Viral Video: నగరాల్లో ఇంటి అద్దెలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏరియాను బట్టి డబుల్ బెడ్ రూమ్ ఇంటికి రూ.15-18 వేలు, ట్రిపుల్ బెడ్ రూమ్ ఇంటికి రూ.20-30 వేల వరకూ యజమానులు అద్దె తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ అద్దెల భారం మోయలేక.. బ్యాంక్ రుణం తీసుకొని ఎలాగైన సొంతింటికి మారిపోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. దీనిని ఆసరాగా తీసుకున్న కొందరు రియల్టర్లు.. తక్కువ స్పేస్ లోనే ఇళ్లను నిర్మించి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ముంబయిలో రియల్ ఎస్టేట్ దందా ఏ స్థాయిలో జరుగుతుందో అది కళ్లకు కట్టింది.
వైరల్ వీడియో..
సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ముంబయిలోని ఓ అపార్ట్ మెంట్ కు వెళ్లిన మహిళకు చేదు అనుభవం ఎదురైంది. చాలా తక్కువ స్పేస్ తో ఇరుకుగా నిర్మించిన ఇంటికి.. ఏకంగా రూ.1.25 కోట్ల ధర చెప్పడం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఆ ఇంటికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో పంచుకోవడంతో.. నెటిజన్లు సైతం ఆమెలాగే షాక్ కు గురవుతున్నారు. ఇంత చిన్న ఇంటికి.. అంత ధర ఏంట్రా అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
https://www.instagram.com/reel/DTuwtyhEkBU/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==
ఇల్లు ఎలా ఉందంటే?
వైరల్ వీడియోను గమనిస్తే.. ఇంటి ఎంట్రన్స్ లోనే చిన్నపాటి హాల్ ఉంది. దానికి అనుకొని ఒక బెడ్ రూమ్.. చిన్న వంటగది, కాస్త పెద్దగా ఉన్న బాత్రూమ్ ను చూడవచ్చు. హాల్ తో పోలిస్తే.. బెడ్ రూమ్ కొంచెం పెద్దగా ఉన్నట్లు సదరు యువతి వీడియోలో పేర్కొంది. లగ్జరీ ఫర్నిచర్, ఇంటీరియర్ వర్క్స్ తో ఇల్లు చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ.. స్థలం మాత్రం చాలా తక్కువ ఉండటం గమనార్హం. దీన్ని బట్టి ముంబయిలో రియల్ ఎస్టేట్ దందా ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చని పలువురు పేర్కొంటున్నారు. నగరవాసుల అవసరాన్ని క్యాష్ చేసుకునేందుకు రియల్టర్లు ఏ స్థాయికి దిగజారుతున్నారో స్పష్టంమవుతోందని చెబుతున్నారు.
Also Read: Davos Summit 2026: దావోస్‌లో సీఎం దూకుడు.. రేవంత్ విజన్‌కు టాప్ కంపెనీలు ఇంప్రెస్.. మరో భారీ డీల్ సెట్!
నెటిజన్ల రియాక్షన్..
ఇరుకైన ఇంటిని రూ.1.25 కోట్లకు అమ్ముతుండటంపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. టాయిలెట్ సీటుపై కూర్చొని వంటగదిలో పాలు పొంగుతున్నాయా? లేదా? అని తెలుసుకునేందుకు ఈ ఇల్లు సౌకర్యంగా ఉంటుందని ఓ నెటిజన్ సెటైర్లు వేశారు. ఇంట్లో అన్నిటికంటే బాత్రూమ్ స్పేస్ చాలా పెద్దగా ఉందని మరో వ్యక్తి రాసుకొచ్చారు. రూ.1.25 కోట్లు పెట్టి ఈ చిన్న ఇంటిలో ఉండటం కన్నా.. ముంబయిలోని మురికివాడల్లో జీవించడం చాలా చౌకగా ఉంటుందని ఇంకో నెటిజన్ పేర్కొన్నారు. అయితే ఇళ్ల ధరలను నిర్ణయించడంలో ప్రభుత్వ ప్రమేయం ఉండాలని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

