Huzurabad News: ప్రభుత్వాలు పల్లె ప్రజల మానసిక ఉల్లాసం కోసం, ఆహ్లాదకరమైన వాతావరణం కోసం లక్షలాది రూపాయల ప్రజా ధనాన్ని వెచ్చించి ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు నేడు అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దాలుగా మారుతున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జూపాక(Jupaka) గ్రామంలో ఉన్న ప్రకృతి వనం ప్రస్తుతం సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచాల్సింది పోయి, భయోత్పాతాన్ని కలిగిస్తోంది. వనం మధ్యలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ పిచ్చిమొక్కలు అల్లుకుపోయి, చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలను తాకుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఏ చిన్నపాటి వర్షం కురిసినా లేదా గాలి వీచినా ఆ చెట్ల ద్వారా విద్యుత్ ప్రవహించి ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని స్థానికులు వణికిపోతున్నారు.
లోతైన బావి సైతం..
ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్‌కు వచ్చే వృద్ధులు, రిటైర్డ్ ఉద్యోగులు ఆ చెట్ల కొమ్మల మధ్య చిక్కుకున్న విద్యుత్ తీగలను చూసి లోపలికి వెళ్లాలంటేనే జంకుతున్నారు. చిన్నపిల్లలు ఆడుకునే క్రమంలో తెలియక ఆ మొక్కలను తాకితే పరిస్థితి ఏంటని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం విద్యుత్ తీగలే కాకుండా, ఆ రోడ్డు పక్కనే ఉన్న లోతైన బావి సైతం మృత్యుకుహరంలా కనిపిస్తోంది. సరైన రక్షణ గోడ గానీ, హెచ్చరిక బోర్డులు గానీ లేకపోవడంతో నిత్యం ఆ మార్గంలో రాకపోకలు సాగించే గీత వృత్తి కార్మికులు, వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోంది.
Also Read: Jogulamba Gadwal: పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయలేదని.. వృద్ధురాలి అంత్యక్రియలు అడ్డగింత..?
అధికారులు స్పందిస్తారా..
ఇంతటి ప్రమాదకర పరిస్థితులు కళ్లముందే కనిపిస్తున్నా, గ్రామ పంచాయతీ కార్యదర్శి మొదలుకొని మండల అభివృద్ధి అధికారి (MPDO) వరకు ఎవరూ ఈ సమస్యపై దృష్టి పెట్టకపోవడం గమనార్హం. విద్యుత్ శాఖాధికారుల నిర్లక్ష్యం మరీ దారుణంగా ఉందని, ఏదైనా పెను ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవించిన తర్వాతే అధికారులు స్పందిస్తారా అని గ్రామస్తులు ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం పచ్చదనం కోసం పెంచిన మొక్కలే నేడు మృత్యుపాశాలుగా మారుతుంటే, సంబంధిత శాఖల మధ్య సమన్వయ లోపం ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, తక్షణమే ఆ విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న కొమ్మలను తొలగించి, బావి చుట్టూ రక్షణ చర్యలు చేపట్టాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జూపాక గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: GHMC: బల్ధియాకు స్పెషల్ టార్గెట్.. ఫిక్స్ చేసేందుకు అధికారుల వ్యూహం..!

