Telangana BJP: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నది. అన్ని స్థానాల్లో పోటీ చేయాలని పార్టీ నిర్ణయం తీసుకున్నా అభ్యర్థులు కరువవ్వడంతో అనుకున్న స్థాయిలో ఆదరణ లభించడం లేదని తెలుస్తున్నది. మెజార్టీ గ్రామ పంచాయతీ స్థానాలు మహిళలకు రిజర్వ్ చేయబడ్డాయి. గ్రామస్థాయిలో ఆ పార్టీకి మహిళా నాయకుల కొరత తీవ్రంగా ఉన్నది. గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులు ఇస్తున్నది కేంద్రమే అని చెబుతున్న రాష్ట్ర నాయకత్వం ఇతర పార్టీల నుంచి నేతలను, మహిళా అభ్యర్థులను ఆకర్షించడంలో మాత్రం వెనుకబడిందనే విమర్శలు వస్తున్నాయి. దీంతో సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. అన్ని స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆశించిన స్పందన లభించడం లేదు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే గ్రామ పంచాయతీలకు కేంద్రమంత్రి బండి సంజయ్, పాలమూరు ఎంపీ డీకే అరుణ రూ.10 లక్షలు నజరానా అందజేస్తామని ప్రకటించినా ఆదరణ అంతంత మాత్రంగానే వచ్చింది. ఇప్పటివరకు కరీంనగర్ జిల్లాలో మాత్రమే రెండు గ్రామ పంచాయతీలను బీజేపీ(BJP) ఏకగ్రీవం చేసుకోగలిగింది.
మరింత ఎక్కువయిన కష్టాలు
ఈ నెల 11, 14, 17 తేదీల్లో పోలింగ్ జరగనున్నది. 11న ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ ఉన్నది. ఈ ఫైట్‌లో బీజేపీ నామమాత్రంగానే పోరు చేస్తున్నట్లు కనిపిస్తున్నది. కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) మధ్యే ప్రధాన పోటీ ఉండనున్నదనే చర్చ జరుగుతున్నది. పేరుకు 40 లక్షల సభ్యత్వాలున్నా అవన్నీ ఓట్లుగా మారుతాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా పడిన కాషాయ పార్టీ లోక్‌సభ ఎన్నికలకు మాత్రం విపరీతంగా పుంజుకున్నది. కానీ, మళ్లీ సర్పంచ్ ఎన్నికల్లో చతికిలపడే అవకాశాలున్నట్లుగా పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చించుకుంటున్నారు. ఫస్ట్ ఫేజ్‌లో అభ్యర్థుల వేటను కొనసాగించినా అనుకున్న ఫలితాలు దక్కలేదని తెలుస్తున్నది. కేవలం కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పీచుపల్లి గ్రామంలో సర్పంచ్ పదవికి బీజేపీ బలపర్చిన సామ రాజిరెడ్డి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ గ్రామానికి రూ.10 లక్షలు ఇస్తామని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రకటించారు.
తలనొప్పిగా అభ్యర్థుల ఎంపిక
మరోవైపు, గ్రామీణ రాజకీయాల్లో పట్టున్న మహిళా నేతలు బీజేపీలో కరువయ్యారు. బలమైన అభ్యర్థులను పక్క పార్టీల నుంచి తమ వైపు తిప్పుకుందామంటే, ఆయా పార్టీలు తమ శ్రేణులను కాపాడుకోవడంలో జాగ్రత్తలు వహిస్తున్నాయి. దీంతో వలసలకు అవకాశం లేకుండా పోయింది. ఈ పరిస్థితి బీజేపీకి పెద్ద ప్రతిబంధకంగా మారింది. రిజర్వ్ అయిన స్థానాల్లో పోటీకి సరైన అభ్యర్థులను నిలబెట్టడం పార్టీకి తలనొప్పిగా తయారైంది. ఎన్నికలు ఏకపక్షం కాకుండా, అన్ని స్థానాల్లోనూ పోటీ చేయడం ద్వారా పార్టీ ఉనికిని చాటాలని బీజేపీ ప్లాన్ చేసింది. అయితే, అభ్యర్థులు లేకపోవడంతో ఈ లక్ష్య సాధన అంతంత మాత్రంగానే కనిపిస్తున్నది. అనేక చోట్ల పార్టీ మద్దతుదారులు ముందుకు రావడం లేదు. మొత్తంగా సర్పంచ్ ఎన్నికలు బీజేపీకి గట్టి పరీక్షగా మారింది. ఈ సవాళ్లను అధిగమించి పార్టీ తన పట్టును ఎలా నిలుపుకుంటుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Also Read: Suicide Crime: దారుణం.. సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతానేమో అన్న భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్య

