Kalvakuntla Kavitha: ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య తీవ్ర విమర్శలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల కుమ్ములాటపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నువ్వు కొట్టినట్లు చెయ.. నేను ఏడ్చినట్లు చేస్తా’ అన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి, హరీశ్ రావు డ్రామాలు ఉన్నాయని ఆమె ఆరోపించారు. గుంపుమేస్త్రీ, గుంట నక్క కలిసి ఈ నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు.
‘ఇద్దరూ కలిసి డ్రామాలు’
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ముచ్చర్ల సత్యనారాయణ జయంతి వేడుకలు నిర్వహించారు. సత్యనారాయణ చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. బీసీలకు ఇచ్చిన హామీ నుంచి డైవర్ట్ చేసేందుకే ఫోన్ ట్యాపింగ్ అంశం తెరపైకి తెచ్చారని కవిత ఆరోపించారు. ‘గుంపు మేస్త్రి.. గుంట నక్క అయిన హరీశ్ రావును ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పిలిచారు. ఇద్దరూ కలిసి కొత్త డ్రామాకు తెర లేపారు. మున్నిపల్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని కవిత ఆరోపించారు. తెలంగాణలోని ఫోన్ ట్యాపింగ్ బాధితులకు న్యాయం జరగదని కవిత అభిప్రాయపడ్డారు.
సింగరేణి వివాదంపై..
సింగరేణి గురించి ప్రస్తావిస్తూ.. ప్రైవేటు వ్యక్తులు టెండర్ లో పాల్గొనకపోతేనే మంచి జరుగుతుందని చెప్పారు. సింగరేణిలో సైట్ విజిట్ సర్టిఫికేట్ ఎప్పటి నుంచో ఉందన్న కవిత.. తనకు 99 శాతం సైట్ విజిట్ ఉందని అంచనా వేశారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొందరికే సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇచ్చారని కవిత ఆరోపించారు. మేఘా ఇంజనీరింగ్ కు సింగరేణి టెండర్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని కవిత ఆరోపించారి. దీనిపైన బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మాట్లడటం లేదని ప్రశ్నించారు.
Also Read: Political Trolls: హరీశ్ రావు ఎలివేషన్స్‌కు.. సజ్జనార్ బ్రేకులు.. పరువు మెుత్తం పోయిందిగా!
‘ఆంధ్రుల విగ్రహాలు తొలగిస్తాం’
తెలంగాణ ప్రాధాన్యత కోసం జాగృతి పనిచేస్తుందని కవిత స్పష్టం చేశారు. గత పదేళ్లుగా ఉద్యమకారులు విస్మరణకు గురయ్యారన్న కవిత.. ట్యాంక్ బండ్ వద్ద ఉద్యమకారుల విగ్రహాలు లేకపోవడం బాధాకరమని చెప్పారు. ట్యాంక్ బండ్ పై ఆంధ్రా ప్రాంతానికి చెందిన విగ్రహాలే ఎక్కువని పేర్కొన్నారు. సమయం వచ్చినప్పుడు ట్యాంక్ బండ్ పై ఉన్న ఆంధ్రా వారి విగ్రహాలు తొలగిస్తామని పేర్కొన్నారు. మరోవైపు ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన అమరజ్యోతి.. ఉద్యమకారులకు వార్ రూమ్ గా ఉండాలని కవిత పేర్కొన్నారు.

