Vande Bharat sleeper: భారతీయ రైల్వే రంగంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వందే భారత్ స్లీపర్ రైలు మరోమారు తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పోస్ట్ చేసిన ఓ వీడియో.. ఈ స్లీపర్ ట్రైన్ సామర్థ్యాన్ని కళ్లకు కట్టింది. ప్రస్తుతం ట్రయల్ దశలో ఉన్న ఈ స్లీపర్ ట్రెయిన్.. 180 కి.మీ గరిష్ట వేగంతో దూసుకెళ్లింది. ఈ సందర్భంగా రైలు లోపల నీటితో నిండిన గ్లాస్ ను ఉంచగా.. ఒక్క చుక్క కూడా కిందపడలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వాటర్ టెస్ట్ సక్సెస్..
ఇండియన్ రైల్వేస్ నెట్‌వర్క్‌లోని కోటా-నాగ్దా సెక్షన్‌లో కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ఈ వాటర్ టెస్టును నిర్వహించినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. హై స్పీడ్ రన్ సమయంలో ఒక్క చుక్క నీరు కూడా బయటకు రాలేదని పేర్కొన్నారు. కాగా వీడియోను గమనిస్తే మెుత్తం నాలుగు గ్లాసుల వాటర్ ను రైలులో పెట్టారు. మూడు గ్లాస్ లను కింద పెట్టి వాటి పైన మధ్య భాగంలో మరో గ్లాసును నిలబెట్టారు. మరోవైపు రైలు వేగాన్ని సూచించే స్పీడో మీటర్ ను చూపించారు. ఈ క్రమంలో రైలు 180 కి.మీ వేగంతో దూసుకెళ్తునప్పటికీ కోచ్ లో దాని ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. గ్లాసులోని వాటర్ ఏమాత్రం కదలికలకు గురికాలేదు. దీన్ని బట్టి వందేభారత్ స్లీపర్ లో ప్రయాణికుల సౌకర్యం, భద్రత ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
Vande Bharat Sleeper tested today by Commissioner Railway Safety. It ran at 180 kmph between Kota Nagda section. And our own water test demonstrated the technological features of this new generation train. pic.twitter.com/w0tE0Jcp2h
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) December 30, 2025
200 స్లీపర్ టైన్స్ టార్గెట్..
రాత్రి వేళల్లో సుదూర ప్రయాణాల కోసం ఈ వందేభారత్ స్లీపర్ ట్రైన్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం ట్రెయిల్స్ దశలో ఉన్న ఈ రైలు.. అతి త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం సేవలందిస్తున్న వందే భారత్ చైర్‌కార్ రైలుకు ఇది స్లీపర్ వేరియంట్. పూర్తిగా ఎయిర్ కండిషన్ తో రానుంది. రాబోయే సంవత్సరాల్లో 200కుపైగా వందే భారత్ స్లీపర్ రైళ్లను దేశంలో ప్రవేశపెట్టాలని భారతీయ రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం బీఈఎంఎల్, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)తో కలిసి 10 స్లీపర్ రైలు సెట్లను రైల్వే శాఖ తయారు చేయిస్తోంది. భారత్ – రష్యా భాగస్వామ్యంతో ఏర్పడిన కైనెట్ సంస్థ మరో 10 రైళ్లను అభివృద్ధి చేస్తోంది. అలాగే టిటాగఢ్ రైల్ సిస్టమ్స్–బీహెచ్ఈఎల్ కన్సార్షియంకు 80 స్లీపర్ వేరియంట్లు తయారు చేసే కాంట్రాక్టు లభించింది.
Also Read: Shiva Lingam Vandalized: శివలింగం ధ్వంసం కేసులో కీలక పరిణామం.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!
వందే భారత్ స్లీపర్ సౌకర్యాలు
తొలి రెండు ప్రోటోటైప్ రైళ్లలో మొత్తం 16 కోచ్‌లు ఉండనున్నాయి. 11 ఏసీ త్రీ-టైర్ కోచ్‌లు, 4 ఏసీ టూ-టైర్ కోచ్‌లు, 1 ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్ ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకురానున్నారు. నైట్ లైటింగ్, సీసీటీవీ నిఘా, మాడ్యులర్ ప్యాంట్రీ ఏర్పాటు, విమానాల్లో వినియోగించే అధునాత బయో వాక్యూమ్ టాయిలెట్లు, దివ్యాంగుల కోసం ప్రత్యేక టాయిలెట్లు, బేబీ కేర్ యూనిట్, ఏసీ ఫస్ట్ క్లాస్ లో వేడి నీటితో షవర్, భద్రత కోసం దేశీయ కవచ్ (KAVACH) యాంటీ కాలిజన్ సిస్టమ్ ఈ వందే భారత్ స్లీపర్ రైలులో ఉన్నాయి. అలాగే ప్రతీ కోచ్ లో వ్యక్తిగత రీడింగ్ ల్యాంప్స్, చార్జింగ్ సాకెట్లు, నిర్ణిత స్టేషన్లలో ఆటోమేటిక్ డోర్ ఓపెనింగ్ సిస్టమ్, అత్యవసర సమయాల్లో లోకో పైలెట్ ను నేరుగా సంప్రదించే వెసులుబాటును ఈ రైళ్లల్లో తీసుకొస్తున్నారు.

