Singareni: అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రెండూ సమాంతరంగా ముందుకు సాగినప్పుడే సుస్థిర కోల్ మైనింగ్, నిజమైన ప్రగతి సాధ్యమవుతాయని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ ఛైర్మన్ ఇంద్రపాల్ సింగ్ మాథారు స్పష్టం చేశారు. అభివృద్ధి కోసం పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేయడం ఇకపై కుదరదని ఆయన గట్టిగా చెప్పారు. హైదరాబాద్‌లో సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కోల్ మైనింగ్, పర్యావరణ సుస్థిరత’ అనే అంశంపై జరిగిన జాతీయస్థాయి వర్క్‌షాప్‌లో ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడారు.
పర్యావరణానికి ఎక్కువ ప్రాధాన్యం
మానవాళి పర్యావరణానికి నష్టం కలిగిస్తున్న నేపథ్యంలో ప్రకృతి ప్రకోపిస్తోందని, అది వరదలు, భూకంపాలు, ధ్రువ ప్రాంతాల్లో మంచు కరగడం వంటి చర్యల రూపంలో స్పష్టంగా కనిపిస్తోందని ఇంద్రపాల్ సింగ్ మాథారు ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే పర్యావరణానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ మైనింగ్ నిర్వహించడం ఎలా? అనే అంశంపై ఈ వర్క్‌షాప్‌లో మేధావులు మంచి నిర్ణయాలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. గౌరవ అతిథిగా పాల్గొన్న ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ మెంబర్ సెక్రటరీ సుందర్ రామనాథన్ మాట్లాడుతూ, పర్యావరణహితంగా మైనింగ్‌లో కొంత మార్పు వచ్చినప్పటికీ, ఇవి మరింతగా పెరగాలని సూచించారు.
Also Read: Singareni: సింగరేణి వ్యాపార విస్తరణ వ్యూహం.. ఎన్టీపీసీతో మెగా ఒప్పందం
సింగరేణి ముందడుగు
సింగరేణి సీఎండీ బలరాం నాయక్ మాట్లాడుతూ, సంస్థ మొదటి నుంచీ కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ దిశా నిర్దేశంలో అన్ని రకాల చర్యలు తీసుకుంటూ మైనింగ్ కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ఇవి కాక, తాము చేపడుతున్న పర్యావరణహిత చర్యలను ఆయన వివరించారు. ‘ఓవర్ బర్డెన్ నుంచి ఇసుక తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేశాం. వాతావరణ కాలుష్యం జరగకుండా మిస్ట్ స్ప్రేయింగ్, డ్రై ఫాగ్ డస్ట్ సప్రెషన్ పద్ధతులను అవలంబిస్తున్నాం.
జియో థర్మల్ ఎనర్జీ వంటి ప్లాంట్లను ఏర్పాటు
సోలార్ ప్లాంట్లు, పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లు, గ్రీన్ హైడ్రోజన్, జియో థర్మల్ ఎనర్జీ వంటి ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాం. థర్మల్ పవర్ ప్రాజెక్టులో వెలువడే ఫ్లూ గ్యాస్ నుంచి కార్బన్ డయాక్సైడ్‌ను వేరుపరిచి మిథనాల్‌ను తయారు చేసే ప్లాంట్‌ను ప్రయోగాత్మకంగా చేపట్టాం. నీటి బిందువు జలసింధువు కార్యక్రమం ద్వారా 62 కొత్త చెరువుల నిర్మాణం చేపట్టడంతో పాటు 45 చెరువుల్లో పూడిక తీశాం. పర్యావరణ, జీవావరణ సమతుల్యత దెబ్బ తినకుండా మైనింగ్ రంగంలో ముందుకు పోవడానికి సింగరేణి సంస్థ సదా సంసిద్ధంగా ఉంటుంది’ అని సీఎండీ తెలియజేశారు.
Also Read: Singareni Collieries: సింగరేణిలో మెగా జాబ్ మేళా.. 23 వేల మందికి ఉద్యోగ అవకాశాలు

