BRS party – KTR: భవిష్యత్తు గెలుపునకు భువనగిరి నుంచే పునాది
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో బీఆర్ఎస్కు పూర్వవైభవం ఖాయం
తల్లి పాలిచ్చే బర్రెను వదిలి.. తన్నే దున్నపోతును తెచ్చుకున్నట్లుంది కాంగ్రెస్ పాలన
ప్రజాబలంతో పంచాయతీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన బీఆర్ఎస్
జిల్లా పరిషత్ ఎన్నికలకు సిద్ధం కావాలి.. పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
బీఆర్ఎస్ పార్టీకి పూర్వవైభవం ప్రారంభమైందని, భవిష్యత్తులో సాధించబోయే అఖండ విజయాలకు యాదాద్రి భువనగిరి జిల్లా గడ్డ పునాది వేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS party – KTR) వ్యాఖ్యానించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపారు.
అధికారం కోల్పోయిన చోటనే పూర్వవైభవం
పెద్దలు చెప్పినట్లు ఎక్కడైతే అధికారం పోగొట్టుకున్నామో, అక్కడే వెతుక్కోవాలని, ఈరోజు సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ఆ ఉత్సాహాన్ని ఇస్తున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రెండేళ్ల కిందట అసెంబ్లీ ఎన్నికల్లో కొద్దిపాటి ఓట్ల తేడాతో నిరాశ ఎదురైనా, నేడు భువనగిరిలో 56 మంది, ఆలేరులో 74 మంది, మునుగోడులో 15 మంది, తుంగతుర్తిలో 9 మంది, నకిరేకల్‌లో 7 మంది.. ఇలా జిల్లా వ్యాప్తంగా మొత్తం 161 మంది సర్పంచులను గెలిపించుకోవడం సామాన్య విషయం కాదని ఆయన అన్నారు. ఈ విజయం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులకు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చిందని, లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో గులాబీ జెండా మళ్లీ రెపరెపలాడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ వికృత రాజకీయంపై నిప్పులు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయం అత్యంత గలీజుగా మారిందని కేటీఆర్ మండిపడ్డారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. నూతనకల్ మండలంలో మల్లయ్య యాదవ్‌ను కిరాతకంగా చంపడం, నల్గొండలో అభ్యర్థిపై దాడి చేసి అమానవీయంగా మూత్రం తాగించి అవమానించడం వంటి ఘటనలు కాంగ్రెస్ నాయకుల వికృత మనస్తత్వానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ గారు ఎప్పుడూ ఇలాంటి చిల్లర రాజకీయాలకు తావివ్వలేదని గుర్తు చేశారు. అధికారులు కూడా అధికార పక్షానికి కొమ్ముకాస్తూ, గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులను దొంగతనంగా ఓడించే ప్రయత్నం చేస్తున్నారని, 150కి పైగా గ్రామాల్లో జరుగుతున్న ఈ అన్యాయంపై కోర్టుల ద్వారా న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.
Read Also- Avatar 3 review: ‘అవతార్ 3’ ఫస్ట్ ఇంటర్నేషనల్ రివ్యూ.. అడ్డంగా బుక్కైపోతారట!
సిగ్గులేని రాజకీయం
పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లోకి వెళ్లామని సిగ్గు లేకుండా మైకుల్లో చెబుతున్న కడియం శ్రీహరి వంటి నాయకులు, అసెంబ్లీలో ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని హీనస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. 70 ఏళ్ల వయసులో సంపాదించుకున్న గౌరవాన్ని రేవంత్ రెడ్డి సంకలో చేరి నాశనం చేసుకున్నారని, గబ్బిలాలు సూరు పట్టుకుని వేలాడినట్లు వీరి పరిస్థితి తయారైందని ఘాటుగా విమర్శించారు. స్పీకర్ గారు కూడా ముఖ్యమంత్రి చెప్పినట్లు ఆడుతూ, ఫిరాయింపులు కనపడనట్లు నటిస్తున్నారని దుయ్యబట్టారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, గొంగిడి సునీత, గాదరి కిషోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, బూడిద బిక్షమయ్య గౌడ్ మరియు జిల్లా స్థాయి ముఖ్య నాయకులు, వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

