Local Body Elections: రసవత్తరమైన రాజకీయాలకు కేరాఫ్ గా నిలిచే హుజూరాబాద్ నియోజకవర్గంలో మరోసారి పొలిటికల్ హీట్ మొదలైంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార బీఆర్‌ఎస్ పార్టీలో ముసలం మొదలై రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యంగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక జెడ్పీటీసీ స్థానం బీసీ జనరల్‌కు రిజర్వ్ కావడం.. దానికితోడు కరీంనగర్ జడ్పీ చైర్మన్ పదవి కూడా బీసీ జనరల్‌కు కేటాయించబడటంతో ఈ ఒక్క టికెట్ కోసం ముక్కోణపు పోటీ నెలకొంది.
పార్టీలోని ఇద్దరు కీలక నేతలు
హుజురాబాద్ ఉపఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్.. ప్రస్తుత ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎవరికి వారు టికెట్ తమకే కావాలని లేదా తమ అనుచరులకు ఇప్పించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ కోసం ఇద్దరు నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతుంది. గెల్లు శ్రీనివాస్ యాదవ్ లేదా ఆయన భార్య గెల్లు శ్వేత జెడ్పీటీసీగా గెలిచి జెడ్పీ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవాలని బలంగా భావిస్తున్నారు. మరోవైపు అదే వీణవంక మండలానికి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన సహచరుడికి టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. దీంతో ఈ ఇరువురి మధ్య తెరపైకి కనిపించని ప్రచ్ఛన్న యుద్ధం (కోల్డ్ వార్) నడుస్తోంది. టికెట్ కోసం వారు చేస్తున్న ప్రయత్నాలు, తెర వెనుక వ్యూహాలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి.
నీడలా వెంబడిస్తున్న ‘ఫాలో’ రాజకీయం
వీణవంక జడ్పీటీసీ టికెట్ ఆశిస్తున్న ఈ ఇద్దరు నేతలు ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఒక నేత రహస్యంగా ప్రచారం నిర్వహిస్తుంటే మరో నేత తన అనుచరులతో మరింత దూకుడు పెంచుతున్నారు. ఇందులో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే వారిలో ఒకరు చేసే ప్రచారాన్ని మరొకరు ఎవరు తోడు లేకుండా సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ రహస్యంగా వెంబడిస్తున్నారట! ఎక్కడ సమావేశాలు జరిగిన నీడలా ‘ఫాలో’ అవుతూ ఒకరి వ్యూహాలను మరొకరు పసిగట్టే ప్రయత్నం చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also Read: Rahul Ramakrishna: నేనొక చిన్న నటుడ్ని.. నా బాధ్యత తెలుసుకున్నా.. ట్విట్టర్‌కు గుడ్ బై!
ఆందోళనలో బీఆర్ఎస్ శ్రేణులు
పార్లమెంట్ ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో పట్టు కోల్పోయిన బీఆర్‌ఎస్‌కు.. టికెట్ కోసం నేతల మధ్య జరుగుతున్న ఈ వర్గపోరు మరింత సంక్షోభాన్ని తెచ్చే ప్రమాదం ఉందని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ గ్రూప్ వార్ పార్టీకి తీవ్ర నష్టం కలిగించవచ్చని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ ఆధిపత్య పోరుకు పార్టీ అధిష్టానం ఎలా ముగింపు పలుకుతుంది? వీణవంక జెడ్పీటీసీ అభ్యర్థి ఎవరవుతారు? అనేది ఇప్పుడు హుజూరాబాద్ బీఆర్ఎస్ రాజకీయాల్లో ఉత్కంఠగా మారింది.
