్ట్ ఇవ్వాలని టీమిండియా భావిస్తోంది. ఇందులో భాగంగా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, బుమ్రాకు విశ్రాంతి ఇవ్వొచ్చని తెలుస్తోంది. మరోవైపు చేతి వేలి గాయం నుంచి కోలుకున్న అక్షర్ పటేల్ తిరిగి జట్టులోకి చేరే అవకాశముంది. గత మూడు మ్యాచ్ ల్లో బెంచ్ కే పరిమితమైన శ్రేయాస్ అయ్యర్ ను రింకూ సింగ్ స్థానంలో బరిలోకి దించవచ్చని సమాచారం. అలాగే గత మ్యాచ్ లో సత్తా చాటిన రవి బిష్ణోయ్ ను ఈ మ్యాచ్ లోనూ ఆడిస్తారని తెలుస్తోంది. అలాగే మూడో టీ-20కి రెస్ట్ ఇచ్చిన వరుణ్ చక్రవర్తిని తిరిగి జట్టులోకి తీసుకొని స్పిన్ బాధ్యతలు వారిద్దరికి అప్పగించొచ్చని సమాచారం.
విశాఖ పిచ్ రిపోర్ట్..
విశాఖ పిచ్ బ్యాటర్లకు స్వర్గదామంగా నిలవనుంది. 2023లో చివరిగా జరిగిన టీ20 మ్యాచ్ లో ఏకంగా 400 పైగా పరుగులు ఈ గ్రౌండ్ లో వచ్చాయి. ఆస్ట్రేలియా నిర్దేశించిన 209 పరుగులు లక్ష్యాన్ని.. సూర్యకుమార్ నేతృత్వంలోని యంగ్ జట్టు ఛేదించింది. ఒక బంతి మిగిలి ఉండగానే రెండు వికెట్ల తేడాతో విజయ కేతనం ఎగురవేసింది. ఈసారి కూడా ఆ తరహా ఫలితాలే ఉండొచ్చని అంచనా.
Also Read: Trains Cancelled: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. విశాఖ – విజయవాడ మార్గంలో.. పలు రైళ్లు రద్దు, లిస్ట్ ఇదే!
హెడ్ టూ హెడ్ రికార్డ్స్..
భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఇప్పటివరకూ జరిగిన టీ-20 మ్యాచుల్లో టీమిండియా స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. 28 మ్యాచుల్లో 17 విజయాలు నమోదు చేసింది. అటు కివీస్ 10 మ్యాచుల్లో మాత్రమే విజయాన్ని నమోదు చేసింది. ఒక మ్యాచ్ టై కావడం గమనార్హం. అయితే తొలి మూడు మ్యాచుల్లో ఘోరమైన పరాభవం నేపథ్యంలో.. ఆఖరి రెండు మ్యాచుల్లోనైనా గెలిచి పూర్తి విశ్వాసంతో వరల్డ్ కప్ లో అడుగు పెట్టాలని కివీస్ జట్టు భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. జియో హాట్ స్టార్ యాప్, వెబ్ సైట్, స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ ఛానెల్స్ లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు.
భారత్ జట్టు (అంచనా): సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్, హార్దిక్ పాండ్య/ అక్షర్ పటేల్, శివం దూబే, రింకూ సింగ్ / శ్రేయాస్ అయ్యార్, హర్షిత్ రానా, కుల్దీప్ యాదవ్ / రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి

