Sankranti Special Trains: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా సంక్రాంతి పండక్కి మరికొన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఇప్పటికే ప్రకటించిన రైళ్లకు అదనంగా 11 రైళ్లను నడపనుందని దక్షిణ మధ్య రైల్వే పౌర సంబంధాల శాఖ అధికారి శ్రీధర్ తెలిపారు. ఈ అదనపు రైళ్ల నిర్ణయంతో కొన్ని వేల మంది ప్రయాణీకులకు మేలు జరగనుంది.
ప్రత్యేక రైళ్ల వివరాలు
జనవరి 7వ తేదీ నుంచి 12వ తేదీ మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయని రైల్వే అధికారి శ్రీధర్ స్పష్టం చేశారు. కాకినాడ టౌన్ – వికారాబాద్, వికారాబాద్ – పార్వతీపురం, పార్వతీపురం – వికారాబాద్, పార్వతీపురం – కాకినాడ టౌన్, సికింద్రాబాద్ – పార్వతీపురం, పార్వతీపురం – సికింద్రాబాద్, కాకినాడ టౌన్ – వికారాబాద్, వికారాబాద్ – కాకినాడ టౌన్, వికారాబాద్ – కాకినాడ టౌన్ సర్వీస్ నడుపుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ రైళ్లలో 1ఏసీ, 2 ఏసీ, 2 ఏసీ, స్లీపర్ కోచ్‌లతో పాటు సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. ఈ రైళ్లకు సంబంధించి బుకింగ్స్ మొదలయ్యాయని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
విశాఖ – చర్లపల్లి స్పెషల్ ట్రైన్..
సంక్రాంతి రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా కూడా ఓ ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. 08511 నెంబర్ కలిగిన విశాఖపట్నం – చర్లపల్లి ప్రత్యేక రైలు పండుగ రోజుల్లో అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. 10, 12, 17, 19 తేదీల్లో విశాఖపట్నంలో సా.5.30 గం.లకు ఈ రైలు బయలుదేరనుంది. మరుసటి రోజు ఉదయం 8.15 గంటలకు చర్లపల్లి చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు 11, 13, 18, 20 తేదీల్లో చర్లపల్లి నుంచి మధ్యాహ్నం 3.30 గం.లకు బయలుదేరి మర్నాడు ఉదయం 7 గంటలకు విశాఖ పట్నం చేరుకుంటుందని రైల్వే అధికారులు వివరించారు.
Also Read: Without Railway Station: ఇదేందయ్యా ఇది.. ఆ రాష్ట్రంలో ఒక్క రైల్వే స్టేషన్ కూడా లేదా? భలే విచిత్రంగా ఉందే!
అనకాపల్లి – వికారాబాద్ మధ్య..
మరోవైపు అనకాపల్లి – వికారాబాద్ మధ్య మరో స్పెషల్ ట్రైన్ అందుబాటులో ఉంటుందని రైల్వే శాఖ వెల్లడించింది. 07416 నెంబర్ కలిగిన ఈ రైలు.. జనవరి 18వ తేదీ రాత్రి 9.45కి అనకాపల్లిలో బయలుదేరనుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 12.30కి వికారాబాద్ చేరుకుంటుంది. కాబట్టి ఈ ప్రత్యేక రైళ్లను సద్వినియోగం చేసుకొని తమ గమ్యస్థానాలకు సౌకర్యవంతంగా చేరుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.

