Telangana Rising Global Summit: ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ (Telangana Rising Global Summit) ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మట్టికి గొప్ప చైతన్యం ఉందని వ్యాఖ్యానించారు. జల్, జంగిల్, జమీన్ అని కొమురం భీమ్ పోరాడిన గడ్డ ఇదని కొనియాడారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం తెలంగాణ ఎదురుచూస్తోందని, తెలంగా ప్రజలు కోరుకున్న స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు అందించేందుకు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను తీసుకొచ్చామని ఆయన తెలిపారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించామని సీఎం ప్రస్తావించారు.
Read Also- BRS MLA on Kavitha: కుక్కతో పోల్చుతూ కవితపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సెన్సేషనల్ వ్యాఖ్యలు.. తీవ్ర ఆరోపణలు
4 కోట్ల ప్రజల అభిప్రాయాలతో
‘‘ఇది నాలుగు గోడల మధ్య కూర్చుని తయారు చేసింది కాదు. నాలుగు కోట్ల ప్రజల అభిప్రాయాలు తీసుకుని తయారు చేసింది. ఆనాడు ఎడ్యుకేషన్, ఇరిగేషన్‌కు జవహర్ లాల్ నెహ్రూ ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు మేం ఎడ్యుకేషన్, ఇరిగేషన్, కమ్యూనికేషన్ నినాదంతో ముందుకు వెళ్తున్నాం. పేదరిక నిర్మూలన, నాణ్యమైన విద్య, యువతకు ఉపాధి అందించాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. పేదలకు సంక్షేమ ఫలాలు అందించాలన్నదే మా ఆకాంక్ష. పేదరికం ఏంటో తెలుసు. నేను గ్రామీణ ప్రాంతం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని వచ్చా. నాకు పేదలు, దళితులు, ఆదివాసీలతో మంచి అనుబంధం ఉంది. పేదల కష్టాలు తెలిసినవాడిగా ప్రతి పేదవాడికి సంక్షేమం అందించాలన్నదే నా తపన. విద్యార్థి దశలోనే కులవివక్షను నిర్మూలించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీలకు ఒకే చోట విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. ఇది మేం ఖర్చుగా భావించడంలేదు. ఇది తెలంగాణ భవిష్యత్ కు పెట్టుబడిగా భావిస్తున్నాం’’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నాణ్యమైన విద్య, స్కిల్స్ లేకపోవడంతో నిరుద్యోగం పెరుగుతోందని, అందుకే యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఒలింపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకుంటున్నామని పేర్కొన్నారు.
విజన్ డాక్యుమెంట్ విడుదల
అట్టడుగు వర్గాల, పేదల అభివృద్ధి కోసమే ఈ తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించామని రేవంత్ రెడ్డి చెప్పారు. ‘తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్’ గ్లోబల్ సమ్మిట్ వేదికపై ఆయన ఆవిష్కరించారు.
Read Also- Ponnam Prabhakar: రెండేళ్లలో ఆర్టీసీలో 251కోట్ల మంది మహిళలు జర్నీ.. మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం
కోర్… ప్యూర్… రేర్
3 ట్రిలియన్ వృద్ధి లక్ష్యం.. మూడంచెల తంత్రంతో విజన్ డాక్యుమెంట్ రాష్ట్ర ప్రభుత్వం రూపొందింది. తెలంగాణ రైజింగ్ 2047 దార్శనిక పత్రం, రాబోయే రెండు దశాబ్దాల్లో రాష్ట్రాన్ని సమగ్రంగా, సమ్మిళితంగా సుస్థిరంగా అభివృద్ధి చేసే దిశగా భవిష్యత్తుకు బాటలు వేసే దార్శనిక పత్రంగా సర్కారు భావిస్తోంది. రాబోయే రోజుల్లో ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను ఆవిష్కరించే బృహత్తరమైన ప్రయత్నంలో భాగమే తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్. ఇది రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే రోడ్ మ్యాప్. తెలంగాణ రాష్ట్ర ఉజ్జ్వల భవిత కోసం.. ప్రజల భవిష్యత్తు కోసం.. భావి తరాల కోసం.. ముందుచూపుతో ఈ డాక్యుమెంట్ రూపుదిద్దుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో రాష్ట్ర ప్రభుత్వం ఈ డాక్యుమెంట్‌ను తయారు చేసింది. 4 కోట్ల తెలంగాణ ప్రజల అభిప్రాయాలు.. ఆకాంక్షలకు ఇందులో చోటు కల్పించింది. అన్ని శాఖల మంత్రులు, అన్ని విభాగాల అధికారులు, మేధావులు, అన్ని రంగాల నిపుణులు, పారిశ్రామికవేత్తలు, సామాజిక, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సలహాలకు ప్రాధాన్యమిచ్చింది. ఈ డాక్యుమెంట్ రూపకల్పనలో నీతి ఆయోగ్ కూడా కీలక భూమిక పోషించింది. ఐఎస్‌బీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్) ప్రొఫెసర్లు డాక్యుమెంట్ తయారీలో పాలుపంచుకున్నారు. వరుస సంప్రదింపులు, రోజుల తరబడి చర్చలు, ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ప్రముఖుల సలహాలు, సూచనలు, వివిధ దేశాలు అనుసరిస్తున్న ఆదర్శవంతమైన విధానాలన్నింటినీ ప్రభుత్వం అధ్యయనం చేసింది. వీటన్నింటినీ విశ్లేషించుకొని, వడపోసి తెలంగాణ భవిష్యత్తు ఎలా ఉండాలో ఈ దార్శనిక పత్రంలో పొందుపరిచామని ప్రభుత్వం తెలిపింది.
లక్ష్యం ఇదే
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా వృద్ధి చేయడమే తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ విజన్ ప్రధాన లక్ష్యంగా ఉంది. దీంతో, తెలంగాణ అభివృద్ధిలో ప్రపంచ దేశాలకు ధీటుగా నిలబడి.. దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒకటిగా నిలుస్తుంది. రాష్ట్రం నలుమూలల అన్ని జిల్లాల నుంచి దాదాపు 4 లక్షల మంది ఆకాంక్షలు.. అభిప్రాయాలతో ఈ డాక్యుమెంట్ రూపొందించారు. 65 శాతం యువత ఈ ఉజ్వల తెలంగాణ భవిష్యత్ రూపకల్పన లో పాలుపంచుకున్నారు.
ఈ ఆర్ధిక వృద్ధికి ఆర్థిక వృద్ధి, సమ్మిళిత అభివృద్ధి, సుస్థిర అభివృద్ధి ఈ మూడు అంశాలు మూలస్తంభాలుగా ఉంటాయి.

