Singareni Contracts: బీఆర్ఎస్ సింగరేణి చిందులపై స్వేచ్ఛ
Singareni Contracts ( image credit: twitter)
Political News

Singareni Contracts: బీఆర్ఎస్ సింగరేణి చిందులపై ముందే చెప్పిన స్వేచ్ఛ.. ఆనాడు ఏం జరిగిందో ఆధారాలు ఇవే!

Singareni Contracts: కొద్ది రోజులుగా సింగరేణి చుట్టూ తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయి. టెండర్లు, కాంట్రాక్టులు, స్కాములు అంటూ బీఆర్ఎస్ (brs)  తెగ రాద్ధాంతం చేస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి, (Revanth Reddy) ఆయన బామ్మర్ది సృజన్ రెడ్డిపై లేనిపోని విమర్శలు చేస్తున్నది. వీటన్నింటికీ ఆధారాలతో ఫుల్ స్టాప్ పెట్టారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం జరిగిందో, నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులు కట్టబెట్టిన నిర్ణయాలను ఆధారాలతో ప్రెస్ మీట్ పెట్టారు. వీటన్నింటిపై ఇప్పటికే ‘స్వేచ్ఛ’ వరుస కథనాలు ఇచ్చింది. బీఆర్ఎస్ పాలనలో సింగరేణి కాంట్రాక్టులకు సంబంధించి జరిగిన అవకతవకలను వివరించింది. నిజానిజాలను బయటపెట్టింది. తాజా ప్రెస్ మీట్‌లో భట్టి విక్రమార్క కూడా ఆధారాలతో బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టారు. అలాగే, సింగరేణిపై తప్పుడు కథనాలు అల్లుతున్నారని మండిపడ్డారు.

రాధాకృష్ణకు వార్నింగ్

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తనపై చేసిన ఆరోపణలు పూర్తి నిరాధారమైనవని, వాస్తవ దూరమైనవని, కనుక ఆయన రాసినవన్నీ అవాస్తవాలని స్వయంగా తిరిగి రాయాలని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. లేదంటే వ్యక్తిత్వ హననంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించారు. జ్యోతిరావు పూలే భవన్‌లో  నిర్వహించిన మీడియా సమావేశంలో భట్టి మాట్లాడారు. రాధాకృష్ణ ఎవరి సంతోషం కోసం, ఎవరిని ఆనందపరచడం కోసం అవాస్తవాలు రాశారో ఆయనకే తెలియాలని వ్యాఖ్యానించారు. తనపై, సింగరేణిపై వస్తున్న వార్తలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సింగరేణిలో పని చేస్తున్న దాదాపు 42 వేల మంది పర్మినెంట్ ఉద్యోగులు, 30 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా వస్తున్న కథనాలు తనను ఆవేదనకు గురి చేశాయన్నారు. సింగరేణిలో టెండర్లు, వాటికి సంబంధించిన టెండర్లు కానీ వాటికి సంబంధించిన ఫైళ్లు తన వద్దకు గానీ, రాష్ట్ర ప్రభుత్వం వద్దకు రావని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పారదర్శకంగా సేవలు అందించేందుకు సింగరేణి కాలరీస్ సంస్థకు ఒక బోర్డు ఉన్నదని, అందులో సీనియర్ అధికారులు ఉంటారని తెలిపారు. వారంతా ఒక స్వయంప్రతిపత్తితో నిర్ణయాలు తీసుకుంటారని పేర్కొన్నారు. అన్ని నిర్ణయాలు సంస్థలో అమలులో ఉన్న విధివిధానాలు, నిబంధనల ప్రకారమే స్వతంత్రంగా తీసుకుంటారని, రాజకీయ జోక్యానికి ఎక్కడా అవకాశం లేదని స్పష్టం చేశారు.

