Election Commission: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమీషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 11న జరిగే పోలింగ్ లో ఓటు వేయాలంటే ఫోటో గుర్తింపు కార్డు తప్పనిసరని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం, ప్రతి ఓటరు పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి ముందు తమ ఓటరు ఫోటో ఐడీ కార్డు (EPIC) చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఓటర్ కార్డు లేకుంటే..
ఓటర్ జాబితాలో ఉండి.. ఓటర్ ఐడీ కార్డు లేనివారు సైతం జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో తమ హక్కును వినియోగించవచ్చని సి. సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. EPIC లేని వారు.. తాము సూచించిన ఈ 12 కార్డుల్లో ఏది చూపించినా ఓటు వేసేందుకు ఈసీ సిబ్బంది అనుమతిస్తారని తెలిపారు. ఆ కార్డుల వివరాలు ఇలా ఉన్నాయి.
1. ఆధార్ కార్డు
2. ఎంఎన్‌ఆర్‌ఈజీఎ ఉద్యోగ కార్డు
3. బ్యాంకు లేదా పోస్టాఫీస్ జారీ చేసిన ఫొటో ఉన్న పాస్‌బుక్
4. హెల్త్ ఇన్ష్యూరెన్స్ స్మార్ట్ కార్డు (ఆయుష్మాన్ భారత్ కార్డు సహా)
5. డ్రైవింగ్ లైసెన్స్
6. పాన్ కార్డు
7. నేషనల్ పాప్యులేషన్ రిజిస్టర్ (ఎన్‌పీఆర్) కింద జారీ చేసిన స్మార్ట్ కార్డు
8. భారత పాస్‌పోర్టు
9. ఫొటోతో ఉన్న పెన్షన్ పత్రం
10. ప్రభుత్వ, పీఎస్‌యూ లేదా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగి గుర్తింపు కార్డు
11. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అధికార గుర్తింపు కార్డు
12. సామాజిక న్యాయశాఖ జారీ చేసిన వికలాంగుల యూనిక్ ఐడీ (UDID) కార్డు
విదేశీ ఓటర్లు సైతం..
విదేశీ ఓటర్లు (Representation of the People Act, 1950 లోని సెక్షన్ 20A ప్రకారం నమోదు అయిన వారు) కూడా జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఓటు వేసేందుకు ఈసీ వీలు కల్పించింది. ఓటు కోసం వారు పాస్ పోర్టును చూపించాల్సి ఉంటుంది. మరోవైపు ఓటరు సమాచారం స్లిప్ లను పోలింగ్ కు కనీసం ఐదు రోజుల ముందుగానే పంపిణీ చేయనున్నట్లు ఈసీ తెలిపింది. అయితే అవి గుర్తింపు పత్రాలుగా ఉపయోగించరాదని స్పష్టం చేసింది. పైన చెప్పిన ఫొటో ఐడెంటిటీ గుర్తింపు కార్డులను తప్పనిసరిగా పోలింగ్ బూత్ వద్దకు తీసుకెళ్లాని స్పష్టంచింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఓటర్లు తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో ధృవీకరించుకుని చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడీతో పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలని సుదర్శన్ రెడ్డి సూచించారు. నవంబర్ 11న బాధ్యతగా ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Also Read: Jubliee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో ఎన్నడూ గెలవలేదు.. బీజేపీకి ఛాన్స్ ఇవ్వండి.. ఓటర్లకు కిషన్ రెడ్డి రిక్వెస్ట్
మెుత్తం ఓటర్లు ఎంతంటే?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటర్ల సంఖ్యను జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ ఇటీవల ప్రకటించారు. ఆయన ప్రకారం ఈ నియోజకవర్గంలో 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 2 లక్షల 8 వేల 561 మంది ఉండగా, మహిళా ఓటర్లు లక్షా 92 వేల 779 మంది ఉన్నారు. అలాగే థర్డ్ జెండర్ ఓటర్లు మరో 25 మంది ఉన్నట్లు స్పష్టం చేశారు. కాగా, నవంబర్ 11న జరిగే జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.
