Aviation Minister: దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (IndGo Airlines)లో తలెత్తిన సంక్షోభం.. వేలాది మందిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు రాజ్యసభ వేదికగా దీని గురించి మాట్లాడారు. ఇతర ఎయిర్ లైన్స్ కు సైతం ఒక ఉదాహరణగా నిలిచేలా ఇండిగోపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
అంతర్గత వైఫల్యం వల్లే..
సోమవారం రాజ్యసభలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఇండిగో సంక్షోభానికి ఆ సంస్థ అంతర్గత వైఫల్యాలే కారణమని స్పష్టం చేశారు. పైలెట్లు, సిబ్బంది, ప్రయాణికుల భద్రత, క్షేమానికి తాము కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. ఇదే విషయాన్ని సదరు ఎయిర్ లైన్స్ కు స్పష్టంగా తెలియజేసినట్లు పేర్కొన్నారు. ‘ఇండిగో తమ సిబ్బందికి సంబంధించిన రోస్టరింగ్ విధానాన్ని సరిగా అమలు చేయలేదు. డిసెంబర్ 1వ తేదీన రోస్టరింగ్ నిబంధనలకు సంబంధించి ఇండిగోతో భేటి నిర్వహించాం. ఆ సంస్థ ప్రతినిధులు లేవనెత్తిన అనుమానాలపై మేం స్పష్టత ఇచ్చాం. అప్పుడు వారు ఎలాంటి సమస్యలను ప్రస్తావించలేదు’ అని పేర్కొన్నారు.
తేలిగ్గా వదిలిపెట్టం
ఇండిగోలో తలెత్తిన సంక్షోభాన్ని తాము తేలిగ్గా తీసుకోవడం లేదని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆ సంస్థపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజ్యసభ వేదికగా హెచ్చరించారు. తాము తీసుకునే చర్య.. ప్రతి ఎయిర్‌లైన్‌కు ఒక ఉదాహరణగా ఉంటుందని పేర్కొన్నారు. నిబంధనల ఉల్లంఘనలు జరిగితే చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఇండిగో సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభించిందని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
మరిన్ని ఎయిర్ లైన్స్ అవసరం
మరోవైపు దేశంలోని విమానయాన రంగంలో మరిన్ని కంపెనీలు ప్రవేశించాలని కేంద్రం కోరుకుంటున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. భారత్‌లో ఐదు ప్రధాన ఎయిర్‌లైన్స్ నడిచే సామర్థ్యం ఉందని మంత్రి పేర్కొన్నారు. అయితే మంత్రి సమాధానంతో అసంతృప్తిగా ఉన్న ప్రతిపక్ష సభ్యులు.. సభను వదిలి వెళ్లిపోయారు.
Also Read: Telangana Rising Global Summit 2025: పెట్టుబడులకు తెలంగాణ బెస్ట్.. దేశంలోనే మోడరన్ స్టేట్.. గ్లోబల్ సమ్మిట్‌లో ప్రముఖులు
ఇండిగో సంక్షోభం ఎందుకుంటే?
ఇండిగో విమానాలు వరుసగా రద్దు కావడంతో వివాహాలు, సెలవులు, ఉద్యోగ సంబంధిత ప్రణాళికలు ఉన్నవారు తీవ్రంగా ప్రభావితమయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్ పోర్ట్ లలో తీవ్ర గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. అయితే కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన నూతన విమాన భద్రతా నియమాల వల్లే ఇండిగోలో సేవల్లో సమస్యలు తలెత్తినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఉద్యోగులకు ఇచ్చే విశ్రాంతిని 36 గంటల నుంచి 48 గంటలకు పెంచడంతో ఇండిగోకు పెద్ద ఎత్తున పైలెట్స్ ను నియమించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో రోజుకు 2200 విమాన సర్వీసులను నడిపే ఈ ఎయిర్ లైన్స్.. గత వారం రోజులుగా విమాన సేవలను రద్దు చేసుకుంటూ వచ్చింది. దీంతో పరిస్థితి నియంత్రణలోకి తెచ్చేందుకు ఏవియేషన్ నియంత్రణ సంస్థ (DGCA) కొత్త నిబంధనలను తాత్కాలికంగా నిలిపివేసింది.