Also Read: Singareni News: అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ సింగరేణి లిమిటెడ్ విజన్ డాక్యుమెంట్ విడుదల

సైట్ విజిట్.. ఎప్పటి నుంచో

సింగరేణి సంస్థ నైనీ బొగ్గు బ్లాక్ కాంట్రాక్ట్ విషయంలో కాంట్రాక్టర్లు ముందుగా సైట్ విజిట్ చేయాలని, ఆ మేరకు గని అధికారుల నుంచి సర్టిఫికెట్ పొందితేనే కాంట్రాక్టులో బిడ్డింగ్ చేయడానికి అర్హత కల్పిస్తూ తానేదో కొత్త నిబంధన పెట్టినట్లు రాధాకృష్ణ పేర్కొన్నారని భట్టి మండిపడ్డారు. ఈ నిబంధన దేశంలో మరెక్కడా లేదని, కేవలం కొందరు భట్టి విక్రమార్కకు చెందిన వారికి కాంట్రాక్ట్ అప్పగించడానికే ఇలా చేశారంటూ కట్టు కథనాలను, పిట్ట కథలను అల్లి వార్త ప్రచురించారని విమర్శించారు. సైట్ విజిట్ చేయడం అనేది కేవలం సింగరేణిలో మాత్రమే లేదని, తమ హయాంలో ప్రవేశ పెట్టింది కాదని రుజువులతో వివరించారు. 2018, 2021, 2023లో కోలిండియా అనుబంధ సంస్థ అయిన సీఎంపీడీఐఎల్ రూపొందించిన సింగరేణి టెండర్ డాక్యుమెంట్‌లో ఇతర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఎన్ఎండీసీ, ఐఐటీ, ఐఐఎం, ఫైనాన్స్ విభాగం, డిఫెన్స్ విభాగం, గుజరాత్ రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర చాలా కంపెనీల్లో చాలా ఏళ్లుగా ఉన్నట్లు, ఆయా కంపెనీలకు సంబంధించిన టెండర్ లేఖలను చూపించారు. కోలిండియాకు అనుబంధ సంస్థ అయిన సీఎంపీడీఐఎల్, సింగరేణి సంస్థకు సూచించిన టెండర్ నిబంధనలలో సైట్ విజిట్ జరపడం తప్పనిసరి అని పేర్కొన్నదని, సీఎంపీడీఐఎల్ నిబంధన మేరకే సింగరేణి సంస్థ 2018 నుంచి ఈ నిబంధనను పాటిస్తూ వస్తున్నదన్నారు. ఈ నిబంధన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా పొందుపరిచారన్నది పూర్తి అవాస్తవమని పేర్కొన్నారు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న నిబంధన అని, తాము కొత్తగా రూపొందించింది కాదు అని స్పష్టం చేశారు.

సృజన్ రెడ్డి బీఆర్ఎస్ నేత అల్లుడు.. సీఎంకు సంబంధం లేదు

సింగరేణిలో డీజిల్ సరఫరాను కాంట్రాక్టర్లకే అప్పగించడం ద్వారా మరో కుంభకోణానికి తెరలేపారని హరీశ్ రావు చేస్తున్న ఆరోపణలను ఉప ముఖ్​యమంత్రి భట్టి విక్రమార్క ఖండించారు. డీజిల్ సరఫరా విధానంలో మార్పులు కూడా తమ హయాంలో జరగలేదని, 2022లోనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఈ విధానం అమలులోకి వచ్చిందని తెలిపారు. జీఎస్టీ విధాన మార్పులు, డీజిల్ దొంగతనాలు నివారించడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టుల్లోనూ ఈ పద్ధతే అమలులో ఉన్నదనే విషయాన్ని గుర్తుచేశారు. సింగరేణి సంస్థ టెండర్లను ముఖ్యమంత్రి బావ మరిదికి కట్టబెడుతున్నట్లు ఒక కట్టు కథను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సృజన్ రెడ్డి కంపెనీకి సీఎంకు సంబంధం లేదని భట్టి స్పష్టం చేశారు. సృజన్ రెడ్డి కంపెనీ శోధా కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండీ దీప్తి రెడ్డి అని, ఆమె బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కుమార్తె అని, ఆమె భర్త సృజన్ రెడ్డి అని వివరించారు. అలాగే, సింగరేణి వ్యాప్తంగా పలు కాంట్రాక్ట్ పనులు నిర్వహిస్తున్న ఐదు ప్రముఖ కాంట్రాక్టర్లు కూడా బీఆర్ఎస్ నేతలకు బంధువులు లేదా సన్నిహితులవే అని వివరించారు. హరీశ్ రావుకు కానీ ఇంకా ఎవరికైనా కానీ అనుమానాలు ఉన్నట్లయితే తనను కోరినట్లయితే వివరించేవాడిని అని పేర్కొన్నారు.

