CM Change Issue: కర్ణాటక కాంగ్రెస్‌లో (Karnataka) ‘ముఖ్యమంత్రి మార్పు’ వ్యవహారంపై (CM Change Issue) రాజకీయం కొనసాగుతూనే ఉంది. గత నెల నవంబర్ 20తో ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య (Siddaramaiah) బాధ్యతలు స్వీకరించి రెండున్నరేళ్లు గడిచిపోయింది. దీంతో, మిగతా కాలానికి సీఎం పీఠాన్ని తనకు అప్పగించాలని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shiva Kumar) బలంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఆసక్తికరమైన అంశం తెరపైకి వచ్చింది. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రంగంలోకి దిగి, 2023లో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇరువురు నేతలు తన సమక్షంలో అంగీకరించిన ఒప్పందానికి కట్టుబడి ఉండాల్సిందేనంటూ ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. నాటి ఒప్పందాన్ని ఇరువురూ గౌరవించాల్సిదేనని, లేకపోతే సొంత రాష్ట్రంలోనే తన విశ్వసనీయత దెబ్బతింటుందని ఖర్గే నిర్మోహమాటంగా చెప్పినట్టుగా జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. దీంతో, ఈ వివాదం ముగింపు దశకు చేరుకున్నట్లు కనిపిస్తోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వీలైనంత త్వరగా ఈ సమస్యకు ముగింపు పలకాలని కోరినట్టుగా సమాచారం. ఈ వ్యవహారంపై నిర్ణయానికి రావడానికి సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య మరో భేటీని కాంగ్రెస్ పార్టీ చేయబోతోందని తెలుస్తోంది.
Read Also- New Rule: డిలీట్ చేయడానికి వీలులేకుండా ఫోన్లలో కొత్త యాప్.. తయారీ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు!
దీంతో, నాయకత్వ మార్పుపై ఎలాంటి సందేహం లేదని, ఎప్పుడు అనేది మాత్రమే ప్రశ్న అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు, ఇరువర్గాలను సంతృప్తి పరిచేలా మార్పు చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని అభిప్రాయపడుతున్నారు. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు, సీఎం పదవి కావాలని డీకే శివకుమార్ పట్టుబట్టారు. సిద్ధరామయ్య కూడా పట్టుబట్టడంతో, చెరి రెండున్నర సంవత్సరాలు చేపట్టేలా ఇద్దరి మధ్య అంగీకారం కుదిరిందని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. అయితే, బహిరంగ ప్రకటన ఏమీ చేయకుండా, అంతర్గతంగా ఈ డీల్ కుదిరిందని కథనాలు వెలువడ్డాయి.
డీకేని ఢిల్లీకి పిలిచే ఛాన్స్!
మిగతా పదవికాలం సీఎం పదవిని తనకు ఇవ్వాల్సిందేనంటూ పట్టుబడుతున్న నేపథ్యంలో డీకే శివకుమార్‌ను 15 రోజుల్లోగా ఢిల్లీకి పిలిపించి, అగ్రనాయకత్వం మాట్లాడనున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ముఖ్యమంత్రి పదవిపై హామీ ఇవ్వనున్నట్లు కూడా సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. సీఎం మార్పు వ్యవహారాలు గతంలో పార్టీకి తీవ్ర ఇబ్బందికరంగా మారిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. గతంలో రాజస్థాన్‌లో సచిన్ పైలట్- అశోక్ గెహ్లాట్ మధ్య అంతర్గత పోరు, మరికొన్ని గత వ్యవహారాలను దృష్టిలో ఉంచుకొని, సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల ఆధిపత్య పోరు పార్టీకి నష్టం చేకూర్చకూడదని పార్టీ భావిస్తోందని హస్తం పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Read Also- Delhi Hospital: ఆస్పత్రిలో అమానుషం.. చనిపోయిన పేషెంట్ నగలు మాయం.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
అయితే, కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు వ్యవహారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వైఖరి ఎలా ఉంటుందనేది ఉత్కంఠను కలిగిస్తోంది. మధ్యలో ముఖ్యమంత్రిని మార్చడం పార్టీకి అంత లాభం చేకూర్చకపోవచ్చని రాహుల్ గాంధీ భావిస్తే, డీకే శివకుమార్‌కు ఆటంకాలు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, గత శనివారం సీఎం సిద్ధరామయ్య నివాసానికి డీకే శివకుమార్ వెళ్లారు. అధిష్టానం ఆదేశాల మేరకు ఇద్దరూ కలిసి కూర్చొని టిఫిన్ చేశారు. కానీ, ఆ సందర్భంలో పదవి షేరింగ్‌పై చర్చించినట్టుగా ఎలాంటి సమాచారం రాలేదు.
