Team India victory: టీ20 ఫార్మాట్‌లో టీమ్‌ఇండియా మరోసారి తన సత్తా చాటింది. కటక్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్ సారధ్యంలోని టీమిండియా గ్రాండ్ విక్టరీ (Team India victory) సాధించింది. భారత బౌలర్లు సమష్టిగా రాణించడంతో 176 పరుగుల భారీ లక్ష్య చేధనతో బ్యాటింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికా జట్టు కేవలం 12.3 ఓవర్లు ఆడి 74 స్కోరుకే ఆలౌట్ అయ్యింది. దీంతో, భారత జట్టు ఏకంగా 101 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యాన్ని పొందింది.
బౌలింగ్ అదుర్స్
ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అదరగొట్టారు. మంచు ప్రభావం ఉన్నప్పటికీ ప్రత్యర్థిని ఊహించని రీతిలో దెబ్బకొట్టారు. ముఖ్యంగా పేసర్ అర్షదీప్ సింగ్ ఆరంభంలోనే దక్షిణాఫ్రికాకు ఊహించని షాక్ ఇచ్చాడు. తొలి ఓవర్ రెండో బంతికే వికెట్ తీశాడు. మ్యాచ్ మూడో ఓవర్‌లో మరో వికెట్ తీసి భారత్‌కు చక్కటి ఆరంభాన్ని అందించాడు. ఆ తర్వాత వచ్చిన బౌలర్లు కూడా అదే స్థాయిలో రాణించడంతో సఫారీ బ్యాటర్లు విలవిల్లాడారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలో రెండేసి వికెట్లు, హార్ధిక్ పాండ్యా, శివమ్ దూబే చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో తీసిన రెండు వికెట్లతో టీ20 ఫార్మాట్‌లో జస్ప్రీత్ బుమ్రా వికెట్ల సంఖ్య 100కి చేరింది.
దక్షిణాఫ్రికా బ్యాటింగ్ విఫలం
క్వింటన్ డి కాక్ 0, ఐడెన్ మార్క్రమ్ 14, ట్రిస్టన్ స్టబ్స్ 14, డెవాల్డ్ బ్రెవిస్ 22, డేవిడ్ మిల్లర్ 1, డానోవన్ ఫెరీరా 5, మార్కో యన్సెన్ 12, కేశవ్ మహారాజ్ 0, లుథో సిపామ్లా 2, లుంగీ ఎంగిడి 2 (నాటౌట్), అన్రిచ్ నోర్ట్జే 1 చొప్పున పరుగులు చేశారు. రెండంకెల స్కోర్ నమోదు చేసిన బ్యాటర్లు కేవలం నలుగురు మాత్రమే ఉండగా, అందులో 22 పరుగులు చేసిన బ్రెవిస్ టాప్ స్కోరర్‌గా నిలిచాడంటే, దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఎంత ఘోరంగా విఫలమయ్యారో అర్థం చేసుకోవచ్చు. దక్షిణాఫ్రికా కేవలం 74 పరుగులకే ఆలౌట్ కావడం, ఆ జట్టుకు టీ20 ఫార్మాట్‌లో ఇదే అత్యుల్ప స్కోరుగా నమోదయింది.
హార్దిక్ మెరుపులు
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ అదరగొట్టింది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా కేవలం 28 బంతుల్లో 59 పరుగులు బాది నాటౌట్‌గా నిలిచాడు. పాండ్యా సహకారంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 175 స్కోరు సాధించగలిగింది. సఫారీ బౌలర్లపై విరుచుకుపడిన హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌లో 4 సిక్సర్లు, 6 ఫోర్లు కొట్టాడు. మిగతా బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ 4, అభిషేక్ శర్మ 17, సూర్యకుమార్ యాదవ్ 12, తిలక్ శర్మ 26, అక్షర్ 23, శివమ్ దూబే 11, జితేష్ శర్మ 10 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి 3 వికెట్లు, సిప్‌మ్లా 2, ఫెర్రీరా 1 చొప్పున వికెట్లు తీశారు.
Read Also- Indigo flight cuts: ఇండిగోకి కేంద్రం షాక్.. సంచలన ఆదేశాలు జారీ
టాపార్డర్ ఘోరంగా విఫలం
కటక్ టీ20 మ్యాచ్‌లో భారత టాపార్డర్ బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేేకపోయారు. టీమ్ స్కోరు 5 పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత 17 పరుగుల వద్ద కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా పెవీలియన్ చేరాడు. ఆదుకుంటాడని భావించిన డాషింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ కూడా ఆ కొద్దిసేపటికే ఔట్ అయ్యాడు. దీంతో, 48 పరుగులకే భారత్ 3 వికెట్లు కోల్పోయింది. దీంతో, జట్టు కనీసం 150 స్కోర్ అయినా అందుకుంటుందా లేదా అనే సందేహం కలిగింది. అయితే, ఆ సమయంలో హార్దిక్ పాండ్యా అదరగొట్టాడు. ఫోర్లు, సిక్సర్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.

