Bhatti Vikramarka: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండేండ్లు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా సంబురాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. సచివాలయంలో తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించిన అంశాలను ఆయన వివరించారు. డిసెంబర్ 1న మక్తల్‌లో, 2న కొత్తగూడెంలో, 3న హుస్నాబాద్‌లో, 4న ఆదిలాబాద్‌లో, 5న నర్సంపేటలో, 6న దేవరకొండ సభలు నిర్వహించి సంబురాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి జిల్లాలో జరిగే ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీలో పలు అభివృద్ధికు శంకుస్థాపన
ఉమ్మడి జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఈ ఉత్సవాలకు హాజరవుతారన్నారు. 7వ తేదీన రాష్ట్రానికి ఐకానిక్‌గా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని వివరించారు. విద్య వ్యవస్థకు సంబంధించిన అంశాలపై మేధావులతో కలిసి ఆలోచన చేస్తారన్నారు. 8, 9న ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 8న ఈ రెండు సంవత్సరాలలో ఏం చేశామో వివరిస్తామని, 9న భవిష్యత్‌లో ఏం చేయబోతున్నామో తెలంగాణ సమాజం ముందు పెడతామని భట్టి స్పష్టంచేశారు. తెలంగాణ విజన్‌ను గ్లోబల్ సమ్మిట్‌లో ఆవిష్కరిస్తామని వివరించారు.
Also Read: Deputy CM Bhatti Vikramarka: లీకులు ఇస్తే చర్యలు తప్పవు.. అధికారులపై మంత్రి ఫైర్!
తెలంగాణ విజన్‌ను ఉప్పల్ స్టేడియంలో ఆవిష్కరిస్తాం
గ్లోబల్ సమ్మిట్‌లో ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను డిసెంబర్ 11, 12, 13 తేదీల్లో ప్రజలు చూసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. కాగా, ఫుల్‌బాల్ దిగ్గజ ఆటగాడు లియోనల్ మెస్సీ 13న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడనున్నారని, తెలంగాణ విజన్‌ను ఉప్పల్ స్టేడియంలో ఆవిష్కరిస్తామని భట్టి వివరించారు. ఇదెలా ఉండగా తెలంగాణ రైజింగ్ 2047 సమ్మిట్ రోడ్ మ్యాప్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకల్లో సమాజం ముందుకు తీసుకురావడం సంతోషంగా ఉన్నదన్నారు.
క్యాబినెట్ కలిసి తెలంగాణ రైజింగ్ 2047 పాలసీని తయారు
తెలంగాణ రాష్ట్రం దేశంతోనే కాకుండా, ప్రపంచంతో పోటీ పడేలా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్యాబినెట్ కలిసి తెలంగాణ రైజింగ్ 2047 పాలసీని తయారు చేసినట్లు చెప్పారు. అనంతరం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, 2034 నాటికి 1 ట్రిలియన్ ఎకనామీకి, 2047 వరకు 3 ట్రిలియన్ ఎకనామీకి ఎదిగేలా టార్గెట్‌గా పెట్టుకుని తమ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు తెలిపారు. ఆచరణ సాధ్యమయ్యే విధంగా విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్లు పేర్కొన్నారు. విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో వివిధ వర్గాలకు చెందిన 4 లక్షల మంది అభిప్రాయాలు సేకరించినట్లు చెప్పారు.
Also Read: Bhatti Vikramarka: ఇందిరమ్మ చీరల పంపిణీపై మహిళల హర్షం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
