Ajit Pawar Death: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్.. యావత్ దేశాన్ని షాక్ కు గురిచేసింది. ఆయన ప్రయాణిస్తున్న ప్రైవేటు విమానం బారామతిలో క్రాష్ ల్యాండింగ్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో అజిత్ పవార్ సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అజిత్ పవార్ మృతి పట్ల ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే విమాన ప్రమాదానికి సంబంధించి కీలక విషయాలు వెలుగు చూశాయి. అలాగే ప్రమాదానికి కారణమైన విమానం గురించి సైతం షాకింగ్ అంశాలు బయటపడ్డాయి.
2023లోనే విమానానికి ప్రమాదం..
బుధవారం (జనవరి 28) ఉదయం బారామతిలో ప్రమాదానికి గురైన ప్రైవేట్ విమానాన్ని.. వీఎస్ఆర్ ఏవియేషన్ ఆపరేట్ చేస్తోంది. వీఎస్ఆర్ ఏవియేషన్ (VSR Aviation) గతంలో కూడా ఇలాంటి దుర్ఘటనలను ఎదుర్కొంది. 2023 సెప్టెంబర్ 14న ఇదే సంస్థకు చెందిన ఒక లియర్ జెట్ 45 విమానం ముంబయి విమానాశ్రయంలో భారీ వర్షం కారణంగా రన్ వే నుంచి పక్కకు తప్పుకుని ప్రమాదానికి గురైంది. అప్పట్లో అందరూ క్షేమంగా బయట పడ్డం గమనార్హం. అయితే ఇప్పుడు ఇదే రకానికి సంబంధించిన విమానం.. బారామతిలో ప్రమాదానికి లోను కావడం గమనార్హం.
ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్
బారామతి ప్రమాదానికి సంబంధించిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (FIR)లో పలు కీలక విషయాలు వెలుగు చూశాయి. ఎఫ్ఐఆర్ ప్రకారం.. ల్యాండింగ్ గేర్ సరిగా పని చేయక పోవడం లేదా ఇంజిన్ లో హఠాత్తుగా సమస్య తలెత్తడం వంటివి జరిగి విమానం కుప్పకూలి ఉండొచ్చని భావిస్తున్నారు. విమానం రన్ వే దిగక ముందే ఆకాశంలో ఒక రౌండ్ వేసిందనీ.. అప్పుడే అది అన్ స్టేబుల్ గా ఉందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సాధారణంగా విమానం ల్యాండింగ్‌కు ముందు ఇలా అస్థిరంగా మారడం అనేది మెకానికల్ ఫెయిల్యూర్‌ను సూచిస్తుంటుంది.
4-5 సార్లు పేలుళ్లు..
సాధారణంగా ఏదైనా విమానం కూలిన సందర్భంలో ఒకేసారి భారీ పేలుడు సంభవిస్తుంది. ఆ తర్వాత తీవ్రంగా మంటలు ఎగసిపడతాయి. కానీ బారామతి ఫ్లైట్ ఘటనలో.. విమానం కుప్పకూలిన తర్వాత కూడా వరుసగా 4-5 సార్లు పేలుళ్లు (Multiple Explosions) జరిగాయని స్థానికులు చెబుతున్నారు. విమానంలోని ఇంధనం (Fuel) వేగంగా మంటలను వ్యాప్తి చేయడమే కాకుండా విమాన పరికరాలు పేలడం వల్ల లోపల ఉన్నవారు బయటపడే అవకాశం లేకుండా పోయిందని స్పష్టం చేస్తున్నారు.
త్వరగా రెస్క్యూ చేయలేదా?
బారామతి విమానాశ్రయాన్ని గతంలో ప్రైవేట్ సంస్థలు నిర్వహించగా ఇటీవలనే దీన్ని మహారాష్ట్ర ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కంపెనీ (MADC)కి అప్పగించారు. ఈ నిర్వహణ మార్పు తర్వాత మౌలిక సదుపాయాల్లో లేదా అత్యవసర రెస్పాన్స్ సిస్టమ్‌లో ఏవైనా లోపాలు ఉన్నాయా? అనే కోణంలో కూడా విచారణ జరుగుతున్నట్లు సమాచారం.
Also Read: Ajit Pawar Death: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దుర్మరణం.. శోక సంద్రంలో రాజకీయ ప్రముఖులు!
బ్లాక్ బాక్స్ డేటా విశ్లేషణ..
విమాన ప్రమాదానికి సంబంధించి స్పష్టమైన సాంకేతిక ఆధారాల కోసం దర్యాప్తు వర్గాలు బ్లాక్ బాక్స్ పై దృష్టి సారించాయి. బ్లాక్ బాక్స్ డేటా విశ్లేషణ పూర్తయితే తప్ప, పైలట్ల తప్పిదమా లేక విమానంలోని దాగి ఉన్న రహస్య లోపమా అనేది స్పష్టంగా తెలియదు. ఇదిలా ఉంటే అజిత్ పవార్ ప్రమాదానికి సరిగ్గా గంట ముందు (ఉదయం 8:57 గంటలకు) తన X (ట్విట్టర్) ఖాతాలో ఒక నివాళి పోస్ట్ చేశారు. ఇది ఆయన చివరి సోషల్ మీడియా పోస్ట్‌గా మిగిలిపోయింది. ఆ వెంటనే విమానం రాడార్ నుండి మాయమైనట్లు అధికారులు చెబుతున్నారు.

