Political Trolls: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ అనంతరం బీఆర్ఎస్ ముఖ్యనేత, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) మీడియా సమావేశం నిర్వహించి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. దాదాపు 8 గంటల విచారణ అనంతరం మీడియా ముందుకు వచ్చిన హరీశ్ రావు.. అడిగిన ప్రశ్నలే మళ్లీ అడిగారని చెప్పారు. సిట్ (SIT) విచారణను ధైర్యంగా ఎదుర్కొన్నట్లు చెప్పారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఎన్నో పోరాటాలు చేశామని.. అరెస్టులు తమకు కొత్తకాదని వ్యాఖ్యానించారు. సిటి నోటీసులు రాగానే పారిపోయే వాళ్లం కాదంటూ గంభీర వ్యాఖ్యలు చేశారు. అయితే హరీశ్ రావు సిట్ విచారణకు సంబంధించి.. హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఇందులో సజ్జనార్ (V.C. Sajjanar) రివీల్ చేసిన అంశం.. కాంగ్రెస్ శ్రేణులకు అస్త్రంగా మారింది. దీనిని అడ్డుపెట్టుకొని హరీశ్ రావుపై నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు.
సజ్జనార్ ఏమన్నారంటే?
మాజీ మంత్రి హరీశ్ రావును జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో సిట్ విచారణ చేసినట్లు సీపీ సజ్జనార్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. అయితే సాయంత్రం తన కుమారుడికి విమాన ప్రయాణం ఉందని హరీశ్ రావు చెప్పారని.. ఆయన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని త్వరగా విచారణను ముగించామని అన్నారు. ఆయన వెళ్లేందుకు అనుమతి ఇచ్చినట్లు స్పష్టం చేశారు. ఈ కేసు దర్యాప్తుతో సంబంధం ఉన్న సాక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ సంప్రదించరాదని, ప్రభావితం చేయరాదని హరీశ్ రావుకు సూచించినట్లు సీపీ స్పష్టం చేశారు. అవసరమైతే మళ్లీ పిలుస్తామని తెలియజేసినట్లు చెప్పుకొచ్చారు.
పత్రికా ప్రకటన
పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు (క్రైమ్ నం. 243/2024) దర్యాప్తులో భాగంగా, సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీ టి. హరీష్ రావును 2026 జనవరి 20న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో దర్యాప్తు అధికారి ఎదుట విచారణకు పిలిపించి.. ప్రశ్నించడం… https://t.co/HN6nU4iYvX
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 20, 2026
కాంగ్రెస్ శ్రేణుల సెటైర్లు..
బయట ప్రెస్ మీట్ లో హరీశ్ రావు ప్రదర్శించిన గాంభీర్యానికి.. లోపల సిట్ ముందు ఆయన చేసిన విజ్ఞప్తులకు అసలు సంబంధమే లేదని కాంగ్రెస్ శ్రేణులు నెట్టింట సెటైర్లు వేస్తున్నారు. నాని నటించిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంలో నటుడు బ్రహ్మాజీ పోషించిన పాత్రతో హరీశ్ రావు వైఖరిని పోలుస్తున్నారు. సినిమాలో నటుడు బ్రహ్మాజీ.. విచారణ సందర్భంగా పోలీసు స్టేషన్ కు వస్తారు. అతడికి తోడుగా స్టేషన్ బయట వందలాది మంది అనుచరులు పోగవుతారు. దీంతో తన వాళ్లకు కనిపించిన ప్రతీసారి.. విచారణ అధికారిపై అజమాయిషి ప్రదర్శిస్తున్నట్లుగా బ్రహ్మాజీ నటిస్తాడు. పోలీసు స్టేషన్ తలుపులు మూయగానే దర్యాప్తు అధికారిని బతిమాలడటం ఆ సినిమాలో చూడవచ్చు. ఇప్పుడు సరిగ్గా అదే హరీశ్ రావు విషయంలో జరిగిందంటూ కాంగ్రెస్ శ్రేణులు సెటైర్లు వేస్తున్నారు. బ్రహ్మాజీ ముఖానికి హరీశ్ రావు ముఖాన్ని తగిలించి.. సదరు వీడియో క్లిప్ ను నెట్టింట వైరల్ చేస్తున్నారు.
నువ్వు పులి కాదు పులికేశివి @BRSHarish 😂 pic.twitter.com/gxrDbAMN1d
— Kattar Congress (@kattarcongresii) January 21, 2026
Also Read: Phone Tapping Case: ఆ కీలక నేత ఎవరో నాకు తెలియదన్న హరీష్ రావు.. త్వరలో మరికొందరికి నోటీసులు
‘సొల్లు పురాణం తప్ప ఏం లేదు’
సిట్ విచారణ అనంతరం హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. సొల్లు పురాణం తప్ప లోపల ఏమీ జరగలేదని పేర్కొన్నారు. సిట్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పించిన నోటీసు అంతా ట్రాష్ అని వ్యాఖ్యానించారు. ముగ్గురు సిట్ అధికారులు తనను విచారిస్తున్న క్రమంలో వారికి పైనుంచి ఫోన్లు వచ్చేవని.. సిబ్బంది వారికి ఫోన్ అంటూ సైగలు చేశారని తెలిపారు. అలా వాళ్లు బయటకు వెళ్లి గంట మాట్లాడుకొని తిరిగి వచ్చినట్లు పేర్కొన్నారు. వారికి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేస్తున్నారా? సీపీ సజ్జనార్ చేస్తున్నారా? అన్న విషయం నాకు తెలియదని చెప్పారు. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఒక ప్రైవేటు కేసులో కోట్లు ఖర్చు చేసి నన్ను ఇరికించే ప్రయత్నం చేశారన్నారు. సుప్రీం కోర్టు, హైకోర్టు ఫోన్ టాపింగ్ కేసు కొట్టి వేశాయని.. మళ్లీ ఇప్పుడు సిట్ ద్వారా విచారణ పేరిట తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు.

