Telangana BJP: తెలంగాణ బీజేపీలో ఒక్కసారిగా రాజకీయ వేడి పెరిగింది. పార్టీ నేతల తీరుపై స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో టీబీజేపీ ఎంపీలంతా డిన్నర్ మీటింగ్‌కు హాజరైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఇటీవల టీబీజేపీ ఎంపీలతో ప్రధాని సమావేశమయ్యారు.
నేతలు ప్రజల్లోకి వెళ్లడం లేదు
రాష్ట్రంలో పార్టీ బలోపేతం కావడానికి అనువైన పరిస్థితులు ఉన్నప్పటికీ, ఆశించిన స్థాయిలో నేతలు ప్రజల్లోకి వెళ్లడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా కీలక నేతల మధ్య సమన్వయ లోపం, ప్రజా సమస్యలపై పోరాటాల్లో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై మోదీ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ హెచ్చరికలతో మేల్కొన్న కమలనాథులు పార్టీలో కొత్త ఉత్సాహం నింపే పనిలో పడ్డారని, అందుకే తాజా భేటీ అని చర్చించుకుంటున్నారు.
Also Read: Telangana BJP: పీఎం మీటింగ్ అంశాలు బయటకు ఎలా వచ్చాయి? వారిపై చర్యలు తప్పవా?
తర్వాతి ఎన్నికలపై దృష్టి
గతంతో పోలిస్తే తాజాగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకున్నది. గ్రామ స్థాయిలో కేడర్ బలోపేతం కావడం, గణనీయమైన స్థానాల్లో విజయం సాధించడం అగ్ర నాయకత్వానికి ఆక్సిజన్ అందించింది. ఇదే స్ఫూర్తిని తదుపరి ఎన్నికల్లోనూ కొనసాగించాలని పార్టీ నిర్ణయించింది. సర్పంచ్ ఎన్నికలు ఇచ్చిన స్ఫూర్తితో ఎంపీటీసీ, జెడ్పీటీసీ నుంచి మున్సిపల్, జీహెచ్ఎంసీ వరకు తమ సత్తా ఏంటో చాటాలని పార్టీ భావిస్తున్నది. అందుకే రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహ రచన చేస్తున్నది. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా తమ వైపు తిప్పుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. డిన్నర్ మీటింగ్ వేదికగా నేతలందరినీ ఏకతాటిపైకి తెచ్చి, మున్సిపల్ పోరులో సత్తా చాటాలని కాషాయ దళం సిద్ధమవుతున్నది.
Also Read: Telangana BJP: స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఎదురవుతున్న సవాళ్లు.. పోటీకి కరువైన అభ్యర్థులు!

