Ind Vs NZ 1st ODI: గుజరాత్ రాష్ట్రం వడోదరలోని బీసీఏ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో (Ind Vs NZ 1st ODI) న్యూజిలాండ్ బ్యాటింగ్ ముగిసింది. అద్భుత ఆరంభాన్ని అందుకొని, ఆ తర్వాత తడబడినట్టు కనిపించినా, తిరిగి పుంజుకున్న కివీస్ బ్యాటర్లు.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి సరిగ్గా 300 పరుగుల స్కోరు సాధించారు. డారిల్ మిచెల్ 84 పరుగులు, డేవోన్ కాన్వే 56, హెన్రీ నికోలస్ 62 అర్ధ సెంచరీలతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. దీంతో, భారత విజయ లక్ష్యం 301 పరుగులుగా ఖరారైంది.
సోసో అనిపించిన బౌలర్లు
ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయారు. మ్యాచ్ ఆరంభంలో న్యూజిలాండ్ జట్టు స్కోరు 117 వరకు కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. మధ్యలో కాస్త పుంజుకొని వికెట్లు తీసినప్పటికీ, చివరిలో పరుగులను మాత్రం నియంత్రించలేకపోయారు. దీంతో, కివీస్ క్రమంగా 300 పరుగుల స్కోరును చేరుకుంది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ తలో రెండేసి వికెట్లు పడగొట్టారు. మిగతా రెండు వికెట్లలో కుల్దీప్ యాదవ్ ఒకటి, మరొకటి రనౌట్ రూపంలో దక్కింది.
Read Also- Nagababu: ఈ ఫొటోలోని వ్యక్తి కనిపిస్తే సమాచారం ఇవ్వండి.. జనసేన నేత ప్రధాన కార్యదర్శి నాగబాబు ట్వీట్
న్యూజిలాండ్ స్కోర్ బోర్డ్
కివీస్ బ్యాటర్లలో ఓపెనర్లు డేవోన్ కాన్వే 56, హెన్రీ నికోలస్ 62 పరుగులతో చక్కటి ఆరంభాన్ని అందించారు. వీరిద్దరు ఔటయ్యాక డారిల్ మిచెల్ 84 పరుగులతో అద్భుతంగా ఆడాడు. మిగతా బ్యాటర్లలో విల్ యంగ్ 12, గ్లెన్ ఫిలిప్స్ 12, మిచెల్ హేయ్ 18, మైఖేల్ బ్రేస్‌వెల్ 16, జకరీ ఔల్క్స్ 1, క్రిస్టియాన్ 24 (నాటౌట్), కైల్ జెమీసన్ 8 (నాటౌట్) చొప్పున పరుగులు సాధించారు.
టాస్ గెలిచి బౌలింగ్
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఈ తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రత్యర్థి న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. భారత తుది జట్టులో శ్రేయాస్ అయ్యర్ తిరిగి అడుగుపెట్టాడు. అయితే, తెలుగు ప్లేయర్, ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి తుది జట్టులో చోటుదక్కలేదు. చోటు దక్కించుకున్న ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలకు చోటుదక్కింది. ఇక, ప్రత్యర్థి న్యూజిలాండ్ టీమ్‌లో డేవోన్ కాన్వే, హెన్రీ నికోలస్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లేన్ ఫిలిప్స్, మిచెల్ హేయ్ (వికెట్ కీపర్), మిచెల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), జాకరీ ఫౌల్క్స్, క్రిస్టియాన్ క్లార్కే, కైల్ జమీసన్, ఆదిత్య అశోక్ చోటుదక్కించుకున్నారు.
Read Also- Mass Maharaja: ‘మాస్ మహారాజ్’ బిరుదు పేటెంట్ తనదే అంటున్న హరీష్ శంకర్.. రవితేజ ఏం చేశారంటే?

