Singareni: సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా పునరుద్పాదక ఇంధన రంగంలో విద్యుత్ ప్రాజెక్టులను పెద్ద ఎత్తున చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రముఖ జాతీయ స్థాయి విద్యుత్ ఉత్పాదక సంస్థ ఎన్టీపీసీ అనుబంధ కంపెనీ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌తో సింగరేణి బుధవారం హైదరాబాద్‌లో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం ఒప్పంద వివరాలను సింగరేణి సీఎండీ బలరాం నాయక్ వివరించారు. జాతీయస్థాయిలో విద్యుత్పాదనలో దశాబ్దాల అనుభవం ఉన్న ఎన్టీపీసీ సహకారాన్ని తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటులో సాంకేతిక సాయం లేదా ఉమ్మడి భాగస్వామ్యం అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అంతేకాక, భవిష్యత్తులో సింగరేణి గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ విక్రయంలోనూ ఎన్టీపీసీ సహకారం తీసుకోనున్నట్లు బలరాం నాయక్ స్పష్టం చేశారు.
భారీ లక్ష్యాలు
సింగరేణి సంస్థ భవిష్యత్తులో చేపట్టబోయే భారీ ప్రాజెక్టులను సీఎండీ వివరించారు. మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గని వద్ద 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని, అలాగే సోలార్ విద్యుత్తును 5 వేల మెగావాట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. దీంతోపాటు, మణుగూరు వద్ద జియో థర్మల్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోందన్నారు. గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌ను కూడా నిర్మించాలన్న లక్ష్యంగా ముందుకు పోతున్నట్లు సీఎండీ వివరించారు. ఎన్జీఈఎల్ ఉన్నతాధికారులు బిజినెస్ డెవలప్‌మెంట్ హెడ్ బిమల్ గోపాలాచారి, సివిల్ ఇంజినీరింగ్ హెడ్ మౌర్య మాట్లాడుతూ, ఇరువురి పరస్పర సహకారం, భాగస్వామ్యంతో దేశ విదేశాల్లో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటుచేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Also Read: Singareni: సింగరేణికి జాతీయ స్థాయి ఉత్తమ అవార్డ్.. స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్ 5.0లో ఎంపిక!
సింగరేణి పటిష్ట చర్యలు
నాణ్యమైన బొగ్గు సరఫరాకు పటిష్ట చర్యలు చేపడుతున్నామని, అందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటుచేశామని సీఎండీ తెలిపారు. హైదరాబాద్ సింగరేణి భవన్‌లో బుధవారం జరిగిన నాణ్యత వారోత్సవాల ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థ బొగ్గు వినియోగదారులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ, నాణ్యత విషయంలో అభిప్రాయాలను సేకరిస్తూ సమస్యలను పరిష్కరిస్తోందని చెప్పారు. బొగ్గు రక్షణతోపాటు నాణ్యతకు సమ ప్రాధాన్యం ఇస్తూ వినియోగదారుల వాణిజ్య విజయాలను తమ విజయంగా భావిస్తోందన్నారు. నాణ్యమైన బొగ్గు సరఫరాకు సింగరేణివ్యాప్తంగా నియమించిన నాణ్యత విభాగం అధికారులు, ఏరియా జీఎంలు సమష్టిగా కృషి చేయాలని ఆయన కోరారు.
Also Read: Singareni Collieries: సింగరేణిలో అరుదైన ఖనిజాల ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు

