Anvesh Controversy: తెలుగు రాష్ట్రాల్లో ట్రావెల్ వ్లాగ్‌ల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న యూట్యూబర్ ‘నా అన్వేషణ’ అన్వేష్ ప్రస్తుతం తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ప్రపంచం చుట్టూ తిరుగుతూ వివిధ దేశాల సంస్కృతులను పరిచయం చేసే అన్వేష్, గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా హిందూ దేవతామూర్తులపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలకు దారితీశాయి. సీతమ్మ వారి గురించి ఆయన చూసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. అయినా సరే ఆగకుండా అన్వేష్ సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు. హిందూ దేవతలనే కాకుండా.. భారత దేశ ప్రజలను ఉద్దేశించి కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. దీనికి నిరసనగా ఇన్టాలో అన్వేష్ ను అన్ ఫాలో చేస్తున్నారు.
Read also-Trivikram Controversy: మరో సారి త్రివిక్రమ్‌ను టార్గెట్ చేసిన పూనమ్ కౌర్.. ఏం జరిగిందంటే?
పంజాగుట్టలో కేసు నమోదు
అన్వేష్ హిందూ దేవీ దేవతలను దూషిస్తూ, కోట్లాది మంది భావాలను గాయపరిచారని ఆరోపిస్తూ సినీ నటి, బిజెపి నాయకురాలు కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు ఐటి యాక్ట్, మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. త్వరలోనే అన్వేష్‌కు నోటీసులు జారీ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. అన్వేష్ తన సోషల్ మీడియా లైవ్ సెషన్లలో పోస్ట్‌లలో హిందూ ధర్మం, దేవుళ్ల అస్తిత్వంపై వ్యంగ్యంగా మాట్లాడటమే కాకుండా, అభ్యంతరకరమైన పదజాలాన్ని ఉపయోగించారని పలువురు ఆరోపిస్తున్నారు. భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో సంప్రదాయాలను కించపరచడం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ వ్యవహారం కేవలం ఒక్క స్టేషన్‌కే పరిమితం కాకుండా తెలంగాణ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కూడా అన్వేష్‌పై ఫిర్యాదులు అందాయి.
హిందూ సంఘాల ఆగ్రహం
అన్వేష్ వ్యవహారశైలిపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆయనను కేవలం యూట్యూబర్‌గా చూడకుండా, సమాజంలో చిచ్చు పెట్టే వ్యక్తిగా పరిగణించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని ప్రధాన డిమాండ్లు తెరపైకి వచ్చాయి. అన్వేష్ భారతదేశం వెలుపల ఉండి దేశ గౌరవానికి భంగం కలిగిస్తున్నారని, అతన్ని దేశద్రోహిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. విదేశాల్లో తిరుగుతూ ఇక్కడి ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్న అన్వేష్ పాస్‌పోర్ట్‌ను రద్దు చేసి, వెంటనే ఇండియాకు రప్పించాలని కోరుతున్నారు. వివాదాస్పద కంటెంట్ పోస్ట్ చేస్తున్న ఆయన యూట్యూబ్ చానల్‌ను నిలిపివేయాలని సైబర్ క్రైమ్ పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. అన్వేష్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉండటంతో, చట్టపరమైన చర్యలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో ఆయన ఫాలోవర్ల మధ్య కూడా ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరు ఆయనను సమర్థిస్తున్నప్పటికీ, మెజారిటీ ప్రజలు మాత్రం దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం క్షమార్హం కాదని అభిప్రాయపడుతున్నారు.

