ICC ODI Rankings: సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ లో టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) సత్తా చాటిన సంగతి తెలిసిందే. కోహ్లీ తొలి రెండు వన్డేల్లో బ్యాక్ టూ బ్యాక్ సెంచరీలు బాది దుమ్మురేపాడు. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో కోహ్లీ 302 పరుగులు చేశాడు. అటు రోహిత్ సైతం సౌతాఫ్రికా సిరీస్ లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో ఇరువురు ఆటగాళ్లు టాప్ – 2 స్థానాలు దక్కించుకున్నారు. రోహిత్ (781 పాయింట్లు) అగ్రస్థానంలో ఉండగా.. కోహ్లీ (773) రెండు స్థానాలు మెరుగుపరుచుకొని సెకండ్ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు.
అగ్రస్థానానికి చేరువలో కోహ్లీ..
2021 ఏప్రిల్ లో చివరిగా కోహ్లీ వన్డేల్లో అగ్రస్థానంలో నిలిచాడు. పాక్ బ్యాటర్ బాబర్ ఆజాం తొలిస్థానానికి ఎగబాకడంతో కోహ్లీ.. నెం.1 ర్యాంకును కోల్పోయాడు. అప్పటి నుంచి సుదీర్ఘంగా ఒకటో స్థానం కోసం కోహ్లీ పోరాడుతూనే ఉన్నాడు. అయితే ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్న రోహిత్ కు రెండో స్థానంలో ఉన్న కోహ్లీకి మధ్య కేవలం 8 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో త్వరలోనే జరిగే వన్డేల్లో కోహ్లీ ఎప్పటిలాగే మెరుగైన ప్రదర్శన చేస్తే టాప్ ర్యాంక్ ను తేలిగ్గా దక్కించుకునే వీలుంటుంది.
నెం.1 స్థానాన్ని కాపాడుకున్న రోహిత్
సౌతాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో రోహిత్ శర్మ సైతం ఆకట్టుకున్నాడు. మూడు మ్యాచ్ లు కలిపి 146 పరుగులు చేశాడు. తద్వారా తన నెంబర్ వన్ ర్యాంక్ ను కాపాడుకున్నాడు. మరోవైపు శుభ్ మన్ గిల్.. ఈ సిరీస్ కు దూరమైనప్పటికీ ఐదో స్థానంలో స్థిరంగా కొనసాగుతున్నాడు. అతడి తర్వాత కేఎల్ రాహుల్ 12వ స్థానంలో నిలిచాడు. వన్డే ర్యాకింగ్స్ లో డారిల్ మిచెల్ (న్యూజిలాండ్) మూడో స్థానంలో, ఇబ్రహీం జార్డన్ (అఫ్గానిస్థాన్) 5వ స్థానంలో, బాబర్ ఆజం (పాకిస్థాన్) ఆరో స్థానంలో ఉన్నారు.
Also Read: CM Revanth Reddy: తమ్ముళ్ల కోసం వచ్చా.. ఓయూని అభివృద్ధి చేసి తీరుతా.. సీఎం రేవంత్ హామీ
టాప్ 3లోకి కుల్దీప్ సింగ్..
మరోవైపు ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్ లో కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) మూడో స్థానానికి ఎగబాకాడు. అతడి తర్వాత ఏ ఒక్క భారత బౌలర్ టాప్ – 10లో లేకపోవడం గమనార్హం. రవీంద్ర జడేజా 16వ స్థానంలో, సిరాజ్ 21వ స్థానంలో, షమీ 23వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో అఫ్గానిస్థాన్ బౌలర్ రషీద్ ఖాన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. జోఫ్రా ఆర్చర్ (ఇంగ్లాండ్) రెండో స్థానంలో నిలిచాడు. తీక్షణ (శ్రీలంక) నాల్గో స్థానంలో, కేశవ్ మహారాజ్ (దక్షిణాఫ్రికా) 5వ స్థానంలో ఉన్నారు. మరోవైపు టీ20 బౌలింగ్ ర్యాకింగ్స్ లో భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అగ్రస్థానంలో నిలవడం విశేషం.

