Konda Reddy Arrest Case: డ్రగ్స్ దిగుమతి, విక్రయాల కేసులో విశాఖపట్నం జిల్లా వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు కొండారెడ్డిని పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ప్రభుత్వ, ప్రతిపక్షం మధ్య పరస్పర ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వీళ్లేదు అన్నట్టుగా రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో హత్యలు, దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయని ఆయన విమర్శించారు. ‘‘ప్రభుత్వ పెద్దలను అడిగితే మా చేతుల్లో ఏమైనా లాటీ ఉందా అని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వైసీపీ నేతలను ప్రభుత్వం టార్గెట్ చేస్తోంది’’ అని గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థి నేత అరెస్టుపై ప్రశ్నలు ఇవే
కల్తీ మద్యం వ్యవహారంలో నకిలీ ఆధారాలతో వైసీపీ విద్యార్థి నేత కొండారెడ్డిని అరెస్ట్ చేశారని గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి కక్ష సాధింపు ఒక అలవాటుగా మారిపోయిందని ఆరోపించారు. ఆఖరికి వైసీపీ విద్యార్థి నాయకులను కూడా ఈ ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను డైవర్ట్ చెయ్యడానికి వైసీపీ నేతలను ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని గుడివాడ అమర్నాథ్ అన్నారు. వైసీపీ విద్యార్థి సంఘం నాయకుడు కొండా రెడ్డి ఏ తప్పూ చేయలేదని వారి తల్లితండ్రులు చెబుతున్నారని, తప్పు చేస్తే ఏ శిక్షకైనా కొండా రెడ్డి సిద్దమంటున్నారని ప్రస్తావించారు. తమ కొడుకు తప్పు చేస్తే ఏ టెస్టుకైనా సిద్దమని వారు చెబుతున్నారని పేర్కొన్నారు.
Read Also- India vs Australia: నాలుగో టీ20లో టీమిండియా మోస్తరు స్కోర్.. గెలుస్తారో, లేదో?
కొండారెడ్డిపై చెయ్యి దాడి
కొండా రెడ్డిని అదుపులోకి తీసుకునే సమయంలో కొండారెడ్డిపై చెయ్యి చేసుకున్నారని గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. 2న ఉదయం 7:10 నిమిషాలకు కొండారెడ్డిని అదుపులోకి తీసుకున్నారని, ఆ సమయంలో వీడియో రికార్డ్ చేసి, వీడియో ఎందుకు బయటకు ఇచ్చారని ప్రశ్నించారు. ‘‘ రైల్వే స్టేషన్ వద్ద అరెస్ట్ చేశామని పోలీసులు ఎందుకు చెప్పారు?, 2న సాయంత్రం అరెస్ట్ చేస్తే, ఉదయం 11:30 గంటలకే టీడీపీ అఫీషియల్ పేజీలో ఎలా పెట్టారు?, టీడీపీ వాళ్ల దగ్గర టైమ్ మిషన్ ఏమైనా ఉందా?, టాస్క్‌ఫోర్స్ పోలీసులు కొండా రెడ్డిని అదుపులోకి తీసుకున్నది ఎంవీపీ పీఎస్ పరిధిలో అతడిని 14 కి.మీ. ఎక్కువగా ఎందుకు తిప్పారు?’’ అని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. పోలీసులు ప్లాన్ ప్రకారమే కొండా రెడ్డిని అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు.

