ICC- Bangladesh: భద్రతా కారణాలను సాకుగా చూపి, భారత్ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్-2026 (T20 World Cup 2026) ఆడలేమని, తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) చేసిన విజ్ఞప్తిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కీలక నిర్ణయం తీసుకుంది. ఆడితే భారత్ వేదికగా ఆడాలని, లేదంటే టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్‌ను తొలగించి, వేరే జట్టును తీసుకోవాల్సి ఉంటుందని బీసీబీకి ఐసీసీ (ICC- Bangladesh) స్పష్టం చేసింది. ఈ విషయంపై బంగ్లాదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి ఏదో ఒక నిర్ణయం తీసుకొని సమాచారం ఇవ్వాలని, ఇందుకు ఒక్కరోజు మాత్రమే సమయం ఇస్తున్నట్టు స్పష్టం చేసింది. సకాలంలో స్పందించకపోతే టీ20 వరల్డ్ కప్ 2026 నుంచి బంగ్లాదేశ్‌ను తీసిపడేసి, ఆ స్థానంలో స్కాట్‌లాండ్‌ను తీసుకొని షెడ్యూల్ ప్రకారం మ్యాచ్‌లు ఆడిస్తామని ఐసీసీ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. బంగ్లాదేశ్ ప్రతిపాదనపై ఐసీసీ బోర్డులో ఓటింగ్ నిర్వహించగా 14-2 ఓట్ల తేడాతో బంగ్లాదేశ్ డిమాండ్ తిరస్కరణకు గురైందని సమాచారం. ఈ మీటింగ్ ముగిసిన తర్వాత బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ సమాచారం ఇచ్చింది. ఇప్పటికే షెడ్యూల్ ఖరారైందని, ఏదో ఒక నిర్ణయం తీసుకొని చెప్పకపోతే స్కాట్‌లాండ్‌ను ఆడిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఐసీసీ బోర్డు బుధవారం నిర్ణయం తీసుకుంది.
పాకిస్థాన్ మాత్రమే సపోర్ట్
బంగ్లాదేశ్ ప్రతిపాదనపై ఐసీసీ బోర్డులో ఓటింగ్ నిర్వహించగా, ఒక్క పాకిస్థాన్ మాత్రమే అనుకూలంగా ఓటు వేసింది. బంగ్లాదేశ్ సహా మొత్తం 16 దేశాల క్రికెట్ బోర్డుల డైరెక్టర్లు ఓటింగ్‌లో పాల్గొన్నారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్ ఒకవైపు, మిగతా 14 దేశాలు ఒకవైపు ఓటు వేశాయి. దీంతో, భారత్ వేదికగా ఆడాల్సిందేనని ఐసీసీ స్పష్టం చేసింది. కాగా, టీ20 వరల్డ్ కప్-2026 టోర్నమెంట్ ప్రారంభానికి సమయం దగ్గరపడింది. ఫిబ్రవరి 7 నుంచి మ్యాచ్‌లు షురూ కానున్నాయి. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం, బంగ్లాదేశ్ తన మూడు లీగ్ దశ మ్యాచ్‌లను కోల్‌కతాలో, ఒక మ్యాచ్‌ను ముంబైలో ఆడాల్సి ఉంది. అయితే, భద్రతా కారణాలను సూచిస్తూ తమ జట్టును భారత్‌కి పంపబోమని బంగ్లాదేశ్ ప్రభుత్వంతో పాటు ఆ దేశ క్రికెట్ బోర్డు కూడా చెబుతోంది. తమ మ్యాచ్‌లన్నింటినీ శ్రీలంకలోనే నిర్వహించాలని, ఈ మేరకు వేదికల మార్చాలని కోరుతోంది.
Read Also- Davos summit 2026: సీఎం రేవంత్ సంచలనం.. తెలంగాణలో స్టీల్ ప్లాంట్.. దావోస్‌లో గేమ్ ఛేంజింగ్ ఒప్పందం!
టీ20 వరల్డ్ కప్-2026లో బంగ్లాదేశ్ గ్రూప్-సీలో ఉంది. ఆ గ్రూపులో వెస్టిండీస్, ఇటలీ, ఇంగ్లాండ్, నేపాల్ ఉన్నాయి. కాగా, గతవారం ఐసీసీ అధికారులతో ఢాకాలో జరిగిన సమావేశంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కీలక ప్రతిపాదన చేసింది. తమను గ్రూప్-బీలోకి పంపించాలని, ఐర్లాండ్ స్థానంలో తాము ఆడతామని ప్రతిపాదన చేసింది. అప్పుడు గ్రూప్-బీలో ఉన్న శ్రీలంకలో మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంటుంది. అయితే, ఐసీసీ ఆ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోలేదు. కాగా, బంగ్లాదేశ్ టోర్నమెంట్ నుంచి వైదొలగితే ఆ స్థానాన్ని స్కాట్‌లాండ్ భర్తీ చేయనుంది. నిజానికి టీ20 వరల్డ్ కప్‌కి ఆ జట్టు క్వాలిఫై కాలేదు. యూరోపియన్ క్వాలిఫయర్స్‌లో నెదర్లాండ్స్, ఇటలీ కంటే వెనుకబడింది. దీంతో, అర్హత సాధించలేకపోయింది.
Read Also- Viral Video: అగ్గిపెట్టెంత ఇల్లు.. రూ.1.2 కోట్లు అంట.. కొనేవాళ్లు మరీ అంత పిచ్చోళ్లా!