తప్పుడు ప్రచారాలు తగదు

కేవలం నైనీ బ్లాక్ టెండర్ పైనే కాకుండా 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని రకాల టెండర్లపై కూడా విచారణ చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారని, రాగానే తాను స్వయంగా మాట్లాడి విచారణకు ఆదేశించేలా చూస్తానని పేర్కొన్నారు. అప్పుడు వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయన్నారు. సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి అని దానిపై వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం బురదజల్లడం రాష్ట్రానికి నష్టం చేస్తుందని తెలిపారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది ఆస్తులు దోచుకోవడానికి కాదని, ప్రజల ఆస్తులను కాపాడడానికే వచ్చానని తెలిపారు. తాను మండుటెండలో పీపుల్స్ మార్చ్ పేరిట పాదయాత్ర నిర్వహించి సింగరేణి గనులను సందర్శించానని, సింగరేణి కార్మికుల రక్తం, చెమటతో బొగ్గు ఉత్పత్తి జరుగుతున్నదని, అలాంటి బొగ్గు సంపదపై ఎటువంటి రాబందులు, గద్దలు, పెద్దలను వాలకుండా చూడడమే తన కర్తవ్యమన్నారు. వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం సింగరేణిపై తప్పుడు ప్రచారాలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. తాను 40 ఏండ్లుగా ఉన్నత విలువలతో పని చేస్తున్నానని, తన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీయాలనుకుంటే చూస్తూ ఊరుకోనని భట్టి విక్రమార్క హెచ్చరించారు.

ముందే చెప్పిన ‘స్వేచ్ఛ’

సింగరేణి కాంట్రాక్టుల విషయంలో బీఆర్ఎస్ హడావుడి, పార్టీ పత్రిక నమస్తే తెలంగాణ వార్తలపై ‘స్వేచ్ఛ’ వరుస కథనాలు ఇచ్చింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన కాంట్రాక్టులు, అప్పటి నిబంధనలు, వాటిని అతిక్రమించి చేసిన అక్రమాలను ఆధారాలతో సహా ప్రచురించింది. హరీశ్ రావు వరుస లేఖల మర్మం ఏంటో ప్రజలకు వివరించింది. కేటీఆర్‌ను ఇరికించేలా ఉన్న ఆయన తీరుపై బీఆర్ఎస్ వర్గాల్లోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఓవైపు ప్రభుత్వం ఎలాంటి తప్పులు జరగలేదని ఆధారాలతో చెబుతున్నా, హరీశ్ రావు చెప్పిందే చెబుతూ వితండవాదం చేస్తుండడంపై డైవర్షన్ రాజకీయాలకు తెర తీశారా అనే చర్చ జరుగుతున్నది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడుగా ఉన్నది. వరుసగా హరీశ్ రావు, కేటీఆర్‌ను విచారించింది. రేపోమాపో కేసీఆర్‌కు కూడా నోటీసులు వెళ్తాయనే ప్రచారం ఉన్నది. అసలే బీఆర్ఎస్ వరుస ఓటములతో అల్లాడుతున్నది. త్వరలో మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జరగని సింగరేణి స్కాం గురించి పదేపదే చెబుతూ ఫోన్ ట్యాపింగ్ కేసును డైవర్ట్ చేసేందుకే బీఆర్ఎస్ నేతలు హడావుడి చేస్తున్నారనే చర్చ జరుగుతున్నది.

Also Read: Singareni: వరదలు భూకంపాలు ప్రకృతి ప్రకోపమే.. నిపుణుల కమిటీ ఛైర్మన్ ఇంద్రపాల్ సింగ్!

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?