Phone Tapping Case: సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు మంగళవారం మాజీ మంత్రి హరీశ్ రావును సుదీర్ఘంగా విచారించారు. ఈ వ్యవహారంలో ఉన్న పెద్దాయన ఎవరు అనే దానిపై నిశితంగా ప్రశ్నించినట్టు సమాచారం. అయితే, హరీశ్ రావు మాత్రం అసలు ఫోన్ ట్యాపింగ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినట్టు తెలిసింది. అప్పుడు తాను హోం మంత్రిని కాదు అని అన్నట్టుగా సమాచారం.
రాధాకిషన్ రావు వాంగ్మూలంతో..
అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయనతోపాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు అగ్రనేతల ఫోన్లను అప్పటి ఎస్ఐబీ ఛీఫ్ ప్రభాకర్ రావు నేతృత్వంలోని టీం ట్యాప్ చేసినట్టుగా బయటపడింది. మొదట దీనిపై పంజాగుట్ట స్టేషన్‌లో కేసులు నమోదు కాగా సమగ్ర విచారణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ కేసులో ప్రభాకర్ రావు ఏ1 నిందితుడిగా ఉన్నారు. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, ఓ టీవీ ఛానల్ అధినేత శ్రవణ్ రావు నిందితుల జాబితాలో ఉన్నారు. వీరందరిని సిట్ పలుమార్లు విచారించింది. ప్రభాకర్ రావును సుప్రీం కోర్టు అనుమతితో రెండు వారాలపాటు కస్టడీకి తీసుకొని ప్రశ్నించింది. అయితే, రాధాకిషన్ రావు తమకేం తెలియదు, పెద్దాయన చెప్పినట్టు చేశాం అని చెప్పినట్టు సమాచారం. ఆ పెద్దాయన ఎవరు అనేది తెలుసుకోవడానికి సిట్ అధికారులు ప్రభాకర్ రావును పలుమార్లు ప్రశ్నించారు. అయితే, ప్రభాకర్ రావు ఆయన ఎవరో వెల్లడించలేదు. తానేం చేశానో పై అధికారులు అందరికీ తెలుసు అని మాత్రమే సమాధానం ఇచ్చారు.
శ్రవణ్ రావు విచారణ సమయంలో తెరపైకి హరీశ్ రావు పేరు
శ్రవణ్ రావును విచారించినప్పుడు హరీశ్ రావు పలుమార్లు ఆయనతో మాట్లాడినట్టుగా వెల్లడైంది. అదే సమయంలో ప్రభాకర్ రావుతో కూడా హరీశ్ రావు టచ్‌లో ఉన్నారని తెలిసింది. ఈ మేరకు కాల్ లాగ్, వాట్సాప్ చాట్‌ను సిట్ అధికారులు సేకరించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయనకు నోటీసులు ఇచ్చి మంగళవారం విచారణకు పిలిచారు. ఉదయం 11 గంటలకు రావాలని సూచించగా హరీశ్ 10 నిమిషాల ముందే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లోని సిట్ ఆఫీస్‌కు వచ్చారు. వందల సంఖ్యలో కార్యకర్తలు, పలువురు బీఆర్ఎస్ నాయకులు, లీగల్ టీం సభ్యులు కూడా వచ్చారు. దీనిని ముందే ఊహించిన పోలీస్ అధికారులు సిట్ ఆఫీస్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కార్యకర్తలను రోప్‌తో సిట్ కార్యాలయానికి కొద్ది దూరంలోనే ఆపేశారు. లీగల్ టీంలోని ఓ అడ్వకేట్ హరీశ్ రావుతోపాటు సిట్ ఆఫీస్‌లోకి వెళ్లే ప్రయత్నం చెయ్యగా బయటే అడ్డుకున్నారు. దాంతో ఆయన కొన్ని డాక్యుమెంట్లతో ఒంటరిగానే సిట్ ఆఫీస్‌లోకి వెళ్లారు.
Also Read: Ramya Rao: అక్రమ దందాలపై.. బీఆర్ఎస్ మాజీ ఏంపీ జోగినపల్లి సంతోష్‌పై ఈడీకి ఫిర్యాదు.!
ప్రశ్నల వర్షం
సిట్ అధికారులు హరీశ్ రావును ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు విచారించారు. శ్రవణ్ రావుతో ఎందుకు అన్నిసార్లు మాట్లాడారు? ట్యాపింగ్ కోసం ఫోన్ నెంబర్లు ఆయనకు ఇచ్చారా? అని అడిగినట్టు తెలిసింది. అయితే, శ్రవణ్ రావు మీడియాలో ఉన్నాడని, తాను రాజకీయాల్లో ఉన్నందునే మాట్లాడానని హరీశ్ రావు చెప్పినట్టుగా తెలిసింది. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులతో సాగించిన సంభాషణల గురించి కూడా సిట్ అధికారులు అడిగినట్టుగా తెలిసింది. తనకు మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్నదనే సమాచారం వారి వద్ద ఉన్నందునే జాగ్రత్తగా ఉండాలని సూచించడానికి వాళ్లు మాట్లాడినట్టు హరీశ్ రావు జవాబు ఇచ్చినట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్‌తో తనకు అసలు ఎలాంటి సంబంధం లేదని చెప్పినట్టు తెలిసింది. అప్పటి ప్రభుత్వంలో కీలక పాత్ర వహించిన మీకు ఈ వ్యవహారం గురించి తెలియదా? అని అడిగితే తాను అప్పుడు హోం మంత్రిని కాదు అని చెప్పినట్టు తెలియవచ్చింది. ఎన్ని రకాలుగా ప్రశ్నించినా ట్యాపింగ్ గురించి తనకు తెలియదని ఆ పెద్ద మనిషి ఎవరో కూడా తెలియదని అన్నట్టు సమాచారం.
త్వరలోనే మరికొందరు
ఈ వ్యవహారంలో సిట్ అధికారులు త్వరలోనే మరికొందరు బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చి విచారించనున్నట్టు తెలిసింది. అవసరం అయితే కేసీఆర్ నుంచి కూడా వాంగ్మూలం తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ ఇక కేసీఆర్‌ను కూడా పిలుస్తారేమో అని వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది. ఓవైపు హరీశ్ రావు విచారణ సాగుతుండగా సిట్ ఆఫీస్ ముందు బీఆర్ఎస్ కార్యకర్తలు హంగామా చేశారు. పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. వెంటనే హరీశ్ రావును బయటకు పంపించాలంటూ ఓ దశలో లోపలికి వెళ్లే ప్రయత్నం కూడా చేశారు. అయితే, పోలీసులు వారిని అడ్డుకున్నారు. పలువురిని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు.
Also Read: Nara Rohith: వెంకటేష్ ‘ఎకే 47’లో పవర్ ఫుల్ రోల్ చేయబోతున్న నారా రోహిత్.. ఏంటంటే?

