Bhatti Vikramarka: ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనల్ మెస్సీ మ్యాచ్ అంటే ఫుట్‌బాల్ ప్రేమికులు ఊగిపోతారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మల్లు అన్నారు. ఈ మ్యాచ్ కోసం దేశం నలుమూలల నుంచి ఈ నెల 13న ఉప్పల్ స్టేడియంకు అభిమానులు తరలివస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయని, సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) జిల్లాల్లో పర్యటిస్తున్నారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదరణ ఉన్న మెస్సీకి ప్రత్యేక భద్రతా వ్యవస్థ ఉంటుందని డిప్యూటీ సీఎం తెలిపారు. 13న సీఎం టీమ్‌తో జరగనున్న ఫ్రెండ్లీ మ్యాచ్ నేపథ్యంలో పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయని, వాటిని తాను పరిశీలిస్తున్నట్టు ఆయన తెలిపారు.
లియోనల్ మెస్సీ సైతం ఆసక్తి
తెలంగాణ రైజింగ్ ఉత్సవాల్లో పాల్గొనేందుకు లియోనల్ మెస్సీ సైతం ఆసక్తి చూపారని డిప్యూటీ సీఎం వెల్లడించారు. దేశం నలుమూలల నుంచి వేలాది మంది ఫుట్‌బాల్ క్రీడాభిమానులు వస్తున్న నేపథ్యంలో భద్రత, సౌకర్యం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని నిర్దేశించిన సమయం కంటే ముందే అభిమానులు స్టేడియంలోకి చేరుకొని వారి వారి సీట్లలో కూర్చోవాలని డిప్యూటీ సీఎం సూచించారు. లియోనల్ మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్ సందర్భంగా ఫుట్‌బాల్ క్రీడా అభిమానులకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రత్యేకంగా దృష్టి పెట్టి
గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో హైదరాబాద్ నగరానికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులు, సంస్థల అధిపతులు, సీఈవోలు వస్తున్నారని ఆయన వివరించారు. ఫుట్‌బాల్ మ్యాచ్ ఏర్పాట్లను రాచకొండ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టి భద్రత ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను పోలీస్, హెచ్‌సీఏ అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు. మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం వచ్చి, వెళ్లే మార్గాలు, ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర వీఐపీలు వచ్చి వెళ్లే మార్గాలను డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా పరిశీలించారు. హాజరవుతున్న అభిమానుల సంఖ్య, సులభంగా వచ్చి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన గేట్ల సంఖ్య, పార్కింగ్, ఫుట్‌బాల్ క్రీడాభిమానుల కోసం మెట్రో, ఆర్టీసీ వంటి రవాణా సంస్థల ద్వారా ఏర్పాటు చేస్తున్న రవాణా సౌకర్యాలను డిప్యూటీ సీఎం సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంతో పాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడిషనల్ డీజీ విజయ్ కుమార్, రాచకొండ సీపీ సుధీర్ బాబు, రోహన్ రెడ్డి, శివసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

