Nitish Kumar Reddy: రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఉత్కంఠభరిత విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచినప్పటికీ, బ్యాటింగ్, బౌలింగ్‌లో కొన్ని వైఫల్యాలు కనిపించాయి. ముఖ్యంగా, రోహిత్, విరాట్ ఔటయ్యే సమయానికి చక్కటి స్థితిలో ఉన్న స్కోర్ బోర్డును అదే జోరుతో ముందుకు తీసుకెళ్లడంతో మిగతా బ్యాటర్లు అంతగా సక్సెస్ కాలేకపోయారు. దీంతో, జట్టు కూర్పుపై టీమిండియా మాజీ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు.
నితీష్ రెడ్డిని తీసుకోకపోవడం ఏంటి?
ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి (Nitish Kumar Reddy) తుది జట్టులో చోటు కల్పించకపోవడంపై అశ్విన్ విమర్శలు గుప్పించాడు. రెగ్యులర్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అందుబాటులో లేనప్పుడు కూడా, నితీష్ రెడ్డిని పక్కన పెట్టడం ఏమిటని ప్రశ్నించాడు. పాండ్యా జట్టులో లేనప్పుడు కూడా నితీష్ కుమార్ రెడ్డికి స్థానం కల్పించలేకపోతే, జట్టు ఎంపికలో సీరియస్‌గా ఏదో లోపం ఉన్నట్టేనని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. తుది జట్టులోకి తీసుకోకపోతే అసలు అతడిని ఎందుకు ఎంపిక చేశారు? అని సందేహం వ్యక్తం చేశారు. హార్దిక్ పాండ్యా అందించే ఫలితాన్ని అందిస్తాడు కాబట్టే నితీష్‌ను జట్టులోకి ఎంపిక చేశారని సమర్థించాడు. కాలక్రమేణా మరింత మెరుగుపడతాడనే జట్టులోకి తీసుకున్నారని, కానీ తొలి వన్డేలో తుది జట్టులో నితీష్ కుమార్ రెడ్డికి స్థానం దొరకలేదంటే, తుది జట్టు కూర్పుపై సరైన రీతిలో సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని అశ్విన్ విశ్లేషించాడు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానెల్ ‘అశ్ కి బాత్’లో తన అభిప్రాయాన్నివెల్లడించాడు.
Read Also- Journalists Protest: డిసెంబర్ 3న హైద్రాబాద్‌లో జర్నలిస్టుల మహాధర్నా!
రోహిత్, ద్రవిడ్‌పై ప్రశంసలు
వన్డే క్రికెట్‌లో రోహిత్ శర్మ ప్రదర్శిస్తున్న దూకుడుపై అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ ట్రెండ్‌కు రోహిత్ శర్మతో పాటు మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా కారణమని, ఇద్దరినీ అభినందించాడు. ఈ క్రెడిట్ అంతా వారికే దక్కుతుందని, వీరిద్దరూ కేవలం దూకుడుగా ఆడాలని చెప్పడమే కాకుండా, స్వయంగా ఆచరించి చూపారని మెచ్చుకున్నాడు. దీంతో, టీ20లు, వన్డేలలో టీమిండియా విధానమే మారిపోయిందని విశ్లేషించాడు. రోహిత్ ఎప్పుడూ జట్టు తన నుంచి ఏది కోరుకుంటే అది చేసి చూపించాడని ప్రశంసించాడు. దూకుడుగా ఆడే ఈ మార్గాన్ని రోహిత్, ద్రవిడ్‌లే చూపించారని అశ్విన్ అన్నాడు. ద్రవిడ్ సూచన చేయగా, రోహిత్ దానిని ఆచరించాడని మెచ్చుకున్నాడు.
టీ20, వన్డే ఫార్మాట్ల నుంచి తప్పుకున్న స్టార్ ప్లేయర్లు రోహిత్, విరాట్ కోహ్లీలు కేవలం వన్డే క్రికెట్‌లో మాత్రమే కొనసాగుతున్నారు, కాబట్టి, అంతర్జాతీయ క్రికెట్‌లో వారు ఆడే మిగతా సమయాన్ని అభిమానులు ఆస్వాదించాలని అశ్విన్ కోరారు. ఎందుకంటే, రిటైర్మెంట్ తీసుకున్నాక తిరిగి తీసుకురండి వంటి మాటలు అనడం తగదని పేర్కొన్నాడు. కాగా, రోహిత్ శర్మ దూకుడుతో టీమిండియా వేగంగా ఆడే ట్రెండ్‌ను మొదలుపెట్టింది. 2023లో స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో లీగ్ దశలో భారత్ దూకుడుగా ఆడి ఆధిపత్యం చెలాయించడంలో ఈ మార్పు చాలా స్పష్టంగా కనిపించిందని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత, 2024లో టీ20 వరల్డ్ కప్‌ను గెలవడంలో కూడా ఈ దూకుడైన ఆటతీరు చాలా సాయపడిందనే విశ్లేషణలు ఉన్నాయి.
