Hindu youth burned: పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో (Bangladesh) హిందువులపై (Hindu Minorities) హింసాకాండ ఆగడం లేదు. తాజాగా మరో ఘోరం వెలుగుచూసింది. ఆ దేశంలోని నర్సింగ్డి జిల్లాలో 23 ఏళ్ల వయసున్న హిందూ యువకుడిని సజీవ దహనం (Hindu youth burned Alive) చేశారు. నర్సింగ్డి పోలీస్ స్టేషన్‌కు ఆనుకుని ఉన్న మసీద్ మార్కెట్ ప్రాంతంలో ఈ దారుణ ఘటన జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, స్థానిక చెబుతున్న సమాచారం ప్రకారం.. శుక్రవారం అర్థరాత్రి సమయంలో బాధితుడు చంచల్ చంద్ర భౌమిక్ తాను పనిచేస్తున్న గ్యారేజీలో గాఢ నిద్రలో ఉన్నాడు. ఆ సమయంలో దుండగులు దారుణానికి ఒడిగట్టారు. బయటి నుంచి షాపు షట్టర్‌పై పెట్రోల్ పోశారు. ఆ తర్వాత నిప్పు పెట్టారు. దీంతో, క్షణాల్లో మంటలు లోపలికి వ్యాపించాయి. మంటల్లో కాలిపోయి అత్యంత దారుణ స్థితిలో చంచల్ ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం అందాక ఫైర్ సర్వీస్ సిబ్బంది అక్కడికి చేరుకున్నప్పటికీ అప్పటికే నష్టం జరిగిపోయింది. దాదాపు గంటసేపు శ్రమించి మంటలను ఆర్పివేసి చంచల్ మృతదేహాన్ని బయటకు తీశారు. డెడ్‌బాడీ పూర్తిగా కాలిపోయింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియోలో వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి షాపు బయట నిప్పు పెట్టడం, క్షణాల్లోనే మంటలు గ్యారేజీని చుట్టుముట్టడం ఆ వీడియోలో కనిపించింది. చంచల్ గత కొన్నేళ్లుగా అదే గ్యారేజీలో పని చేస్తున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కుమిల్లా జిల్లాలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందినవాడని, అయితే ఉపాధి కోసం నర్సింగ్డిలో ఉంటున్నాడని వివరించారు. తమ కుటుంబానికి తమ కొడుకు ఒక్కడే జీవనాధరమని తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం చేసిన హత్య ఇదని చంచల్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని వారు కోరుతున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఘటనా స్థలంలో కొన్ని ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసే ప్రక్రియ జరుగుతోందని వివరించారు.
Read Also- GHMC: కార్మికుల ప్రాణాలకు లెక్క లేదా? చెత్త ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌లో మరో కార్మికుడు మృతి!
హత్యకు కారణం ఏంటి?
సంచలనం రేపుతున్న ఈ ఘటన ముందస్తు ప్రణాళికతో చేసిన హత్య అని కుటుంబ సభ్యులు, ఆ దేశంలోని మైనారిటీలుగా ఉన్న హిందువులు చెబుతున్నారు. ఏ కారణంతో యువకుడిని చంపేశారనే దానిపై ఇంకా నిర్ధారణ కాలేదు. మతపరమైన లక్ష్యమా?, అల్లర్లను సృష్టించేందుకు చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనతో భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
కాగా, యువకుడు చంచల్ హత్యను స్థానిక హిందూ సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. మైనారిటీల భద్రత కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్‌లో హిందువులే లక్ష్యంగా జరుగుతున్న దాడుల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అతివాద భావజాలం ఉన్న స్టూడెంట్ లీడర్ షరీఫ్ ఉస్మాన్ హదీ మృతి చెందిన తర్వాత ఈ దాడులు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంచల్ హత్యకు ముందు డిసెంబర్ 18న దీపు చంద్ర దాస్ అనే హిందూ వ్యక్తిని సజీవ దహనం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అమృత్ మండల్ అనే వ్యక్తిని, గతవారం లిటన్ చంద్ర దాస్ అనే హిందూ వ్యాపారిని, అనంతరం పెట్రోల్ పంపులో డబ్బులు కట్టకుండా పారిపోతున్న వాహనాన్ని ఆపే క్రమంలో రిపన్ సాహా అనే వ్యక్తిని.. ఇలా హిందువులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి.

