Jagan Padayatra 2.O: మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2017-18 మధ్యకాలంలో ఏకంగా 3,684 కిలోమీటర్ల మేర చేపట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ తెలుగు రాష్ట్రాల జనాలకు గుర్తుండే ఉంటుంది. 2019లో జగన్ అధికారపీఠం ఎక్కడానికి ఆ యాత్ర ఎంతగానో దోహదపడుతుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దాదాపు అన్ని వర్గాల జనాలతో మమేకం అయిన జగన్, ప్రజాభిప్రాయాలను సేకరించి ‘నవరత్నాలు’ పేరిట మేనిఫెస్టోని రూపొందించారు. ఆ పాదయాత్ర ప్రభావంతో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సునామీ సృష్టించి, సింగిల్‌గా 151 సీట్లు గెలిచారు. అయితే, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కలలో కూడా ఊహించని ఘోరాతి ఘోరమైన ఓటమిని మూటగట్టుకున్నారు. అయితే, 2029లో తిరిగి గద్దెనెక్కాలంటే మళ్లీ పాదయాత్ర చేపట్టాల్సిందేనని వైఎస్ జగన్ ఫిక్స్ అయ్యారా?, క్షేత్రస్థాయిలో 2017-18 నాటి వ్యూహాలను మళ్లీ అమలు చేయబోతున్నారా? అంటే, దాదాపుగా ఫిక్స్ అయినట్టుగానే అనిపిస్తోంది.
2027లో ప్రజా సంకల్ప యాత్ర 2.0!
రాష్ట్ర మాజీ మంత్రి, వైసీసీ సీనియర్ నాయకుడు పేర్ని నాని పార్టీకి సంబంధించిన ఓ కార్యక్రమంలో గురువారం మాట్లాడుతూ, 2027లో ప్రజా సంకల్ప యాత్రను (Jagan Padayatra 2.O) వైఎస్ జగన్ మొదలుపెడతారని వెల్లడించారు. కూటమి ప్రభుత్వంలోని అల్లరి మూకలు, రాక్షసులు ప్రజలను పెట్టిన కష్టాలను తెలుసుకుంటూ రెండేళ్లపాటు పాదయాత్ర కొనసాగిస్తారని చెప్పారు. పార్టీలో ముఖ్యనేతల్లో ఒకరైన పేర్ని నాని చేసిన ఈ ప్రకటనతో 2027లో ప్రజా సంకల్పయాత్ర 2.0 ఖరారైనట్టే, ఇక ముహుర్తం ఎప్పుడన్నదే తెలియాల్సి ఉంటుంది.
మిషన్ 2029 దిశగా..
ప్రజా సంకల్ప యాత్ర 2.0కు సంబంధించి పేర్ని నాని చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఉత్కంఠ కలిగించింది. 2017-18 నాటి తన ప్రస్థానాన్ని పునరావృతం చేయడం ద్వారా, 2029 సార్వత్రిక ఎన్నికలకు సన్నాహకంగా, ‘మిషన్ 2029’ను ఛేదించాలన్న జగన్ లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. 2024లో ప్రతిపక్ష హోదా దక్కకపోవడం, అధికార పక్షం కూడా అందుకు ససేమిరా అనడంతో జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాక్షేత్రంలో నిలవడమే కరెక్ట్ అని జగన్ భావిస్తున్నట్టు క్లియర్ కట్‌గా తెలిసిపోతుంది.
గతంలో చేపట్టిన పాదయాత్ర జగన్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. అయితే, అధికారం చేపట్టిన తర్వాత ఐదేళ్లపాటు అమలు చేసిన సంక్షేమ పథకాలు తిరిగి ఆయన్ను అధికారంలోకి తీసుకురాలేకపోయాయి. దీంతో, ప్రజల్లో తనపై విశ్వాసాన్ని పెంచుకోవాలని, ప్రజాభిప్రాయాలను ప్రత్యక్షంగా జగన్ తెలుసుకునే అవకాశం ఉంది. ప్రజా క్షేత్రంలోకి వెళ్లడం ద్వారా వైఫల్యాలను సరిదిద్దుతూ, క్షేత్రస్థాయి క్యాడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపడం జగన్ ప్రధాన లక్ష్యాలుగా ఉంటాయని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాగే, కూటమి ప్రభుత్వ వాగ్దానాలు ఎంతవరకు అమలయ్యాయనే దానిపై, ప్రభుత్వ పనితీరుపై నిలదీసే అవకాశం ఉంటుంది.
Read Also- Heroes turned villains: టాలీవుడ్‌లో హీరోలుగా పరిచయమై విలన్లుగా మారిన నటులు ఎవరో తెలుసా..
మేనిఫెస్టోకి, అభ్యర్థుల ఎంపికకు బాటలు
గత పాదయాత్ర ద్వారా 2019 నాటి ‘నవరత్నాలు’ మేనిఫెస్టోని వైసీపీ రూపొందించింది. అచ్చం అదే మాదిరిగా, 2029 ఎన్నికల కోసం పార్టీ రూపొందించే ఎన్నికల మ్యానిఫెస్టోకు ప్రజాసంకల్ప యాత్ర 2.0 వేదికగా అయ్యే అవకాశం ఉంటుంది.ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకుని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నూతన హామీలను ప్రకటించడం, ప్రజాక్షేత్రంలోనే అధికార కూటమి ప్రభుత్వాన్ని నిలదీయడం జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. అంతేనా, ఈ పాదయాత్ర 2029 నాటికి అభ్యర్థుల మార్పులు, పార్టీలో సంస్థాగత మార్పులకు కూడా ఈ పాదయాత్ర నాంది పలికే అవకాశం ఉంటుంది. నియోజకవర్గాల వారీగా పార్టీని బలోపేతానికి పావులు కదపనున్నారు.
కూటమి పక్షాల వ్యహం ఏమిటో?
2027లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రకు మొదలుపెడితే, అధికార కూటమికి చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలప్రతిస్పందన ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా ఉంటుంది. జగన్ తన పాదయాత్రలో కూటమి ప్రభుత్వ హామీల అమలు తీరుపై విమర్శలు చేయడం గ్యారంటీగా ఉంటుంది. జగన్ పాదయాత్ర రాజకీయ ప్రభావాన్ని తగ్గించడం కోసం, ప్రభుత్వంపై జనాలకు ప్రతికూల ప్రభావం కలగడకుండా చంద్రబాబు ప్రభుత్వ ఏవిధంగా వ్యహరిస్తుందో చూడాలి. మొత్తంగా, జగన్ ప్రజాసంకల్ప యాత్ర 2.0ను మొదలుపెట్టిన రోజు 2029 సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని ముందస్తుగా ప్రారంభించినట్టే భావించాలని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2014 మాదిరిగానే, 2024లో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడం, నాడు జగన్ చేసిన పాదయాత్ర సక్సెస్‌ఫుల్‌గా వర్కౌట్ అవ్వడంతో, 2027లో జగన్ మొదలుపెట్టబోయే ‘ప్రజా సంకల్ప యాత్ర 2.0’ గేమ్ ఛేంజర్ అవుతుందా? అనేది కాలమే చెప్పాలి.
