Ginning Mills Strike: పత్తి కొనుగోలులో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా రాష్ట్ర కాటన్ అసోసియేషన్ పిలుపు మేరకు జిన్నింగ్ వ్యాపారులు ఆందోళన బాట పట్టారు. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా జిన్నింగ్ పరిశ్రమలు మూసివేసి నిరసన తెలిపారు. మిల్లుల గేట్లకు నిరవధిక బంద్ చేస్తున్నట్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పత్తిని కొనుగోలు చేయాలని నిజామాబాద్(Nizamabad), ఆదిలాబాద్(Adilabad)తో పాటు పలు జిల్లాల్లో రైతులు ధర్నా కార్యక్రమాలు చేపట్టి నిరసన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 45.32 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అయ్యింది. 28 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుందని అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. సగటున ఎకరానికి 11.74 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. తొలుత సీసీఐ 12 క్వింటాళ్ల చొప్పున కొనుగోళ్లు చేపట్టింది. ఆ తర్వాత ఎకరాకు 7 క్వింటాళ్లకు తగ్గించింది. తెలంగాణలో ఈ సీజన్‌లో ఎకరానికి 7 టన్నుల దిగుబడి మాత్రమే వస్తుందని, అందుకే అంతే కొనుగోలు చేస్తామని సీసీఐ పేర్కొంది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు ఆకాల వర్షాలతో పత్తి తడిసిపోతుండటం, మరోవైపు తేమ పేరుతో 7 క్వింటాళ్ల నిబంధన పెట్టింది. దీంతో రైతులు పత్తి వ్యాపారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సీసీఐ నిబంధనలతో మిల్లర్లకు నష్టం
మరోవైపు కేంద్రం ప్రభుత్వ ఆధీనంలోని సీసీఐ తీసుకొచ్చిన ఎల్–1 నుంచి ఎల్– 12 నిబంధనలతో రాష్ట్రంలోని జిన్నింగ్ మిల్లర్లు నష్టపోతున్నారు. ఎల్-–1 నుంచి కొనుగోళ్లు ప్రారంభించాలని సీసీఐ పేర్కొంది. దీంతో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం నెల కొన్నది. అన్ని జిన్నింగ్ మిల్లులు ఒకేసారి ప్రారంభమైతే రైతులు అమ్ముకోవడానికి ఇబ్బందులు ఉండవు. మిల్లర్లకు సైతం ఎప్పటికప్పుడు కొనుగోళ్లు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. సీసీఐ నిబంధనతో మిల్లర్లు ఇబ్బందులు ఎదుర్కొంటుండటం, అందుకు అంగీకరించకపోవడంతో కొన్ని మిల్లులు అసలు ప్రారంభం కాలేదు.
Also Read: Viral Video: కూతురికి భోజనం నచ్చలేదని.. ఏకంగా యూనివర్శిటీ ముందే ఫుడ్ స్టాల్ పెట్టేసిన తండ్రి
తేమ శాతం 12 నుంచి 20 పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ హామీ మేరకు రాష్ట్రంలోని 325 జిన్నింగ్ మిల్లులు టెండర్‌లో పాల్గొని పత్తి కొనుగోలుకు అంగీకరించాయి. అయితే కేంద్రం తీసుకొచ్చిన నిబంధనలతో జిన్నింగ్ మిల్లులను ఎల్–1 నుంచి ఎల్–12 వరకు విభజించింది. పత్తి కొనుగోళ్లు జరపాలనే నిర్ణయంపై మొదటి నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్న జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు నిబంధనలు సవరించాలని కేంద్రాన్ని కోరారు. కొనుగోళ్లు ఆరంభమై నెల రోజులు గడిచినప్పటికీ కేంద్రం నుంచి స్పందన కరువైంది. తెలంగాణ వ్యాప్తంగా 325 జిన్నింగ్ మిల్లులు ఉండగా, ఇప్పటి వరకు కేవలం 243 మిల్లులు మాత్రమే కొనుగోళ్లను ప్రారంభించాయి. మిగతా 82 మిల్లులు ఇంకా తెరుచుకోలేదు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లి పత్తిని అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. పత్తి కొనుగోళ్ల నిబంధనలు ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రులు, సీసీఐ ఎండీకి సైతం లెటర్లు రాశారు. అయినప్పటికీ స్పందన కరువైంది. రాష్ట్ర పరిస్థితిని సైతం వివరించారు. ఎకరాకు 12 క్వింటాల్లు కొనుగోలు చేయాలని, ఎల్–1, ఎల్–12 నిబంధన తొలగించాలని విజ్ఞప్తి చేసింది. అయినా స్పందన కరువు కావడంతో జిన్నింగ్ మిల్లర్లు సమ్మెబాట పట్టారు.
నేడు జిన్నింగ్ మిల్లర్లతో చర్చలు
జిన్నింగ్ మిల్లర్లతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మంగళవారం మిల్లర్లు చర్చలకు రావాలని ఆహ్వానించింది. సమస్యలపై చర్చిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరపున భరోసా ఇవ్వనున్నట్లు సమాచారం. రైతులు ఇబ్బందుల పడకుండా చర్యలు తీసుకోనున్నది. రైతుల కోణంలో ఆలోచించి మిల్లర్లు సమ్మె విరమించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.
Also Read: Saudi Bus Accident: సౌదీ బస్సు ప్రమాద మృతుల బాధితులకు నష్ట పరిహారం ప్రకటించిన సీఎం

