Singareni Collieries: సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యలో భాగంగా కీలక ఖనిజ రంగంలో కూడా ప్రవేశించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ దిశగా మరో ముందడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు సింగరేణి ప్రాంతంలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్(Rare Earth Elements) గుర్తించి ఉత్పత్తి చేయడానికి ఒక ప్రయోగాత్మక ప్లాంటు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్ సింగరేణి భవన్ లో గురువారం కేంద్ర ప్రభుత్వ అధికారిక పరిశోధన సంస్థ నాన్ ఫెర్రస్ మెటీరియల్స్ టెక్నాలజీ డెవలప్ మెంట్ సెంటర్(ఎన్ఎఫ్ టీడీసీ) తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమంలో సింగరేణి సంస్థ తరఫున సీఎండీ బలరాం నాయక్, ఎన్ఎఫ్ టీడీసీ తరుపున ఆ సంస్థ డైరెక్టర్ బాలసుబ్రమణియన్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
రేర్ ఎర్త్ ఎలిమెంట్స్..
అనంతరం బలరాంనాయక్ మాట్లాడుతూ.. సింగరేణి ప్రాంతంలో లభ్యమవుతున్న రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉనికిని తెలుసుకోవడానికి, లభ్యమవుతున్న రేర్ ఎర్త్ ఎలిమెంట్స్(Rare Earth Elements) ను ఉత్పత్తి చేయడానికి ప్రయోగాత్మకంగా ఒక ప్లాంట్ ను కొత్తగూడెం ప్రాంతంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. దీనికి సంబంధించిన సాంకేతిక సహాయాన్ని ఎన్ఎఫ్ టీడీసీ(NFTDC) సంస్థ నుంచి తీసుకుంటున్నామన్నారు. ఈ ప్రయోగాత్మక ప్లాంట్ లో సింగరేణి ఓవర్ బర్డెన్ మట్టిలో లభించే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ తో పాటు, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వెలువడే ఫ్లై యాష్ లోనూ, ఇతర వేస్ట్ మెటీరియల్స్ లో లభ్యమయ్యే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ను గుర్తిస్తామని, ప్రయోగాత్మకంగా వీటిని ఉత్పత్తి కూడా చేపడుతామని ఆయన ధీమా వ్యక్తంచేశారు. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ లభ్యతా శాతం, ఉత్పత్తికి గల అవకాశాలు, వ్యాపార కోణంలో లాభదాయకత తదితర విషయాలను దృష్టిలో పెట్టుకొని తదుపరి పెద్ద ఎత్తున ప్లాంట్లను ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు.
Also Read: KCR: ప్రజలను ఎలా ఆకట్టుకుందాం.. కోఆర్డినేషన్‌పై దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్
బెల్లంపల్లిలో మెగా జాబ్ మేళా..
సింగరేణి ఆధ్వర్యంలో బెల్లంపల్లిలో ఈనెల 26న మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నారు. కాగా దీనికి సంబంధించిన ప్రచార పోస్టర్ ను హైదరాబాద్ సింగరేణి భవన్ లో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుతో కలిసి సింగరేణి సీఎండీ ఎన్ బలరాంనాయక్ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బలరాంనాయక్ మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ప్రజా ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా బెల్లంపల్లిలో సుమారు 80 కి పైగా ప్రైవేట్ కంపెనీల వారితో మెగా జాబ్ మేళాను వచ్చే ఆదివారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జాబ్ మేళాలో పాల్గొనదలిచిన యువత పోస్టర్ లో ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. గతంలో సింగరేణి ఆధ్వర్యంలో రామగుండం, వైరా, మధిర, భూపాలపల్లిలో నిర్వహించిన జాబ్ మేళాల ద్వారా సుమారు 12,000 మందికి పైగా ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
