Parliament News: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Parliament News) వాడీవేడిగా కొనసాగుతున్నాయి. కీలక బిల్లులు, అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. విమర్శలు, ప్రతివిమర్శలు, కొన్ని సందర్భాల్లో ఆగ్రహావేశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే, ఇందుకు పూర్తి విరుద్ధమైన ఆహ్లాదకరమైన సన్నివేశం పార్లమెంట్ ఆవరణలోనే శుక్రవారం నాడు చోటుచేసుకుంది. లోక్‌సభాపతి ఓం బిర్లా (Om Birla) ఇచ్చిన ‘టీ పార్టీ’లో (తేనీటి విందు) రాజకీయ వర్గాలను ఆకట్టుకునే దృశ్యం చోటుచేసుకుంది. రాజకీయ వైరాగ్యాలను మరిచి, అధికార, విపక్ష పార్టీల నేతలు స్నేహపూర్వకంగా ముచ్చటించుకోవడం కనిపించింది.
ప్రియాంక గాంధీ చెప్పింది విని నవ్విన మోదీ
ముఖ్యంగా, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) తేనీటి విందులో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rjanath Singh) కూర్చోవడం, ఆ పక్క సోఫాలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), స్పీకర్ ఓం బిర్లా కూర్చోవడం ప్రత్యేకంగా నిలిచింది. ఫ్రెండ్లీ వాతావరణంలో మాట్లాడుకుంటున్న సమయంలో, ప్రియాంక గాంధీ స్పందిస్తూ, అలర్జీల బారినపడకుండా తాను ప్రతినిధ్యం వహిస్తున్న వయనాడ్ నియోజకవర్గం నుంచి ఒక రకమైన మూలికను తెప్పించుకొని వాడుతున్నట్లు పంచుకున్నారు. ప్రియాంక చెప్పిన విషయాన్ని ఆసక్తిగా విన్న ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇద్దరూ స్మైల్ ఇచ్చారు. ప్రధాని మోదీ ఇటీవల చేపట్టిన ఇథియోపియా, జోర్డాన్, ఒమన్ పర్యటన ఎలా సాగిందని ప్రియాంక గాంధీ అడిగి తెలుసుకున్నారు. ఈ దేశాల పర్యటన మంచిగా జరిగిందంటూ ప్రధాని మోదీ సమాధానమిచ్చారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో పార్లమెంట్‌లో కాంగ్రెస్ బాధ్యతలను ప్రియాంక గాంధీయే చక్కదిద్దుతున్నారు. దీంతో, తేనీటి విందుకు హస్తం పార్టీ తరపున ప్రియాంక గాంధీ ప్రాతినిధ్యం వహించారు.
Read Also- Akhanda 2: ‘అఖండ 2’ థియేటర్లలో సౌండ్ బాక్సులు అందుకే ఆగిపోతున్నాయ్.. బాబోయ్ కాషన్ కియా..
ఆనవాయితీగా తేనీటి విందు
పార్లమెంట్ సమావేశాల ముగింపులో సభ్యుల మధ్య సత్సంబంధాలను పెంపొందించేలా లోక్‌సభ స్పీకర్ తేనీటి విందు ఇవ్వడం చాలాకాలంగా ఒక ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇక, శుక్రవారం జరిగిన తేనీటి విందు సుమారుగా 20 నిమిషాల పాటు సాగింది. పలువురు అధికార, ప్రతిపక్ష ఎంపీలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరదా సంభాషణలు జరిగాయి.
సభను మరికొన్ని రోజులు కొనసాగించాల్సిందంటూ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ సూచించగా.. ప్రధాని మోదీ సరదాగా స్పందించారు. ‘‘సభలో మీ గొంతు గాయపెట్టకూడదని త్వరగా ముగించాం’’ అని చమత్కరించారు. ధర్మేంద్ర యాదవ్ సభలో తన వాదనకు గట్టిగా మాట్లాడుతుంటారు. అందుకే, ప్రధాని మోదీ ఈ విధంగా సరదా వ్యాఖ్యలు చేశారు.
సభకు చక్కగా సిద్ధమై వస్తున్నారంటూ విపక్ష ఎంపీ ఎన్‌కే ప్రేమచంద్రన్ వంటి ప్రతిపక్ష ఎంపీలను ప్రధాని మోదీ ఈ సందర్భంగా మెచ్చుకున్నారు. కాగా, పాత పార్లమెంటు భవనంలో ఉన్నట్లుగా, కొత్త భవనంలో కూడా ఎంపీలు చర్చించుకోవడానికి సెంట్రల్ హాల్ ఏర్పాటు చేయాలని కొందరు నేతలు ప్రధానికి విజ్ఞప్తి చేశారు. దీనికి కూడా మోదీ చమత్కారంతో సమాధానం ఇచ్చారు. ‘‘అది రిటైర్మెంట్ తర్వాత అవసరం.. మీరు ఇంకా దేశానికి ఇంకా చాలా సేవ చేయాలి’’ అని అన్నారు. దీంతో, అక్కడున్నవారంతా నవ్వుకున్నారు.

