Tirumala News: వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) కీలక నిర్ణయం తీసుకున్నది. మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu) అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. వైకుంఠ ద్వార దర్శన విధి విధానలపై చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేదీ వరకు నిర్వహించనున్న 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకే ప్రాధన్యతనిస్తున్నట్లు బీఆర్ నాయుడు వెల్లడించారు.
సమావేశంలో నిర్ణయాలు
డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలకు ఏర్పాట్లు చేయనున్నారు. ఆ 10 రోజులకు గాను 182 గంటల దర్శన సమయంలో దాదాపు 164 గంటలు సామాన్య భక్తులకు కేటాయించనున్నారు. ఇందులో భాగంగా మొదటి 3 రోజులు శ్రీవాణి దర్శనాలను, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రద్దు చేశారు. జనవరి 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా రోజువారీ 15 వేల (రూ.300)ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, 1000 శ్రీవాణి టికెట్లను రెగ్యులర్ పద్దతిలో కేటాయిస్తారు. అలాగే 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేశారు. స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా సిఫార్సు లేఖలు స్వీకరించరు. మొదటి 3 రోజులకు అన్ని టోకెన్లు కేవలం ఆన్‌లైన్ ఈ – డిప్ ద్వారానే కేటాయిస్తారు. రిజిస్ట్రేషన్లలో పారదర్శకత పాటించేందుకు మొదటి 3 రోజులకుగాను భక్తులు టీటీడీ వెబ్‌సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తారు. నవంబర్ 27 నుండి 1వ తేదీ వరకు భక్తులు టోకెన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. డిసెంబర్ 2వ తేదీన డిప్‌లో ఎంపికైన వారికి దర్శన సమాచారాన్ని పంపుతారు. జనవరి 6, 7, 8 తేదీల్లో రోజుకు 5వేల టోకెన్ల చొప్పున స్థానికులు ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ పద్దతిలో బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు.
Also Read: SS Rajamouli: రాజమౌళి పై కేసు నమోదు.. దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించమన్న వానరసేన?
పరకామణి కేసుపై విచారణ
భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని పరకామణి కేసును నిష్పక్షపాతంగా విచారణ చేసి బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదించేందుకు బోర్డు నిర్ణయం తీసుకున్నది. ఈ కేసులో ఎంతటి వారున్నా బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేయాలని తీర్మానించారు. అలాగే, ఈ నెల 27వ తేదీన అమరావతిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో రెండో ప్రాకారం నిర్మాణానికి భూమిపూజ జరగనున్నది. ఇందులో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.
Also Read: Army Chief Upendra Dwivedi: బ్లాక్‌మెయిలింగ్‌కు భారత్ భయపడదు.. పాక్‌కు స్ట్రాంగ్ వార్నింగ్..!
