Dharmapuri Arvind: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఎంపీ ధర్మపురి అరవింద్ దూరంగా ఉంటున్నారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రచారంలో కనీసం ఒక్కరోజు కూడా పాల్గొనలేదు. స్టార్ క్యాంపెయినర్ లిస్టులో ఉన్నా ప్రచారంపై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ అంశంపైనే శ్రేణుల్లో చర్చ జోరుగా సాగుతున్నది. మిగతా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏదో ఒక సందర్భంలో ప్రచారానికి వచ్చారు. అలాంటిది హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్‌ను అని చెప్పుకునే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాత్రం ఎందుకు పాల్గొనడం లేదనేది శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. తాను ప్రతిపాదించిన అభ్యర్థికి టికెట్ ఇవ్వకపోవడమే దీనికి కారణమా అనే చర్చ కూడా పార్టీలో జరగుతున్నది.
Also Read: MP Dharmapuri Arvind: సోషల్ మీడియాలో మంత్రి పోస్ట్ వైరల్.. కారణం అదేనా!
అందుకే సైలెంట్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా ఎవరిని ఫిక్స్ చేస్తే బాగుంటుందనే అంశంపై అందరి అభిప్రాయాలను త్రీ మెన్ కమిటీ, మానిటరింగ్ కమిటీ కలిసి అభిప్రాయాలు తీసుకున్నాయి. చివరకు లంకల దీపక్ రెడ్డిని హైకమాండ్ ఫైనల్ చేసింది. అభ్యర్థిని ఫైనల్ చేసే కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ నేత బొంతు రామ్మోహన్‌కు టికెట్ ఇస్తే బాగుంటుందని అరవింద్ పార్టీకి వివరించినట్లుగా చెప్పారు. టికెట్ కన్ఫామ్ చేస్తే కాషాయగూటికి వస్తారని చెప్పారు. కానీ అందుకు అనుగుణంగా ముందడుగు పడకపోవడంతో అరవింద్ ప్రచారాన్ని లైట్ తీసుకున్నారనే చర్చ జరుగుతున్నది. దీని పర్యవసానమే ఈ ఉప ఎన్నికకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో డివిజన్ల వారీగా చేపట్టే మాస్ క్యాంపెయిన్ జాబితాలో కూడా ఆయన పేరు లేకుండాపోయిందని చర్చించుకుంటున్నారు. అందరి పేర్లు పెట్టిన పార్టీ ఆయన పేరును మాత్రం ఈ జాబితాలో చేర్చకపోవడం గమనార్హం. కేంద్ర మంత్రి బండి సంజయ్ పేరు కూడా ఈ జాబితాలో లేకపోయినా రోడ్ షోలు చేపడుతారని పార్టీ తెలిపింది.
గెలిచేది లేదని లైట్ తీసుకున్నారా?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంటేనే తెలంగాణ బీజేపీ నేతలు వణికిపోతున్నారు. ఎందుకంటే ఈ ఎన్నికలో ప్రచారానికి వెళ్లినా గెలుస్తామో లేదో అనే భయంతో పలువురి ఉన్నది. తాము పర్యటించే డివిజన్లలో ఓట్లు తక్కువగా వస్తే పరువు పోతుందనే ఆందోళనలో వారున్నట్లు తెలుస్తున్నది. అంతేకాకుండా ఈ లోక్ సభ సెగ్మెంట్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. అరవింద్ సైతం జూబ్లీహిల్స్‌లో పార్టీ గెలుపు బాధ్యత కిషన్ రెడ్డిపైనే ఉన్నదని పేర్కొన్నారు. అంతా కిషన్ రెడ్డి చూసుకుంటారనే ధీమాతో లైట్ తీసుకున్నారా? లేక ఎలాగూ గెలవబోమనే అంచనాకు వచ్చి సైలెంట్ అయ్యారా? అనేది అంతుచిక్కడం లేదు.
వస్తారా.. రారా?
ఈ నెల 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ జరగనున్నది. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారంలో ముందుకు సాగుతున్నాయి. బీజేపీ సైతం కార్పెట్ బాంబింగ్ పేరిట మహా పాదయాత్రలు చేపట్టి ఇంటింటికీ వెళ్లింది. ఇవాళ మరోసారి మాస్ క్యాంపెయిన్ చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. బోరబండ డివిజన్‌లో ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ప్రచారం చేపట్టనున్నారు. ఎర్రగడ్డ డివిజన్‌లో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే రామారావు పాటిల్, రెహ్మత్ నగర్ డివిజన్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త, వెంగళరావునగర్ డివిజన్‌లో ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, జాతీయ నాయకుడు మురళీధర్ రావు, శ్రీనగర్ కాలనీ డివిజన్ పరిధిలో ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ప్రచారం చేపడుతారు.
షేక్ పేట డివిజన్ పరిధిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్, యూసుఫ్ గూడ డివిజన్‌లో ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి పాల్గొంటారు. ఈ నెల 7, 8, 9 తేదీల్లో బీజేపీ భారీ రోడ్ షో లకు ప్లాన్ చేసింది. వీటిలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొంటారు. భవిష్యత్‌లో జరగబోయే లోకల్ బాడీ, జీహెచ్ఎంసీ ఎన్నికలకు రూట్ క్లియర్ అవ్వాలంటే బీజేపీకి ఈ ఎలక్షన్ ఎంతో కీలకం. అలాంటిది హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్‌గా చెప్పుకునే ఎంపీ అరవింద్ ప్రచారానికి దూరంగా ఉండడానికి కారణమేంటనేది అంతు చిక్కడం లేదు. ప్రచారానికి మరో వారం రోజులే సమయం మిగిలుండగా ఆయన ప్రచారానికి వస్తారా? లేదా? అని పార్టీ శ్రేణులు తెగ మాట్లాడుకుంటున్నారు.
Also Read: MP Dharmapuri Arvind: ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్.. ఢిల్లీలో ఎంపీ గరం గరం
