Ganja Smuggling: ముగ్గురిని అరెస్ట్ చేసిన ఎక్సయిజ్ పోలీసులు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: దేవాలయానికి సమీపంలో గంజాయి విక్రయిస్తున్న (Ganja Smuggling) ముగ్గురిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 3.230 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బోయిన్‌పల్లి ప్రాంతానికి చెందిన భరత్, ఉమేష్, శశికాంత్ ముగ్గురు కొన్ని రోజులుగా గంజాయి దందా చేస్తున్నారు. ధూల్‌పేట నుంచి గంజాయి కొని బోయిన్‌పల్లి పరిసరాల్లో అమ్ముతున్నారు. గురువారం బోయిన్ పల్లిలోని ముత్యాలమ్మ గుడి సమీపంలో భరత్, ఉమేశ్ గంజాయి అమ్ముతుండగా డీటీఎఫ్ సీఐ సౌజన్య సిబ్బందితో కలిసి అరెస్ట్ చేశారు. దీనికి కొద్దిదూరంలోనే గంజాయి విక్రయిస్తున్న శశికాంత్‌ను కూడా అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 3.230 కిలోల గంజాయిని సీజ్ చేశారు. ముగ్గురిపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.
డ్రగ్స్ ఓవర్ డోస్‌తో యువకుడి మృతి
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: డ్రగ్స్ ఓవర్ డోస్ కారణంగా యువకుడు మృత్యువాత పడ్డాడు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పాతబస్తీకి చెందిన అహమద్ అలీ వృత్తిరీత్యా మొబైల్ రిపేర్లు చేస్తున్నాడు. శివరాంపల్లిలోని కెన్వర్త్ అపార్ట్‌మెంట్‌లోని 805వ నెంబర్ ఫ్లాట్‌లో అహమద్ అలీ, అతడి స్నేహితుడు సయ్యద్ ఇద్దరు యువతులతో కలిసి లివింగ్ రిలేషన్ షిప్‌లో ఉంటున్నారు. బుధవారం రాత్రి సయ్యద్‌తోపాటు వీరితో ఉంటున్న ఓ యువతి కలిసి డ్రగ్స్ పార్టీ చేసుకున్నారు. ఓవర్ డోస్ కావటంతో అహమద్ అలీ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే సయ్యద్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు కెన్వర్త్ అపార్ట్‌మెంట్‌కు వెళ్లారు. అయితే, అహమద్ అలీ అప్పటికే చనిపోయాడు. పంచనామా జరిపిన పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఇక, అహమద్ అలీతోపాటు ఫ్లాట్‌లో ఉంటున్న సయ్యద్, ఇద్దరు యువతులకు డ్రగ్ పరీక్షలు జరిపించారు. దీంట్లో సయ్యద్‌తోపాటు ఓ యువతి మాదక ద్రవ్యాలు తీసుకున్నట్టుగా నిర్ధారణ అయ్యింది.
Read Also- Bigg Boss Telugu 9: సీక్రెట్ రెబల్.. హౌస్‌లో అసలు సిసలు బిగ్ బాస్ ఆట మొదలైంది
డ్రగ్స్ సేవించినట్టు చెప్పారు
బుధవారం రాత్రి డ్రగ్స్ తీసుకుని అహమద్ అలీ స్పృహ కోల్పోయినట్టుగా తమకు సమాచారం వచ్చినట్టు రాజేంద్రనగర్ సీఐ క్యాస్ట్రో చెప్పారు. తాము వెళ్లే సరికే అహమద్ అలీ చనిపోయాడన్నారు. మాదక ద్రవ్యాలు తీసుకున్నట్టు తెలియడంతో మిగతా ముగ్గురికి డ్రగ్ టెస్టులు జరిపించామన్నారు. దీంట్లో సయ్యద్, మరో యువతి డ్రగ్స్ తీసుకున్నట్టుగా నిర్ధారణ అయ్యిందన్నారు. వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామన్నారు. విచారణలో లక్డీకాపూల్ ప్రాంతం నుంచి డ్రగ్స్ తెచ్చినట్టుగా వెల్లడయ్యిందని తెలిపారు. ఎవరి నుంచి డ్రగ్స్ కొన్నారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. అపార్ట్ మెంట్లలో ఎవరైనా అనుమానాస్పదంగా వ్యవహరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
