Without Railway Station: దేశంలోని అతిపెద్ద రవాణా వ్యవస్థలో రైల్వేలు ఒకటి. ప్రధాన నగరాల నుంచి మారుమూల గ్రామాల వరకూ ప్రతీ ప్రాంతాన్ని తాకుతూ రైళ్లు ప్రయాణిస్తుంటాయి. ప్రజలను అతి తక్కువ ఛార్జీలతో గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. అందుకే దేశంలోని ప్రధాన సిటీలతో పాటు చిన్నపాటి పట్టణాల్లోనూ రైల్వే స్టేషన్లు దర్శనమిస్తుంటాయి. అయితే భారత దేశంలో ఒక్క రైల్వే స్టేషన్ కూడా లేని రాష్ట్రం ఉందని మీకు తెలుసా? ప్రపంచంలోనే గొప్ప రైల్వే నెట్ వర్క్ గా భారత్ లో ఒక రాష్ట్రంలో రైల్వే స్టేషన్ లేకపోవడం ఆశ్చర్యమే. ఇంతకీ ఆ రాష్ట్రం ఏది? అందుకు గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
రైల్వే స్టేషన్ లేని రాష్ట్రం ఇదే
హిమాలయ ఒడిలో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో ఒక్క రైల్వే స్టేషన్ కూడా లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సిక్కింలోని హిమాలయ అందాలను చూసేందుకు ఏటా లక్షలాది మంది పర్యాటకులు అక్కడికి వెళ్తుంటారు. అలాంటి చోట రైల్వే స్టేషన్ లేకపోవడం చాలా విచిత్రమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రైల్వే స్టేషన్ లేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి.
భౌగోళిక సవాళ్లు (Geographical Challenges):
సిక్కిం హిమాలయాల పర్వత ప్రాంతంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ రాష్ట్రంలో ఎటు చూసిన ఎత్తైన మంచు పర్వతాలు, లోతైన లోయలు, ఇరుకైన మార్గాలు దర్శనమిస్తుంటాయి. దీనికి తోడు భూకంపాలు (seismic activity) సైతం ఇక్కడ సర్వసాధారణంగా మారిపోయాయి.
పర్యావరణ పరిరక్షణ
దేశంలోనే అత్యంత అందమైన రాష్ట్రంగా సిక్కింకు పేరుంది. ఇక్కడి సహజ సౌదర్యం, జీవవైవిధ్యం (biodiversity), సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తొలి నుంచి ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నాయి. రైల్వే నిర్మాణం వల్ల అడవులు, వన్యప్రాణులు, పర్యావరణం పాడయ్యే అవకాశముందని భావించిన కేంద్రం.. ఇక్కడ రైల్వేస్టేషన్ నిర్మాణానికి నిరాకరించింది.
ఇతర రవాణా మార్గాలే ఆధారం
సిక్కింలో రైల్వే స్టేషన్లు లేకపోవడంతో ఇతర రవాణా మార్గాలపై అక్కడి ప్రజలు ఆధారపడుతున్నారు. ప్రధానంగా ఈ హిమాలయ రాష్ట్రం రోడ్డు మార్గాలతో అనుసంధానమై ఉంది. నేషనల్ హైవే 10 (NH10) ద్వారా సిలిగురి (పశ్చిమ బెంగాల్)తో ఈ రాష్ట్రం కనెక్ట్ అయ్యి ఉంది. అలాగే సిక్కింలోని పాక్యాంగ్ ఎయిర్ ఎయిర్ పోర్టు ద్వారా విమాన సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. హెలికాప్టర్ సర్వీసులు, కేబుల్ కార్లు, స్థానిక రవాణా వ్యవస్థలు సిక్కింలో ఉన్నాయి. ఇవి రాష్ట్ర అవసరాలను తీరుస్తున్నాయి.
వ్యూహాత్మక ఒంటరితనం
సిక్కిం రాష్ట్రం.. చైనా, భూటాన్, నేపాల్ దేశాలతో సరిహద్దులు పంచుకుంటుంది. కాబట్టి వ్యూహాత్మకంగా భారతదేశానికి ఈ ప్రాంతం చాలా కీలకం. సరిహద్దు భద్రతా కారణాల వల్ల కూడా ఈ రాష్ట్రంలో రైల్వే నిర్మాణం ఆలస్యమైందని చెబుతుంటారు. 1975లో సిక్కిం ప్రాంతం భారత్ లో విలీనమైంది. అప్పటి నుంచి రైల్వే మినహా ఇతర రవాణా మార్గాలను కేంద్రం అభివృద్ధి చేస్తూ వస్తోంది.
Also Read: Minister Ponguleti: కటౌట్లు చూసి టికెట్ ఇవ్వం.. గెలిచే గుర్రాలకే బీఫామ్: మంత్రి పొంగులేటి!
కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణం
భారత రైల్వే నెట్‌వర్క్ ఎక్కువగా బ్రిటిష్ కాలంలో నిర్మించబడింది. అయితే సిక్కిం అప్పటికి స్వతంత్ర రాజ్యం. దీంతో ఈ రాష్ట్రంలో రైల్వే మార్గాలను బ్రిటిష్ పాలకులు అందుబాటులోకి తీసుకురాలేదు. విలీనం తర్వాత కూడా భౌగోళిక సవాళ్ల వల్ల రైల్వే విస్తరణ జరగలేదు. ప్రస్తుతం సివోక్-రంగ్‌పో రైల్వే ప్రాజెక్ట్ (45 కి.మీ.) పనులు జరుగుతున్నాయి. దీనిని ప్రధాని మోదీ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించడం గమనార్హం. ఈ స్టేషన్ పనులు 85% పైగా పూర్తికాగా.. 2027 నాటికి ఈ రైల్వే స్టేషన్ అందుబాటులోకి వస్తుందని అంచనాలు ఉన్నాయి. ఇది పూర్తయితే సిక్కింలో మెుదటి రైల్వే స్టేషన్ సివోక్ – రంగ్ పో కానుంది.

