Modi Vs Priyanka: జాతీయ గీతం వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్‌సభలో సోమవారం నాడు ( డిసెంబర్ 8) ప్రత్యేక చర్చ జరిగింది. చర్చను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్ పార్టీ, ఇందిరా గాంధీ, దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రులపై పదునైన విమర్శలు చేశారు. వందేమాతరాన్ని మహమ్మద్ అలీ జిన్నా తీవ్రంగా వ్యతిరేకించగా, నెహ్రూ కూడా అదే వైఖరిని అనుసరించారని, జిన్నా అభిప్రాయాలకు తలొగ్గారని మోదీ ఆరోపించారు. 1937లో వందేమాతరం గీతంలోని చివరి చరణాలను (ముఖ్యంగా దుర్గాదేవిని ప్రస్తావించే చరణాలు) తొలగించి, కేవలం మొదటి రెండు చరణాలను మాత్రమే స్వీకరించడం ద్వారా జాతీయ గీతాన్ని కాంగ్రెస్ పార్టీ ముక్కలు ముక్కలు చేసిందని మోదీ ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ చేసిన ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, ఎంపీ ప్రియాంక గాంధీ ధీటుగా (Modi Vs Priyanka) సమాచారం ఇచ్చారు.
Read Also- Mulugu District: ములుగు గ్రామీణాభివృద్ధి సంస్థలో అవినీతి బాగోతం.. రూ.2 కోట్లు పక్కదారి!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంపిక చేసిన అంశాలకు మాత్రమే జవహర్‌లాల్ నెహ్రూను ప్రస్తావిస్తున్నారని విమర్శించారు. త్వరలో పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని, వాటిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వందేమాతరం అంశానికి ప్రాధాన్యత ఇస్తోందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. వందేమాతరంపై ఇప్పుడెందుకు చర్చిస్తున్నామని ఆమె ప్రశ్నించారు. జాతీయ గీతం ప్రస్తుతం దేశంలోని ప్రతి ప్రాంతంలో సజీవంగా ఉందని, ఈ అంశంపై చర్చకు అవకాశం లేదని ఆమె పేర్కొన్నారు. బెంగాల్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టే, ప్రభుత్వం వందేమాతరంపై చర్చను కోరుకుంటోందని అన్నారు. ఈ ప్రస్తుతం వర్తమానం, భవిష్యత్తు వైపు చూడాలని భావించడంలేదని, అందుకే గతాన్ని తవ్వాలని చూస్తోందని ప్రియాంక గాంధీ విమర్శలు చేశారు.
మీ పదవికాలం నెహ్రూ జైలు జీవితమంత
జవహర్‌లాల్ నెహ్రూని ప్రధాని మోదీ టార్గెట్ చేయడంపై ప్రియాంక గాంధీ స్పందిస్తూ, ప్రధానమంత్రిగా మోదీ పదవిలో ఉన్నకాలానికి సమానంగా జవహర్‌లాల్ నెహ్రూ జైలు జీవితం గడిపారని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం నెహ్రూ పోరాడారని ప్రియాంక గాంధీ ప్రస్తావించారు. ‘‘ప్రధానమంత్రి మోదీ 12 సంవత్సరాలు ప్రధానిగా గడిపారు. జవహర్‌లాల్ నెహ్రూ ఈ దేశ స్వాతంత్ర్యం కోసం దాదాపు అదే కాలాన్ని జైలులో గడిపారు. ఆ తర్వాత ఆయన 17 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేశారు. మీరు ఆయన్ను చాలా విమర్శిస్తారు. కానీ, ఆయన ఇస్రోని ప్రారంభించకపోతే, మంగళ్‌యాన్ ఉండేది కాదు. నెహ్రూ డీఆర్‌డీవో ప్రారంభించకపోతే, తేజస్ ఉండేది కాదు. ఆయన ఐఐటీలు, ఐఐఎంలు ప్రారంభించకపోతే, మనం ఐటీలో ముందుండే వాళ్లం కాదు. నెహ్రూ ఎయిమ్స్ ప్రారంభించకపోతే, కరోనా వంటి సవాలును మనం ఎలా ఎదుర్కోగలమా?’’ అని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. నెహ్రూ దేశం కోసం జీవించారని, దేశానికి సేవ చేస్తూ మరణించారని పేర్కొన్నారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో నెహ్రూ 9 సార్లు జైలుకు వెళ్లారని, సుమారుగా 3,200 రోజులు అంటే, తొమ్మిది సంవత్సరాలు జైలులో గడిపారని ఆమె పేర్కొన్నారు. నెహ్రూపై ప్రధాని, బీజేపీ నేతలు పదే పదే విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.

