iBomma Piracy: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ఐబొమ్మ’ పైరసీ వెబ్‌సైట్ కేసులో కీలక నిందితుడు రవి విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలను వెల్లడించాడు. గత మూడేళ్లలోనే రవి ఏకంగా 13 కోట్ల రూపాయలు సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, ఆ సంపాదనలో 10 కోట్ల రూపాయలను కేవలం విలాసవంతమైన జీవితం కోసమే ఖర్చు చేయడం గమనార్హం. ఎప్పుడూ హై-ఫై పబ్‌లు, 5 స్టార్ హోటళ్లలోనే బస చేస్తూ రవి ఎంజాయ్ చేసేవాడని పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం అతని అకౌంట్‌లో ఉన్న మిగిలిన 3 కోట్ల రూపాయలను పోలీసులు ఫ్రీజ్ చేశారు.
2007 నుండే నేర ఆలోచనలు
రవికి పైరసీ చేయాలనే ఆలోచన నిన్న మొన్నటిది కాదు, 2007 నుండే అతను ఈ దిశగా అడుగులు వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలోనే తన సొంత స్నేహితులకు రవి వెన్నుపోటు పొడిచాడు. తన స్నేహితులైన ప్రహ్లాద్, అంజయ్య, కాళీ ప్రసాద్‌లకు తెలియకుండానే వారి ఒరిజినల్ సర్టిఫికేట్లను దొంగిలించాడు. స్నేహితుల డాక్యుమెంట్లపై ఉన్న ఫొటోలను తీసేసి, తన ఫొటోలను అమర్చి ఫేక్ ఐడెంటిటీ కార్డులను సృష్టించాడు. ప్రహ్లాద్ పేరుతో ఉన్న డాక్యుమెంట్లను ఉపయోగించి డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, మరియు బ్యాంక్ అకౌంట్లను కూడా తీసుకున్నాడు. ఈ దొంగ డాక్యుమెంట్ల ఆధారంగా రవి మొత్తం మూడు కంపెనీలను స్థాపించాడు. అవి.. Supplier India, Hospital Inn, ER Infotech. తన స్నేహితుల ఐడెంటిటీని వాడుకుంటూ వారు చేస్తున్నట్లుగానే కంపెనీ వ్యవహారాలను నడిపించాడు. ఈ వ్యవహారంలో రామగుండానికి చెందిన అంజయ్య ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం.
Read also-Om Shanti Shanti Shantihi: ‘సిన్నారి కోన’ పాటొచ్చింది.. తరుణ్, ఈషా రెబ్బా జంట ఎంత బావుందో!
టెలిగ్రామ్ నుండి సినిమా కంటెంట్
పైరసీ కంటెంట్ ఎక్కడి నుండి సేకరిస్తున్నాడనే విషయంపై స్పందిస్తూ.. ‘తండెల్’, ‘కిష్కిందపురి’ వంటి లేటెస్ట్ సినిమాలను టెలిగ్రామ్ గ్రూపుల నుండి సేకరించినట్లు రవి ఒప్పుకున్నాడు. ఇలా సేకరించిన సినిమాలను తన వెబ్‌సైట్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెచ్చి ప్రకటనల రూపంలో భారీగా డబ్బు సంపాదించాడు. దీంతో లగ్జరీ లైఫ్ అనుభవించేవాడు. ఒకవైపు సినిమా పరిశ్రమను పైరసీతో కుంగదీస్తూ, మరోవైపు ప్రాణ స్నేహితులనే నమ్మించి వారి జీవితాలతో ఆడుకున్న రవి ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. తాజాగా ఓ మీడియా ప్రతినిధికి ఎదుట పడిన రవి కొన్ని విషయాలు అడగ్గా.. అసలు నేను నిందితుడిని అని ఎవరు చెప్పరు, మీ దగ్గర ఏమైనా సాక్షాదారాలు ఉన్నాయా.. ఉంటే చూపించండి అప్పుడు ఒప్పుకుంటా అంటూ సమాధానం ఇచ్చాడు. తాజాగా ఈ అంశం చర్చనీయాంశం అయింది. రవి గురించి రోజుకో విషయం బయటకు వస్తుంది. దీని గురంచి మరిన్ని విషయాలు తెలియాలంటే మరిన్ని రోజలు ఆగాల్సిందే.

