Deputy CM Bhatti Vikramarka: బీఆర్ఎస్ నేతలు ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్‌ను అడ్డగోలుగా చేశారని డిప్యూటీ సీఎం భట్ట విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) ఫైర్ అయ్యారు. మంగళవారం క్యాబినెట్ భేటీ అనంతరం ఆయన మంత్రులతో కలిసి సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వంలో వారికి కావలసిన వారి కోసం, వ్యక్తుల కోసం విపరీతంగా ల్యాండ్ కన్వర్షన్లు చేశారన్నారు. అంతర్లీనంగా ఎంపిక చేసిన కొద్దిమందికే పాలసీ లేకుండా, క్యాబినెట్ అనుమతి లేకుండా ఇండస్ట్రియల్ పార్కులో కావలసిన వారికి భూములను కన్వర్ట్ చేశారన్నారు. బీఆర్ఎస్ నేతలు ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్లు ఎన్ని చేశారు? ఎవరెవరికి చేశారో? తొందరలోనే వివరాలను వెల్లడిస్తామన్నారు.
ప్రజా ప్రభుత్వంలో పారదర్శకంగా
ప్రజా ప్రభుత్వంలో హైదరాబాద్‌లో ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్ పాలసీనీ పారదర్శకంగా తీసుకువచ్చామని భట్టి అన్నారు. హైదరాబాద్ మహా నగరాన్ని కాలుష్య రహితంగా చేయడం, రాష్ట్రానికి ఆదాయం సమకూర్చడం అజెండాగా ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్ పాలసీనీ తీసుకువచ్చామని తెలిపారు. ఈ అంశంపై ఉన్నతాధికారులతో లోతుగా చర్చించామన్నారు. పరిశ్రమల భాగస్వాములతోనూ మాట్లాడామని, క్యాబినెట్‌లో సుదీర్ఘంగా చర్చించామని బీఆర్ఎస్ నేతల మాదిరిగా వ్యక్తి కోసం, వ్యక్తుల కోసం తాము ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్ చేయడం లేదని తెలిపారు. ప్రజలపై పన్నులు మోపే ఆలోచన కూడా లేదన్నారు.
80 ఫీట్ల రోడ్లు ఉన్నవారికి అవకాశం
ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్ పాలసీని పారదర్శకంగా తీసుకొచ్చి అందరికీ అవకాశం ఇస్తూ 50 శాతం ఎస్ఓఆర్ ప్రకారం 80 ఫీట్ల రోడ్లు ఉన్నవారికి అవకాశం ఇస్తే కన్వర్షన్ చేసుకుంటారన్నారు. ఈ విధానంతో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని తెలిపారు. నాచారం, మౌలాలి, ఉప్పల్, జీడిమెట్ల, బాలానగర్, కూకట్‌పల్లి వంటి ఇండస్ట్రియల్ కాలనీలు 50 సంవత్సరాల క్రితం హైదరాబాద్ అవతల ఉండేవని, పరిశ్రమలను అభివృద్ధి చేసేందుకు ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసి ఆనాడు ప్రభుత్వాలు ప్రోత్సహించాయన్నారు. 50 ఏళ్ల కాలంలో హైదరాబాద్ నగరం పెద్ద ఎత్తున విస్తరించి ఇండస్ట్రియల్ పార్కుల చుట్టూ పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం జరిగిందని చెప్పారు.
నగరాన్ని కాలుష్యం నుంచి విముక్తి కలిగించేందుకు ప్రస్తుతం ఆ పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు బయటకు తరలించాల్సి ఉన్నదని గుర్తు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య తీవ్రత పెరిగి పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొన్నదని, ఈ పరిస్థితి హైదరాబాద్‌కు రావొద్దు అనేది ప్రభుత్వం ఆలోచనగా వివరించారు. ప్రస్తుతం ఇండస్ట్రియల్ పార్కుల్లో ఉన్న వ్యక్తులను ఒత్తిడి చేసి బయటికి పంపలేమని, నగరాన్ని పొల్యూషన్ రెడ్ జోన్ ఆరంజ్ జోన్ల నుంచి విముక్తి కల్పించాలని కోర్టులు సూచించాయి అని డిప్యూటీ సీఎం తెలిపారు. అందుకే పారదర్శకంగా సమగ్ర ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్ పాలసీని తీసుకువచ్చామని తెలిపారు.
లీకులపై సీరియస్‌గా వ్యవహరిస్తాం: శ్రీధర్ బాబు
సచివాలయం నుంచి ప్రభుత్వ నిర్ణయాలు, క్యాబినెట్ భేటీలో జరిగే కీలక నిర్ణయాలను కొందరు లీకులు చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. జీవోలు, నిర్ణయాలపై లీకులపై ఎంక్వైరీ చేస్తామని, అలా వ్యవహరించిన ఆఫీసర్లపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. క్యాబినెట్, ప్రభుత్వ నిర్ణయాలు చాలా రహస్యంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని, ముందే లీకులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. పరిశ్రమల తరలింపు, రైజింగ్ తెలంగాణ 2047తో పాటు తదితర అంశాలను ముందుగానే కొన్ని మీడియాల ద్వారా ప్రతిపక్షాలకు చేర వేయాలని కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయని చెప్పారు. ఇక, రామగుండం పవర్ ప్లాంట్‌ను సూపర్ క్రిటికల్ ప్లాంట్‌గా మార్చాలనేది తమ సర్కార్ నిర్ణయమన్నారు. ఇప్పటి వరకు విద్యుత్ చార్జీలు పెంచలేదని, భవిష్యత్‌లోనూ పెంచే అవకాశం లేదన్నారు. రెప్ప పాటు కరెంట్ పోవద్దనేది తమ లక్ష్యంగా పేర్కొన్నారు.
పరిశ్రమలు తరలించడం మంచిదే: ఉత్తమ్
క్యాబినెట్ భేటీలో రీసోర్స్ మేనేజ్‌మెంట్ సబ్ కమిటీలో అంతా క్షుణ్ణంగా చర్చించిన తర్వాతనే పరిశ్రమలను బయటకు తరలించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కేటీఆర్, హరీశ్ రావులు అసత్య ప్రచారం చేయడం సరికాదన్నారు. కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే చర్చలు జరిగాయని, బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కొంత ప్రయత్నం చేసిందన్నారు. వ్యాపారవేత్తలు, నిపుణులు, అధికారులతో సంపూర్ణంగా మాట్లాడిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు.
జూబ్లీహిల్స్‌తోనే మాట్లాడే హక్కు కోల్పోయారు: జూపల్లి
ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు అవాస్తవాలు, అడ్డగోలు విమర్శలు కురిపించినా, జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్‌కు అండగా నిలిచారని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్‌కు మాట్లాడే అర్హత లేదని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు.
Also Read: Bhatti Vikramarka: ఇందిరమ్మ చీరల పంపిణీపై మహిళల హర్షం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
