Telangana BJP: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల తెలుగు రాష్ట్రాల ఎంపీలతో నిర్వహించిన అంతర్గత సమావేశంలో చర్చించిన అత్యంత గోప్యమైన అంశాలు బయటకు లీక్ అవ్వడంపై అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై బీజేపీ కేంద్ర నాయకత్వం సీరియస్ అయింది. సమావేశ వివరాలను బయటపెట్టిన ‘లీకు వీరుడి’ని గుర్తించేందుకు అంతర్గత విచారణకు ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ప్రధాని ఎప్పటికప్పుడు ఎంపీలతో భేటీ అవుతూ దిశానిర్దేశం చేస్తుంటారు.
ప్రభుత్వ పథకాలపై ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ఇది ఎప్పుడూ జరిగేదే. ఈ సమావేశాల్లో ప్రధానంగా పార్లమెంట్‌లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, ప్రభుత్వ పథకాలపై ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన తీరు, నియోజకవర్గాల్లో పనితీరు తదితర అంశాలపై సూచనలు చేస్తుంటారు. ఇవి అత్యంత రహస్యంగా జరిగే సమావేశాలు. అయితే, ఇటీవల జరిగిన భేటీలో ప్రధాని చేసిన వ్యాఖ్యలు, ఎంపీల పనితీరుపై ఆయన వ్యక్తం చేసిన అసంతృప్తి అంశాలు లీకవ్వడం పార్టీలో కలకలం సృష్టించింది.
Also Read: Telangana BJP: ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది.. ఇక చాలు ఆపేద్దాం అంటున్న బీజేపీ నేతలు
క్రమశిక్షణా చర్యలు తప్పవా?
పార్టీ అంతర్గత వ్యవహారాల అంశం సైతం బయటకు పొక్కడంపై ప్రధాని కార్యాలయం(పీఎంవో) కూడా అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. అధినాయకత్వం ఈ లీకేజీని తీవ్రంగా పరిగణించింది. సమావేశంలో పాల్గొన్న ఎంపీలందరి కదలికలు, ఎవరి ద్వారా సమాచారం బయటకు వెళ్లిందనే దానిపై ఆరా తీస్తున్నారు. క్రమశిక్షణకు మారుపేరైన బీజేపీలో ఇలాంటి సంఘటనలు అరుదు. పార్టీ అంతర్గత సమావేశాల గోప్యతను ఉల్లంఘించినట్లు తేలితే సదరు ఎంపీపై తీవ్రమైన క్రమశిక్షణా చర్యలు ఉండే అవకాశమున్నదని చర్చించుకుంటున్నారు. అందుకే ఆ లీకు వీరుడెవరనే అంశంపై అంతర్గతంగా విచారణ మొదలైనట్లు తెలిసింది. దీనికి సంబంధించిన నివేదిక సైతం త్వరలోనే అధిష్టానానికి వెళ్లే అవకాశమున్నదని విశ్వసనీయ వర్గాల సమాచారం.
పాత, కొత్త నేతల పంచాయితీ మూలంగానే
ప్రధాని మోదీ సమావేశంలో ముఖ్యంగా రెండు అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం. ఒకటి.. తెలంగాణలో బీజేపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో విఫలమైందనే అంశం. రెండు.. కేంద్ర పథకాలను, పార్టీ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సమన్వయ లోపం స్పష్టంగా కనిపించడం. క్షేత్రస్థాయిలో చురుకుగా లేరంటూ ఎంపీలపై మోదీ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ అంతర్గత సమావేశం వివరాలు బయటకు రావడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం భగ్గుమన్నారు. ఎవరో కావాలనే లీక్ చేశారని, వారు ఎవరో తెలిస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పార్టీలోని అంతర్గత వర్గపోరు
ఈ అసహనం వెనుక కారణం, పార్టీలోని అంతర్గత వర్గపోరు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం, ప్రత్యర్థులను దెబ్బతీయడం కోసం వివరాలను లీక్ చేశారనే చర్చ పార్టీలో జోరుగా సాగుతున్నది. ప్రధాని హెచ్చరికలు, కిషన్ రెడ్డి ఆగ్రహం వెనుక తెలంగాణ బీజేపీలో నడుస్తున్న పాత, కొత్త నేతల మధ్య ఆధిపత్య పోరే ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. గోప్యంగా ఉండాల్సిన అంశాలు బయటకు రావడం, తెలంగాణ బీజేపీలో భవిష్యత్ అంతర్యుద్ధానికి సంకేతంగా మారింది. మరి లీకు వీరులెవరనేది తెలిస్తే అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోననేది ఆసక్తికరంగా మారింది.
Also Read: Telangana BJP: లోకల్ ఎన్నికల్లో ఒంటరి పోరుకు కమలం సిద్ధం.. నెక్స్ట్ ప్లాన్ ఇదేనా..!

